HDFC merger : విలీనానికి వేళాయె.. నేడే హెచ్డీఎఫ్సీ- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మర్జర్..!
01 July 2023, 6:28 IST
- HDFC merger today : హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనం నేడు జరగనుంది. ఫలితంగా.. 44ఏళ్ల చరిత్ర కలిగిన హెచ్డీఎఫ్సీ సంస్థ కనుమరుగైపోనుంది.
నేడే హెచ్డీఎఫ్సీ- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మర్జర్..!
HDFC HDFC bank merger today : దేశ చరిత్రలోనే అతి పెద్ద 'మర్జర్'కు సమయం ఆసన్నమైంది. హౌజింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ.. తన సబ్సిడీ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో నేడు (శనివారం) విలీనం కానుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ఇరు కంపెనీల బోర్డులు శుక్రవారం ఆమోదించడంతో.. అతిపెద్ద మర్జర్కు లైన్ క్లియర్ అయ్యింది.
దేశంలోనే తొలి హోం ఫైనాన్స్ సంస్థ..
హెచ్డీఎఫ్సీ- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనంపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ఈ రివర్స్ మర్జర్తో.. 44ఏళ్ల చరిత్ర కలిగిన హెచ్డీఎఫ్సీ.. 2023 జులై 1 నుంచి కనుమరుగైపోతుంది. దేశంలోనే తొలి హోం ఫైనాన్స్ కంపెనీగా గుర్తింపు పొందిన హెచ్డీఎఫ్సీ.. ఇక కనిపించదు.
హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సంస్థలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన విషయం తెలసిందే. కాగా.. ఈ మర్జర్ తర్వాత హెచ్డీఎఫ్సీ షేర్లు స్టాక్ మార్కెట్లో కనిపించవు. ఇందుకోసం జులై 13ను రికార్డ్ డేట్‌గా నిర్ణయించాయి రెండు కంపెనీల బోర్డులు. ఆ తర్వాత హెచ్డీఎఫ్సీ షేర్హోల్డర్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లను కేటాయిస్తారు. 42 హెచ్డీఎఫ్సీ షేర్లున్న వారికి.. 25 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లభిస్తాయి. అదే సమయంలో హెచ్డీఎఫ్సీ వారెంట్లను కూడా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వారెంట్లుగా విక్రయించేందుకు జులై 13ని డేట్‌గా నిర్ణయించారు.
HDFC merger latest news : నాన్- కన్వర్టెబుల్ డిబెంచర్స్ బదిలీకి జులై 12, హెచ్డీఎఫ్సీ కమర్షియల్ పేపర్స్‌ను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేరుకు బదిలీ చేసేందుకు జులై 7న డేట్‌ను ఫిక్స్ చేశారు అధికారులు.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేరెంట్ కంపెనీ హెచ్డీఎఫ్సీ. కాగా పేరెంట్ కంపెనీని తనలో విలీనం చేసుకోవాలని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బోర్డు గతేడాది ఏప్రిల్‌లో నిర్ణయించింది. అప్పటి నుంచి వివిధ అనుమతులు పొందుతూ.. చివరికి ఈ రెండు సంస్థలు నేడు విలీనం కాబోతున్నాయి.
2023 మార్చ్ చివరి నాటికి.. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వ్యాపార విలువ రూ. 41లక్షల కోట్లుగా ఉంది. ఇక మర్జర్ తర్వాత ఏర్పడే కంపెనీ నెట్ వర్త్ రూ. 4.14లక్షల కోట్లుగా ఉండనుంది. ఇక లాభాల విషయానికొస్తే.. మార్చ్ 30 నాటికి అది రూ. 60వేల కోట్లుగా ఉంది.
మరోవైపు విలీనం అనంతరం హెచ్‌డీఎఫ్‌సీలోని ఉద్యోగులందరు.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉద్యోగులుగా మారిపోతారు.
దీపక్ పరేఖ్ రాజీనామా..
HDFC merger with HDFC bank : హెచ్డీఎఫ్సీ- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ఒక రోజు ముందు.. అంటే జూన్ 30న హెచ్డీఎఫ్సీ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు దీపక్ పరేఖ్. తన రాజీనామా విషయాన్ని ఈ వ్యాపార దిగ్గజం ముందే ప్రకటించారు. హెచ్‌డీఎఫ్‌సీతో తనకు ఉన్న 46ఏళ్ల అనుబంధానికి శనివారంతో ముగింపు పలికారు.
"నా బాధ్యతలను వేరొకరికి అప్పగించాల్సిన సమయం వచ్చింది. ఇక భవిష్యత్తుపై ఆశలు పెట్టుకోవడమే నేను చేసేది. హెచ్డీఎఫ్సీ షేర్హల్డర్లతో నేను మాట్లాడటం ఇదే చివరిసారి. కానీ హెచ్డీఎఫ్సీ భవిష్యత్తు అద్భుతంగా ఉండనుంది. మన చరిత్రను ఎవరు తుడిచేయలేరు. మన లేగేసీ ముందుకెళుతూనే ఉంటుంది," అని దీపక్ అన్నారు.