Car sales in November : పండుగే.. పండుగ- నవంబర్లోనూ అదిరిపోయిన ఆటో సంస్థల సేల్స్!
02 December 2022, 10:55 IST
Car sales in November 2022 in India : నవంబర్లోనూ ఆటో సంస్థలు పండుగ చేసుకున్నాయి. నవంబర్ వాహనాల విక్రయాల డేటాపై ఓ లుక్కేయండి.
పండుగ సీజన్ కొనసాగుతోంది.. నవంబర్‌లో అదిరి వాహనాల సేల్స్
Car sales in November 2022 in India : దేశంలో అక్టోబర్‌తో పండుగ సీజన్ ముగిసింది. కానీ ఆటో ఇండస్ట్రీకి మాత్రం ఇప్పటికీ పండుగ సీజన్ కొనసాగుతోంది. నవంబర్ కార్ల విక్రయాల డేటాను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. గత కొన్నేళ్లతో పోల్చుకుంటే.. విక్రయాల పరంగా ఆటో పరిశ్రమకు ఇదే ది బెస్ట్ నవంబర్‌గా నిలవడం విశేషం.
నవంబర్‌లో డీలర్స్కు డిస్ప్యాచ్ చేసిన వాహనాల్లో మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహింద్రా సంస్థ రెండంకెల వృద్ధిని సాధించాయి. ఇక కియా ఇండియా, హోండా కార్స్, స్కోడా, ఎంజీ మోటార్ల సేల్స్ కూడా బలంగా కనిపించాయి. టాయోటా కిర్లోస్కర్ మోటార్, నిస్సాన్‌లు మాత్రమే.. పరిశ్రమ జోరును అందుకోలేకపోయాయి. 2021 నవంబర్‌తో పోల్చుకుంటే.. వీటి డొమెస్టిక్ హోల్‌సేల్స్ పడిపోయాయి.
మారుతీ.. అదిరగొట్టింది..
Maruti Suzuki November car sales : దేశీయ దిగ్గజ ఆటో సంస్థ మారుతీ సుజుకీ.. నవంబర్ నెల 1,39,306 వాహనాలను విక్రయించింది. 2021 నవంబర్‌లో అది 1,17,791గా ఉంది. అంటే 18శాతం పెరిగినట్టు. బ్రెజా, ఎర్టిగా, గ్రాండ్ విటారాతో కూడిన యుటిలిటీ సెగ్మెంట్లో 32,563 వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇది 24,574గా ఉంది.
వాహనాల హోల్‌సేల్స్ పరంగా.. విక్రయాలు 3లక్షల యునిట్లు దాటడం ఇది వరుసగా 6వ నెల కావడం విశేషం. మొత్తం మీద.. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు.. 35లక్షలకుపైగా వాహనాలను విక్రయించినట్టు మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.
"2018లో 33.8లక్షల వాహనాలను విక్రయించాము. 2021 జనవరి నుంచి నవంబర్ వరకు 28లక్షల యూనిట్లను అమ్మాము. ఇప్పుటికే వాహనాల విక్రయాల సంఖ్య 35లక్షలు దాటింది. గతేడాదితో పోల్చుకుంటే 25శాతం పెరిగినట్టు. ఇక డిసెంబర్ ముగిసేసరికి.. ఏడాది మొత్తంలో మారుతీ సుజుకీ వాహనాల విక్రయాల సంఖ్య 38లక్షలు దాటుతుందని అంచనా వేస్తున్నాము," అని శశాంక్ వెల్లడించారు.
టాటా మోటార్స్‌కు పండుగే..!
Tata Motors car sales in November : 2021 నవంబర్‌లో 62,192 యూనిట్లను విక్రయించిన టాటా మోటార్స్.. ఈసారి 75,478 వాహనాలను అమ్మింది. ఫలితంగా ఏడాది కాలంలో 21శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక దేశీయ దిగ్గజ సంస్థ డొమెస్టిక్ సేల్స్ 27శాతం పెరిగి.. 73,467కు చేరింది.
ఈసారి ప్యాసింజర్ వాహనాల విక్రయాలే ఎక్కువగా ఉన్నాయి. 2021 నవంబర్(29,947)తో పోల్చుకుంటే.. 55శాతం వృద్ధితో.. 46,425 యూనిట్లను విక్రయించింది టాటా మోటార్స్.
