Amit Shah investments : ఆ 180 కంపెనీల్లో అమిత్ షా పెట్టుబడులు..
22 April 2024, 14:33 IST
- Amit Shah investment portfolio : కేంద్ర మంత్రి అమిత్ షా.. తన పెట్టుబడుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. మొత్తం 180 లిస్టెడ్ కంపెనీల్లో ఆయనకు పెట్టుబడులు ఉన్నాయి.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా..
Amit Shah investments : 2024 లోక్‌సభ ఎన్నికల కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఇటీవలే నామినేషన్ వేశారు. ఆ అఫిడవిట్లో అమిత్ షా ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో వివరాలు ఉన్నాయి. అమిత్ షాకి 180 లిస్టెడ్ సంస్థల్లో, ఆయన సతీమణి సోనాల్ అమిత్ భాయ్ షాకు 80 కంపెనీల్లో వాటాలు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. హిందుస్థాన్ యూనిలీవర్ (రూ.1.4 కోట్లు), ఎంఆర్ఎఫ్ (రూ.1.3 కోట్లు), కోల్గేట్-పామోలివ్ (రూ.1.1 కోట్లు), ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హైజీన్ హెల్త్ కేర్ (రూ.0.96 కోట్లు), ఏబీబీ ఇండియా (రూ.0.7 కోట్లు) వంటి కంపెనీల్లో అమిత్ షా పెట్టుబడులు పెట్టినట్లు నివేదికలు చెబుతున్నాయి.
అమిత్ షా లిస్టెడ్ పోర్ట్ఫోలియోలో విలువ.. రూ.17.4 కోట్లు! పైన చెప్పిన టాప్ 5 హోల్డింగ్స్ విలువ మాత్రమే మూడింట ఒక వంతు ఉంటుంది.
ఐదేళ్ల క్రితం అందుబాటులో ఉన్న డేటాతో పోల్చితే.. అమిత్ షా పోర్ట్ఫోలియోలో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. ఉదాహరణకు.. హిందుస్థాన్ యూనిలీవర్లో ఆయన హోల్డింగ్స్ రూ.84 లక్షల విలువైన 5,000 షేర్ల నుంచి రూ.1.4 కోట్ల విలువైన 6176 షేర్లకు పెరిగాయి. అయితే ఇతర టాప్ హోల్డింగ్స్ షేర్ల ఇన్వెస్ట్మెంట్లో ఎలాంటి మార్పులు లేవు.
2024 Lok Sabha elections : సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, కరూర్ వైశ్యా బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, కెనరా బ్యాంక్, గుజరాత్ ఫ్లోరోకెమికల్స్, లక్ష్మీ మెషీన్ వర్క్స్ వంటి కంపెనీల్లో.. సోనాల్ అమిత్భాయ్ షా పెట్టుబడులు ఉన్నాయి. లిస్టెడ్ సంస్థల్లో ఆమె మొత్తం ఆస్తుల విలువ రూ.20 కోట్లు.
ఇదీ చూడండి:- Ekagrah Murty : 5 నెలల పసికందు.. సంపద రూ. 4 కోట్లు- తాత వల్లే ఇదంతా!
గాంధీనగర్ లోక్‌సభ స్థానానికి అమిత్ షా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
"గత 30 ఏళ్లుగా ఈ సీటుతో నాకు అనుబంధం ఉంది. ఎంపీ కాకముందు ఈ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను. మీ ప్రేమకు కృతజ్ఞతలు. నేను ఒక సాధారణ బూత్ కార్యకర్త నుంచి ఇప్పుడు పార్లమెంటు సభ్యుడి స్థాయికి ఎదిగాను. నేను ఓట్లు అడిగినప్పుడల్లా గాంధీనగర్ ప్రజలు నన్ను ఆశీర్వదించారు,' అని నామినేషన్ దాఖలు చేసిన అనంతరం అమిత్ షా అన్నారు.
Amith Shah latest news : గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో కలిసి గాంధీనగర్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎంకే దవేకు నామినేషన్ పత్రాలను సమర్పించారు అమిత్ షా.
2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇదే గాంధీనగర్ సీటు నుంచి 5 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు అమిత్ షా.
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సోనాల్ పటేల్‌ను అమిత్ షాకు పోటీగా గాంధీనగర్ నుంచి బరిలోకి దింపింది.
ఇక.. గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు మే 7న మూడో దశలో పోలింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న వెలువడతాయి.