తెలుగు న్యూస్  /  Business  /  How To Save Income Tax Under Various Sections In Fy 22-23?

How to save income tax: ఆదాయ పన్నును ఇలా తగ్గించుకోండి..

HT Telugu Desk HT Telugu

13 January 2023, 18:19 IST

  • మరో 3 నెలల్లో కొత్త ఆర్థిక సంవత్సరం (FY 2022–23) ప్రారంభమవుతుంది. ఆదాయ పన్ను చెల్లింపు దారులు ఇప్పటి నుంచే పన్ను తగ్గించుకునే మార్గాల కోసం అన్వేషణ ప్రారంభిస్తుంటారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారత్ లో ఆర్థిక సంవత్సరం (Financial Year) ఏప్రిల్ 1న ప్రారంభమై, మరుసటి సంవత్సరం మార్చి 31న ముగుస్తుంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమనగానే, టాక్స్ పేయర్స్ (tax payers) కు గుర్తుకు వచ్చేది పన్ను చెల్లింపు (Income tax). ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం (FY2022–23) లో ఆదాయ పన్నును తగ్గించుకోవడానికి ఉన్న చట్టబద్ధ మార్గాల గురించి తెలుసుకుందాం.

ఐటీ యాక్ట్ 1961

పన్ను మినహాయింపులకు సంబంధించి ఆదాయ పన్ను చట్టం (Income Tax Act 1961)లో పలు అవకాశాలను పొందుపర్చారు. డిడక్షన్స్(deductions), ఎగ్జెంప్షన్స్ (exemptions), అలవన్సెస్ (allowances).. తదితరాల రూపంలో ఈ మినహాయింపులను పొందవచ్చు. అయితే, ఈ మినహాయింపులన్నీ షరతులకు లోబడి ఉంటాయి. ఈ మినహాయింపులకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

80C: సెక్షన్ 80 సీ

ఆదాయ పన్ను చట్టంలోని ఈ 80 సీ సెక్షన్ కింద గరిష్టంగా రూ. 1,50,000 వేల వరకు మినహాయింపు పొందవచ్చు. ఎల్ ఐసీ ప్రీమియంలు(LIC premium), ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ (ELSS Schemes), పీపీఎఫ్ చందా (PPF contributions), టర్మ్ డిపాజిట్స్ (Term Deposits), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ (National Savings Certificates) మొదలైన వాటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ సెక్షన్ కింద మినహాయింపు పొందవచ్చు. అవి కాకుండా పిల్లల ట్యూషన్ ఫీజు (tuition fee), గృహ రుణాల అసలు చెల్లింపు (principal repayment of housing loan)లపై కూడా ఈ సెక్షన్ కింద మినహాయింపు పొందవచ్చు. అయితే, ఈ సెక్షన్ కింద గరిష్టంగా రూ 1.5 లక్షల మినహాయింపు మాత్రమే సాధ్యమవుతుంది.

80CCD(1B): సెక్షన్ 80 సీసీడీ(1బీ)

ఈ 80CCD(1B) సెక్షన్ కింద వ్యక్తులు అదనంగా రూ. 50 వేల వరకు ఆదాయ పన్ను మినహాయింపు పొందవచ్చు. నేషనల్ పెన్షన్ స్కీమ్ లో(National Pension Scheme NPS)) పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ మినహాయింపు పొందవచ్చు.

80 D: సెక్షన్ 80 డీ

ఆదాయ పన్ను చట్టంలోని ఈ 80 డీ చట్టం ప్రకారం రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. తనతో పాటు భార్య, తనపై ఆధారపడి ఉన్న పిల్లలు, తల్లిదండ్రులకు సంబంధించిన మెడికల్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం (medicak insurance premium), కేంద్ర ప్రభుత్వ హెల్త్ స్కీమ్స్ (central government health schemes) లో చెల్లింపుల ద్వారా ఈ మినహాయింపు లభిస్తుంది. సీనియర్ సిటిజన్ (senior citizen) మెడికల్ ఇన్స్యూరెన్స్ కోసం చెల్లింపు జరిపితే గరిష్టంగా రూ. 50 వేల వరకు మినహాయింపు ఉంటుంది. హెల్త్ ఇన్య్సూరెన్స్ (health insurance) లేని సీనియర్ సిటిజన్ వైద్య ఖర్చుల కోసం జరిపిన చెల్లింపులు కూడా ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి.

80G: సెక్షన్ 80 జీ

స్వచ్చంధ సంస్థలకు ఇచ్చిన విరాళాలకు ఈ 80G సెక్షన్ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. విరాళం పొందిన స్వచ్ఛంధ సంస్థ ను బట్టి 50% లేదా 100% డిడక్షన్ పొందవచ్చు.

80GG: సెక్షన్ 80జీజీ

ఏ ఉద్యోగి అయినా, తన యజమాని నుంచి హెచ్ఆర్ఏ(HRA) పొందని పక్షంలో, లేదా తన పేరుపై, లేదా తన భార్య పేరుపై సొంతంగా ఇల్లు లేని పక్షంలో చెల్లించే అద్దె ఖర్చును ఈ 80GG సెక్షన్ కింద పన్ను నహాయింపుగా పొందవచ్చు. రూ. 5 వేలు, లేదా 25% ఏటీఐ(ATI)లో ఏది తక్కువ ఉంటే ఆ మొత్తానికి మినహాయింపు వర్తిస్తుంది.

80TTA/80TTB: 80 టీటీఏ లేదా 80 టీటీబీ

సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల నుంచి వచ్చే వడ్డీ ఆదాయాన్ని 80TTA సెక్షన్ కింద, గరిష్టంగా రూ. 10 వేల వరకు మినహాయింపు పొందవచ్చు. అలాగే, సీనియర్ సిటిజన్లకు టర్మ్ డిపాజిట్లపై వడ్డీని కూడా 80TTB సెక్షన్ కింద, గరిష్టంగా రూ. 50 వేల వరకు మినహాయించారు.