ఇండియాలో ఈవీ సెగ్మెంట్లో ఎక్కువ మార్కెట్ షేరు కలిగి ఉన్న టాటా మోటార్స్.. తన జోరును కొనసాగిస్తోంది. ఈ నవంబర్‌లో 4,451 ఈవీలను విక్రయించింది. 2021 నవంబర్‌లో అది 1,811గా ఉండేది. అంటే.. 146శాతం వృద్ధిని సాధించినట్టు.
హ్యుందాయ్ మోటార్.. హుందాగా!
Hyundai Motor car sales : హ్యూందాయ్ మోటార్.. వాహనాల విక్రయం 30శాతం పెరిగింది. గతేడాది నవంబర్‌లో 37,001 యూనిట్లు విక్రయిస్తే.. ఈసారి ఆ సంఖ్య 48,003కి చేరింది. ఇక సంస్థ.. అత్యదిక డొమెస్టిక్ సేల్స్ చేసిన సంవత్సరంగా 2022 మిగిలిపోతుందని హ్యుందాయ్ మోటార్ ఇండియా డైరక్టర్ తరుణ్ గర్గ్ అభిప్రాయపడ్డారు.
హ్యుందాయ్ మోటార్ ఎగుమతులు కూడా భారీగానే పెరిగాయి. 61.5శాతం వృద్ధితో.. నవంబర్‌లో 16,001 యూనిట్లను ఎక్స్పోర్ట్ చేసింది ఆ సంస్థ. గతేడాది నవంబర్‌లో అది 9,009గా ఉండేది. మొత్తం మీద 2022 నవంబర్‌లో 64,004 యూనిట్లను విక్రయించింది ఆ ఆటో సంస్థ. గతేడాది ఇదే సమయంలో 46,910 యూనిట్లు మాత్రమే అమ్మింది.
జోరు మీదున్న మహీంద్రా అండ్ మహీంద్రా..
M&M car sales November data : మహీంద్రా అండ్ మహీంద్రా వాహనాల విక్రయాలు 45శాతం పెరిగాయి. మొత్తం మీద నవంబర్‌లో 58,303 యూనిట్లను విక్రయించింది. సంస్థ వాల్యూమ్‌లు 30,238గా ఉంది. ఇక 2021 నవంబర్‌తో 74 ప్యాసింజర్ వెహికిల్స్‌ను సంస్థ అమ్మితే.. ఈసారి అది 154కు చేరింది. అంటే రెండింతల వృద్ధి నమోదైనట్టు.
కియా ఇండియా.. కళకళ..!
ఈ ఏడాది నవంబర్‌లో 24,025 యూనిట్లను అమ్మింది కియా ఇండియా. ఇది 69శాతం వృద్ధితో సమానం. కియా సోనెట్, కియా సెల్టోస్, కియా కార్నివాల్‌కు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది.
స్కోడా.. ఎంజీ మోటార్..
స్కోడా ఆటో ఇండియా.. గత నెలలో రెండింతల వృద్ధిని సాధించింది. మొత్తం మీద 4,433 యూనిట్లను విక్రయించింది.
ఎంజీ మోటర్ రీటైల్ సేల్స్‌లో 64శాతం వృద్ధి నమోదైంది. ఈ నవంబర్‌లో 4,079 యూనిట్లను విక్రయించింది ఈ సంస్థ.
నిస్సాన్- టయోటాకు టాటా..!
Toyota car sales dip : నవంబర్‌లో టయోటా సంస్థ విక్రయాలు 10శాతం తగ్గాయి. మొత్తం మీద గత నెలలో 11,765 యూనిట్లను విక్రయించింది టయోటా. అర్బన్ క్రూయిజర్‌ను టయోటా డిస్కంటిన్యూ చేసింది. ఇన్నోవా డీజిల్ వర్షెన్ బుకింగ్స్‌ను నిలిపివేసింది. ఈ పరిణామాలతో విక్రయాలు తగ్గినట్టు కనిపిస్తోంది.
ఇక నిస్సాన్ పరిస్థితి కూడా ఇంతే. 2021 నవంబర్‌లో 2,651 యూనిట్లను విక్రయించిన నిస్సాన్ సంస్థ.. ఈసారి 2,400 వాహనాలను మాత్రమే అమ్మింది.