How to open a PPF account: ఇలా పీపీఎఫ్ ఖాతా తెరవండి.. ఆదాయ పన్ను మినహాయింపు పొందండి..
How to open a PPF account: ఆదాయ పన్ను మినహాయింపు పొందడానికి మరో మంచి మార్గం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో పెట్టుబడి పెట్టడం. పీపీఎఫ్ ఖాతాను ఎలా తెరవాలి?.. తదితర వివరాలను ఇక్కడ చూద్దాం..
How to open a PPF account: పీపీఎఫ్ ఖాతాను ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో ఓపెన్ చేయవచ్చు. ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా కొన్ని సింపుల్ స్టెప్స్ లో పూర్తి అవుతుంది.
ట్రిపుల్ టాక్స్ ఎగ్జెంప్షన్ బెనిఫిట్
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) భారతదేశంలో పన్ను ఆదా పెట్టుబడులు పెట్టాలనుకునే వ్యక్తులకు అత్యంత అనుకూలమైన, విశ్వసనీయమైన ఆప్షన్. ఇతర పన్ను ఆదా పథకాలతో పోలిస్తే పీపీఎఫ్ అత్యంత ఆకర్షణీయమైనది. ఇందులో ట్రిపుల్ టాక్స్ మినహాయింపు సౌలభ్యం ఉంది. అంటే, పీపీఎఫ్ (PPF) లో మీరు పెట్టిన పెట్టుబడులు, వాటిపై వచ్చే ఆదాయం, అలాగే, మెచ్యూరిటీ సమయంలో మీరు పొందిన మొత్తం.. ఈ మూడింటికీ పన్ను మినహాయింపు లభిస్తుంది.
ప్రభుత్వ మద్దతు
భారత ప్రభుత్వ మద్దతుతో, పీపీఎఫ్ స్థిరమైన, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తుంది. ప్రస్తుతం పీపీఎఫ్ పెట్టుబడులపై 7.1% (జనవరి 2024 నాటికి) వార్షిక వడ్డీ లభిస్తుంది. దీంతో, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు రిస్క్ లేకుండా చేరుకోవచ్చు. పీపీఎఫ్ పెట్టుబడులకు 15 సంవత్సరాల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అంటే, 15 సంవత్సరాల వరకు మీ పెట్టుబడులను వెనక్కు తీసుకోవడానికి వీలు ఉండదు. దానివల్ల, రిటైర్మెంట్ సమయానికి అవసరమైన మొత్తం చేతికి అందుతుంది. అయితే, అత్యవసరమైతే, ఏడేళ్ల తరువాత పాక్షికంగా విత్ డ్రా చేసుకోవచ్చు.
రూ. 500 లతో..
పీపీఎఫ్ లో కనిష్టంగా రూ. 500 నుంచి పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. గరిష్టంగా సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. 7 వ సంవత్సరం తరువాత, పిపిఎఫ్ పాక్షిక ఉపసంహరణలను అనుమతిస్తుంది మరియు మూడవ సంవత్సరం తరువాత బ్యాలెన్స్పై రుణాలు పొందవచ్చు, ఇది సవాలు కాలంలో కొంత లిక్విడిటీని అందిస్తుంది.
పీపీఎఫ్ ఖాతా తెరవడం ఎలా?
పీపీఎఫ్ పథకం మార్కెట్ అస్థిరతతో ప్రభావితం కాకుండా, హామీతో కూడిన, స్థిరమైన రాబడిని అందిస్తుంది. ఇది తక్కువ రిస్క్ ఇష్టపడే పెట్టుబడిదారులకు అనుకూలమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. అదనంగా, ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 80 సి కింద పెట్టుబడి పెట్టిన పెట్టుబడిపై ఆదాయపు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. మీ పీపీఎఫ్ ఖాతాను ఆన్ లైన్, ఆఫ్ లైన్ రెండింటిలోనూ ప్రారంభించవచ్చు.
పీపీఎఫ్ ఖాతాను ఆన్ లైన్ లో తెరవడం ఎలా?
పీపీఎఫ్ ఖాతాను ఆన్ లైన్ లో ఓపెన్ చేయడానికి, ఏదైనా బ్యాంక్ లేదా పోస్టాఫీసులో సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, లేదా మొబైల్ బ్యాంకింగ్ సేవలను కానీ యాక్టివేట్ చేసుకుని ఉండాలి.
స్టెప్ 1: ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ప్లాట్ ఫామ్ ద్వారా మీ ఖాతాను యాక్సెస్ చేసుకోండి.
స్టెప్ 2: “Open a PPF Account” లింక్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: మీరు మీ కోసం ఖాతాను తెరుస్తున్నట్లయితే "స్వీయ-ఖాతా" ఎంపికను ఎంచుకోండి. ప్రత్యామ్నాయంగా మీరు మైనర్ తరఫున ఖాతా తెరుస్తుంటే 'మైనర్ అకౌంట్' ఆప్షన్ ఎంచుకోండి.
స్టెప్ 4: అప్లికేషన్ ఫారంలో అవసరమైన వివరాలను నమోదు చేయండి.
స్టెప్ 5: ప్రతి ఆర్థిక సంవత్సరానికి మీరు ఖాతాలో జమ చేయాలనుకుంటున్న మొత్తాన్ని పేర్కొనండి.
స్టెప్ 6: మీ పొదుపు ఖాతా నుండి నిర్దిష్ట మొత్తాన్ని, మీకు అనువైన కాల వ్యవధులతో డెబిట్ కావడానికి ఆటో డెబిట్ ఆప్షన్ ను ఇనేబుల్ చేయండి.
స్టెప్ 7: అప్లికేషన్ సబ్మిట్ చేయండి. లావాదేవీ ఆథరైజేషన్ కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది.
స్టెప్ 8: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు వచ్చిన OTPని ఎంటర్ చేయండి.
స్టెప్ 9: మీ పీపీఎఫ్ ఖాతా ఓపెన్ అయింది. మీ స్క్రీన్ పై ధృవీకరణ సందేశం కనిపిస్తుంది. అలాగే, కన్ఫర్మేషన్ మెయిల్ కూడా మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ కు వస్తుంది.
ఆఫ్ లైన్ లో ఓపెన్ చేయడం..
ఆఫ్ లైన్ లో కూడా పీపీఎఫ్ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. అందుకోసం ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.
స్టెప్ 1: మీకు సేవింగ్ అకౌంట్ ఉన్న ఏదైనా బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి, PPF అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయాలి.
స్టెప్ 2: అవసరమైన డాక్యుమెంట్ లను బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ వద్ద ప్రతినిధికి సమర్పించండి.
పీపీఎఫ్ ఖాతాను ఎవరు తెరవొచ్చు?
భారత పౌరసత్వం ఉన్న వ్యక్తులు మాత్రమే వారి పేరు మీద పీపీఎఫ్ ఖాతా ను ఓపెన్ చేయడానికి అర్హులు. మైనర్ల తరఫున వారి తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు. ఖాతా తెరిచే సమయంలో భారత్ లో నివసిస్తూ ఉండి, ఆ తరువాత విదేశాలకు వెళ్లిన భారతీయులు పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు. ఎన్ఆర్ఐ హోదా పొందిన తర్వాత కొత్త ఖాతాను ప్రారంభించడానికి వారికి అనుమతి లేదు.
టాపిక్