Samruddhi Expressway bus accident : మహారాష్ట్ర సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే రోడ్లు నెత్తురోడుతున్నాయి! ఆరు నెలల వ్యవధిలో 88మంది ఈ నాగ్‌పూర్- ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రాణాలు వీడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ 88మందిలో 25మంది.. శనివారం జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
701 కి.మీల నాగ్‌పూర్ ముంబై సమృద్ధి ఎక్స్‌ప్రెస్ మహామార్గ్‌ను గతేడాది డిసెంబర్లో పాక్షికంగా ఓపెన్ చేశారు. ప్రస్తుతం నాగ్‌పూర్- నాసిక్‌లోని భర్విర్ వరకు 601కి.మీల ఎక్స్‌ప్రెస్‌వే మాత్రమే అందుబాటులో ఉంది.
గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటివరకు ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై ఏకంగా 616 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిల్లో 39 అత్యంత ఘోర ప్రమాదాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద 88మంది ప్రాణాలు కోల్పోగా.. 656మంది స్వల్పంగా/ తీవ్రంగా గాయపడిన వారు ఉన్నారు.
Samruddhi Expressway accidents : ప్రమాదాల్లో ఎక్కువగా రోడ్ హిప్నోసిస్ ఘటనలు వెలుగులోకి వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. హైవే/ రోడ్ హిప్నోసిస్ అంటే.. ప్రమాదం జరిగిన సమయంలో ఏం జరిగిందో డ్రైవర్‌కు గుర్తుండకపోవడం. మరోవైపు ఓవర్ స్పీడింగ్, డ్రైవర్లు నిద్రపోవడం, వీల్/ టైర్ పేలిపోవడం వంటి కారణాలతో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.
రోడ్డు ప్రమాదాల సమస్యను ఎదుర్కొనేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నట్టు మహారాష్ట్ర అధికారులు వెల్లడించారు. హైవే పోలీస్ వ్యవస్థ నిత్యం అప్రమత్తంగా ఉంటోందని వివరించారు.
ఇదే సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై.. శనివారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బుల్దానా జిల్లాలో ఎక్స్‌ప్రెస్‌వేపై వెళుతుండగా అనూహ్యంగా ఓ బస్సు టైర్ పగిలింది. బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి ఒక పక్కకు బోల్తా కొట్టింది. ఆ వెంటనే బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. డోర్ మూసుకుపోవడం, చాలా మంది ప్రయాణికులు నిద్రపోతుండటంతో ప్రమాదం తీవ్రత ఎక్కువైంది. కొందరు ఎలాగో అలా తప్పించుకున్నారు. కానీ 25మంది అగ్నికి ఆహుతైపోయారు. ప్రమాదం నుంచి డ్రైవర్ బయటపడ్డాడు.
Nagpur Mumbai Samruddhi express Mahamarg : బస్సు మంటల్లో కాలిపోతున్న సమయంలో అనేక వాహనాలు తమ పక్క నుంచి వెళ్లిపోయాయని, తమకు సాయం చేయలేదని ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు చెప్పారు.
దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఆత్యంత ఆందోళన కలిగించే విషయం. ముఖ్యంగా మహారాష్ట్రలో 2022లో 15,224 మంది రోడ్డు ప్రమాదాలకు బలైయ్యారు.
సంబంధిత కథనం