Bajaj Auto electric scooters : బజాజ్ ఆటో నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
23 June 2023, 7:52 IST
- Bajaj Auto new electric scooters : బజాజ్ ఆటో నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు వస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు..
బజాజ్ ఆటో నుంచి కొత్తగా రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
Bajaj Auto new electric scooters : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో జోరుగా వినిపిస్తున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థల నుంచి ఎలక్ట్రిక స్కూటర్లు రాబోతున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఈ జాబితాలోకి మరో దిగ్గజ సంస్థ బజాజ్ ఆటో కూడా చేరింది. 'స్వింగర్', 'జీనీ' వంటి రెండు పేర్లను బజాజ్ ఆటో ఇటీవలే రిజిస్టర్ చేసుకుంది. ఫలితంగా.. ఇవి రాబోయే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల పేర్లని వార్తలు వస్తున్నాయి.
ఇవి.. ఎలక్ట్రిక్ స్కూటర్ల పేర్లేనా..?
ఇండియా పేటెంట్స్ డిజైన్ అండ్ ట్రైడ్మార్క్స్ వెబ్సైట్లో స్వింగర్, జీనీ పేర్లు మే నెలలో దర్శనమిచ్చాయి. వీటిని బజాజ్ ఆటో ట్రైడ్మార్క్ చేసుకున్నట్టు తేలింది. వీటికి సంబంధించిన ఇతర వివరాలేవీ అందుబాటులో లేవు. కానీ ఇవి ఎలక్ట్రిక్ స్కూటర్లని మార్కెట్లో అంచనాలు మొదలయ్యాయి.
బజాజ్ ఆటోకు ప్రస్తుతం చేతక్ ఈవీ ఉంది. ఇక స్వింగర్, జీనీ కూడా చేతక్ సరసన చేరే అవకాశం ఉంది. అయితే.. ఒక పేరు ట్రేడ్‌మార్క్ చేసుకున్నంత మాత్రాన.. దానిని భవిష్యత్తులో కచ్చితంగా ఉపయోగించుకోవాలన్న రూల్ ఏమీ లేదు! గతంలోనూ.. ఆరా, హామర్, రేసర్ వంటి పేర్లను బజాజ్ ఆటో ట్రేడ్‌మార్క్ చేసుకుంది. కానీ వాటిని 2 వీలర్, 3 వీలర్లకు ఉపయోగించుకోలేదు. మరి జీనీ, స్వింగర్లను వాడుకుంటుందో లేదో చూడాలి.
ఇదీ చూడండి:- KTM electric scooter : కేటీఎం నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. లాంచ్ ఎప్పుడు?
అయితే.. ఎలక్ట్రిక్ స్కూటర్లతో మార్కెట్లో బజాజ్ ఆటో దండయాత్ర చేసేందుకు ప్లాన్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ట్రేడ్‌మార్క్ పేర్లు ఆసక్తి కలిగిస్తున్నాయి.
ఇక చేతక్ విషయానికొస్తే.. ఈ ఈవీని సప్లై చెయిన్ వ్యవస్థలో లోపాలు చాలా ఇబ్బంది పెట్టాయి. తాజాగా ఇవి తొలగిపోయినట్టు తెలుస్తోంది. ఫలితంగా చేతక్ ఈవీ వాల్యూమ్‌లు పెరుగుతాయని భావిస్తున్నారు. చేతక్ బ్రాండ్‌లోనే అని కొన్ని ప్రాడక్టులను కూడా సంస్థ తీసుకొస్తుందని తెలుస్తోంది. కానీ ఇవి లాంచ్ అయ్యేందుకు ఇంకాస్త సమయం పడుతుందని సమాచారం.
హోండా ఎలక్ట్రిక్ స్కూటర్లు..
ఇండియా 2 వీలర్ సెగ్మెంట్లో మార్కెట్ షేరును పెంచుకునేందుకు విపరీతంగా కృషిచేస్తోంది హోండా సంస్థ. సీబీఆర్250ఆర్ఆర్, సీఎల్300లకు ఇటీవలే పేటెంట్ పొందిన ఈ ఆటోమొబైల్ కంపెనీ.. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఫోకస్ పెంచింది. ఈ క్రమంలోనే కొత్తగా రెండు స్కూటర్లకు పేటెంట్లు ఫైల్ చేసింది.
హోండా తాజాగా పేటెంట్ పొందిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల పేర్లు డాక్స్ ఈ, జూమర్ ఈ అని తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల వర్షెన్లు మాడెర్న్గా ఉంటాయని సమాచారం. సైజు పరంగా రెండు చిన్నవే! అయితే వీటిల్లో బాష్ హబ్ మోటార్ ఉంటుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే వీటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80కి.మీల రేంజ్ రావొచ్చు. 25కేఎంపీహెచ్ టాప్ స్పీడ్ ఉండొచ్చు. హోండా డాక్స్ ఈ, జూమర్ ఈలో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈసీ ఇన్స్ట్రుమెంట్ స్క్రీన్, ఫ్రెంట్- రేర్‌లో డిస్క్ బ్రేక్స్ వంటివి ఫీచర్స్‌గా ఉండే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.