HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bengaluru To Chennai: బెంగళూరు నుంచి చెన్నైకి రెండున్నర గంటల్లోనే వెళ్లిపోవచ్చు.. త్వరలో ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం

Bengaluru to Chennai: బెంగళూరు నుంచి చెన్నైకి రెండున్నర గంటల్లోనే వెళ్లిపోవచ్చు.. త్వరలో ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం

HT Telugu Desk HT Telugu

10 July 2024, 14:34 IST

  • బెంగళూరు నుంచి చెన్నైకి తరచుగా సొంత వాహనంలో ప్రయాణించేవారికి శుభవార్త. ఇకపై ఈ రెండు మహా నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. త్వరలో ప్రారంభం కానున్న ఎక్స్ ప్రెస్ వే పై రెండున్నర నుంచి మూడు గంటల్లో చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్లిపోవచ్చు. ప్రస్తుతం ఇందుకు ఏడు నుండి ఎనిమిది గంటల సమయం పడుతుంది.

బెంగళూరు - చెన్నై ఎక్స్ ప్రెస్ వే
బెంగళూరు - చెన్నై ఎక్స్ ప్రెస్ వే (https://www.bharatinvit.com/)

బెంగళూరు - చెన్నై ఎక్స్ ప్రెస్ వే

వాహనదారులకు ఊరట కలిగించే విధంగా 262 కిలోమీటర్ల పొడవైన బెంగళూరు-చెన్నై ఎక్స్ ప్రెస్ వే (BCE) పూర్తి కావస్తోంది. ఈ బెంగళూరు-చెన్నై ఎక్స్ ప్రెస్ వే అందుబాటులోకి వస్తే, ప్రస్తుతం ఉన్న ఏడు నుంచి ఎనిమిది గంటల ప్రయాణ సమయం రెండు నుంచి రెండున్నర గంటలకు తగ్గుతుంది. ఈ ఎక్స్ ప్రెస్ వే వల్ల ఈ రెండు నగరాల మధ్య దూరం 80 కిలోమీటర్లు తగ్గుతుంది. ఈ ఎక్స్ ప్రెస్ వేపై అనుమతించిన గరిష్ట వేగం గంటకు 120 కి.మీ.

హోస్కోటే టు శ్రీపెరంబుదూర్

ఈ ఎక్స్ ప్రెస్ వే అధికారికంగా ఎన్ఇ -7 (NE 7)గా పిలుస్తారు. ఇది కర్నాటక రాజధాని బెంగళూరు సమీపంలోని హోస్కోటే నుంచి తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్ వరకు ఉంటుంది. ఇది 262 కిలోమీటర్ల పొడవైన రహదారి. 2024 డిసెంబర్ లోపు బెంగళూరు-చెన్నై ఎక్స్ ప్రెస్ వే ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ జూలై 4న ప్రకటించారు. నిజానికి, ఈ ఎక్స్ ప్రెస్ వే 2024 మార్చి నాటికే పూర్తవుతుందని అంచనా వేశారు.

రూ.17,930 కోట్ల వ్యయం

రూ.17,930 కోట్లకు పైగా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఎక్స్ ప్రెస్ వే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఈ మార్గంలో హోస్కోటే, మాలూరు, బంగారుపేట, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, వెంకటగిరికోట, పలమనేరు, బంగారుపాలెం, చిత్తూరు, రాణిపేట, శ్రీపెరంబుదూర్ తదితర పట్టణాలు ఉన్నాయి. ఈ రహదారిలో 240 కిలోమీటర్లు ఎనిమిది లేన్లుగా ఉంటుంది. మిగిలిన 22 కిలోమీటర్లు ఎలివేటెడ్ స్ట్రెచ్. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) భారత్ మాల పరియోజన కార్యక్రమంలో భాగంగా ఈ ఎక్స్ ప్రెస్ వే ను నిర్మిస్తోంది. 2022 మేలో బెంగళూరు- చెన్నై ఎక్స్ ప్రెస్ వే కు మోదీ శంకుస్థాపన చేశారు.

నాలుగు రూట్లు ఉన్నాయి..

ప్రస్తుతం బెంగళూరు నుంచి చెన్నైకి రోడ్డు మార్గంలో వెళ్లడానికి 3 రూట్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి హోసూరు, కృష్ణగిరి, స్వర్ణ చతుర్భుజి రహదారి, మరొకటి పాత మద్రాస్ రోడ్డు. మూడవ మార్గం కోలార్-కేజీఎఫ్-కోట, వేలూరు మీదుగా వెళ్తుంది. రెండు నగరాల మధ్య సుమారు 380 కిలోమీటర్ల పొడవైన స్వర్ణ చతుర్భుజి మార్గాన్ని (Golden Quadrilateral route) ఎక్కువగా ఉపయోగిస్తారు.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్