Chittoor Red Sandal: చిత్తూరు జిల్లాలో రెండు కోట్ల విలువైన ఎర్ర చందనం పట్టివేత, శేషాచలంలో ఆగని స్మగ్లింగ్
Chittoor Red Sandal: చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనం స్మగ్లింగ్ ను అటవీ పోలీసులు అడ్డుకున్నారు. పట్టుబడ్డ ఎర్ర చందనం ఏకంగా రెండు కోట్ల రూపాయల విలువ ఉంటుంది.
Chittoor Red Sandal: చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో అక్రమంగా ఎర్రచందనం స్మగ్లింగ్ ఎప్పటినుంచో జరుగుతుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ అడ్డుకునేందుకు అటవీ పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ, స్మగ్లింగ్ ఆగడం లేదు. గతంలో పలుసార్లు ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నవారు పట్టుబడ్డారు. కానీ లోపభూయిష్టమైన చర్యలతో ఎర్ర చందనం స్మగ్లింగ్ యథాతథంగా సాగుతుంది.
తమిళనాడుకు తరలింపు
రాష్ట్రంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసి, ఎక్కువగా పొరుగున ఉన్న తమిళనాడుకే తరలిస్తారు. ప్రస్తుతం కూడా రెండు కోట్లు విలువ చేసే ఎర్రచందనం దుంగలను తమిళనాడుకు తరలిస్తూ పట్టుపడ్డారు. ఆ ఎర్రచందనం దుంగలను చిత్తూరు అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న నిందితుడిని కూడా పట్టుకుని అరెస్టు చేశారు. పట్టుపడిన ఎర్రచందనం దుంగల బరువు నాలుగు టన్నులు ఉంటుంది.
తెల్లవారుజామున స్మగ్లింగ్
ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అటవీ పోలీసులకు రావడంతో తూర్పు విభాగం రేంజ్ అధికారి థామస్ ఆధ్వర్యంలో అటవీ అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగారు. ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్న వారిని రహస్యంగా బృందం వెంబడించింది.
మంగళవారం తెల్లవారుజామున ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్లు శ్రీనివాస మంగాపురం సమీపంలోని అడవుల్లో ఎర్రచందనం దుంగలను కారులో ఎక్కించి తమిళనాడులోని వేలూరుకు బయలుదేరి వెళ్తున్నారు. అయితే మార్గమధ్యలో అటవీ అధికారులు ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, స్మగ్లింగ్ చేస్తున్న వాహనం డ్రైవర్ వాహనాన్ని వెనక్కు తిప్పేందుకు ప్రయత్నించాడు.
దీంతో అటవీ అధికారులు, సిబ్బంది బృందం ఆ వాహనాన్ని వెంబడించారు. అయితే ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్న కారు వేగంగా వెళ్తూ రంగంపేట క్రాస్ వద్ద రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో స్మగ్లర్లు అక్కడ నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించారు. రంగంపేట క్రాస్ వద్ద ఇద్దరు స్మగ్లర్లు కారు దూకి పారిపోయారు.
అయితే తమిళనాడులోని తిరువన్నమలై జిల్లా కుటకరై ప్రాంతానికి చెందిన గోవిందరాజును పట్టుకున్నారు. ఆయనతో పాటు ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న కారును అదుపులోకి తీసుకున్నారు. గోవిందరాజును అరెస్టు చేసినట్లు డిఎస్ఓ చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు.
ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు చేపడతామని, స్మగ్లర్లను వదిలిపెట్టమని అటవీశాఖ అధికారులు అన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేసే వారిని పట్టుకునేందుకు నిరంతరం అటవీ అధికారులు గాలిస్తారని అన్నారు. రాత్రి పూట రవాణాలు జరుగుతున్నాయని, వాటిని అడ్డుకునేందుకు గస్తీ కాస్తున్నామని పేర్కొన్నారు.
గతంలో శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కూలీలను కాల్చవేయడం రాష్ట్రంలో సంచలనం అయింది. ఈ కాల్పుల్లో దాదాపు ఏడుగురు కూలీలు చనిపోయారు. అయితే ఎర్రచందనం స్మగ్లర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారులపై స్మగ్లర్లు దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం