Bajaj CNG bike : ‘సిలిండర్​ ఎక్కడుంది?’- బజాజ్​ సీఎన్జీ బైక్​ డిజైన్​పై నితిన్​ గడ్కరీ ప్రశంసలు!-wheres the cylinder nitin gadkari amused at bajaj freedom cng bikes design ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bajaj Cng Bike : ‘సిలిండర్​ ఎక్కడుంది?’- బజాజ్​ సీఎన్జీ బైక్​ డిజైన్​పై నితిన్​ గడ్కరీ ప్రశంసలు!

Bajaj CNG bike : ‘సిలిండర్​ ఎక్కడుంది?’- బజాజ్​ సీఎన్జీ బైక్​ డిజైన్​పై నితిన్​ గడ్కరీ ప్రశంసలు!

Sharath Chitturi HT Telugu
Jul 06, 2024 11:15 AM IST

Bajaj Freedom CNG bike : ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ అయిన బజాజ్ ఫ్రీడమ్​ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. అనంతరం దాని డిజైన్​పై ప్రశంసల వర్షం కురిపించారు.

బజాజ్​ సీఎన్జీ బైక్​ని పరిశీలిస్తున్న నితిన్​ గడ్కరీ
బజాజ్​ సీఎన్జీ బైక్​ని పరిశీలిస్తున్న నితిన్​ గడ్కరీ

ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్​ని లాంచ్​ చేసి, ఆటోమొబైల్​ పరిశ్రమలో చరిత్ర సృష్టించింది దిగ్గజ బజాజ్​ ఆటో సంస్థ. ఆటోమొబైల్​ రంగంలో ఈ బజాజ్​ ఫ్రీడమ్​ సీఎన్జీ బైక్​ పెను సంచలనంగా మారే అవకాశం ఉంది. జులై 5న జరిగిన లాంచ్​ ఈవెంట్​లో పాల్గొన్న కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్​ గడ్కరీ.. తొలి సీఎన్జీ బైక్​ని రూపొందించించిన సంస్థపై ప్రశంసల వర్షం కురిపించారు.

“పర్యావరణ అనుకూలమైన, ఖర్చును ఆదా చేసే బైక్​ని తీసుకువచ్చిన బజాజ్ ఆటోలోని రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ బృందానికి అభినందనలు. దేశంలో వాయుకాలుష్యాన్ని తగ్గించడమే నా లక్ష్యం. పెట్రోల్ ట్యాంకు స్థానంలో ఇథనాల్​ను అమర్చి పర్యావరణ హితమైన మోటార్ సైకిల్​గా తీర్చిదిద్దాలని బజాజ్​ ఆటోను కోరాను. దీనికి బదులుగా 2 లీటర్ల ఇథనాల్ పంపును తయారు చేయాలని బజాజ్​ను కోరుతున్నాను. పెట్రోల్ ధర లీటరుకు రూ.100, సీఎన్జీ ధర రూ.60. పెట్రోల్ కూడా చాలా కాలుష్యాన్ని సృష్టిస్తుంది,” అని నితిన్​ గడ్కరీ అన్నారు.

ఫ్రీడమ్ సీఎన్జీ బైక్ డిజైన్, నాణ్యతను సైతం గడ్కరీ ప్రశంసించారు.

“ఇది నిజంగా అద్భుతమైన డిజైన్! సిలిండర్ ఎక్కడ ఉందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. మీరు ఎవరినైనా సవాలు చేసినా దాన్ని కనుగొనడం కష్టం,” అని గడ్కరీ తెలిపారు.

ఫ్రీడమ్ సీఎన్జీ బైక్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రాచుర్యం పొందుతుందని తాను ఆశిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పెట్రోల్ బైక్​లతో పోలిస్తే బజాజ్ ఫ్రీడమ్ సీఎన్జీ బైక్​కు ఎక్కువ మార్కెట్ లభిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

బజాజ్​ ఫ్రీడమ్​ సీఎన్జీ బైక్​ విశేషాలు..

భారతీయ ద్విచక్ర వాహన దిగ్గజం సీఎన్జీ బైక్​ను మూడు వేరియంట్లలో రూ .95,000 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్​తో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఫ్రీడమ్ సీఎన్జీ బైక్​ను ఆవిష్కరించారు.

బజాజ్ ఫ్రీడమ్ సీఎన్జీ బైక్ డ్యూయెల్ ఫ్యూయల్ ట్యాంక్ టెక్నాలజీతో వస్తుంది. ఈ మోటార్ సైకిల్​లో 2 లీటర్ల పెట్రోల్ ట్యాంకుతో పాటు ఒకేసారి 2 కిలోల గ్యాస్​ను నిల్వ చేయగల సీఎన్జీ ట్యాంక్ లభిస్తుంది. మోటారు సైకిళ్లలో ఉపయోగించే ప్రామాణిక ఇంధన ట్యాంకుల కంటే ఇది చిన్నదిగా కనిపిస్తుంది. ఫ్రీడమ్ సీఎన్జీ బైక్ యజమానులు రెండు ఫ్యూయెల్ మోడ్ల మధ్య అంతరాయం లేకుండా మారగలరని బజాజ్ తెలిపింది. ఫ్రీడమ్ సీఎన్జీ బైక్ సీఎన్జీ మోడ్​లో కిలోకు 102 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని, పెట్రోల్ మోడ్ లీటరుకు 64 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని ద్విచక్ర వాహన తయారీదారు పేర్కొన్నారు. ఇది నిజంగా పెద్ద విషయం అని చెప్పుకోవాలి.

కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 లో డీఆర్ఎల్ తో కూడిన రౌండ్ హెడ్ ల్యాంప్ ఉంటుంది. వెడల్పాటి హ్యాండిల్ బార్, సెంటర్-సెట్ ఫుట్ పెగ్స్ ఉన్నాయి. ఈ బైక్ సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ తో పాటు సీఎన్జీ లో-లెవల్ అలర్ట్, న్యూట్రల్ గేర్ ఇండికేటర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. బజాజ్ ఫ్రీడమ్ 125కు ప్రత్యక్ష పోటీ లేదు. కానీ ఇది హోండా షైన్ 125, హీరోగ్లామర్, టివిఎస్ఆర్ 125, హీరోఎక్స్ట్రీమ్ 125 ఆర్ సహా ఇతర 125 సీసీ మోటార్ సైకిళ్లకు గట్టి పోటీ ఇస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం