Amazon: అమేజాన్ లో భారీ రిక్రూట్మెంట్; పండుగ సీజన్ కు ముందు 1.1 లక్షల మందికి జాబ్స్
12 September 2024, 22:16 IST
భారత్ లో పండుగ సీజన్ ప్రారంభమవుతోంది. అక్టోబర్ నెల నుంచి జనవరి వరకు కొనసాగే ఈ పండుగ సీజన్ కోసం అన్ని కంపెనీలు సమాయత్తమవుతున్నాయి. భారత్ లో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమేజాన్ కూడా పండుగ సీజన్ సందర్భంగా కొత్తగా 1.1 లక్షల మందిని ఉద్యోగులుగా చేర్చుకుంది. వారిలో వేలాది మంది మహిళలు, వికలాంగులు ఉన్నారు.
అమేజాన్ లో భారీ రిక్రూట్మెంట్; పండుగ సీజన్ కు ముందు 1.1 లక్షల మందికి జాబ్స్
Amazon recruitment: రాబోయే పండుగ సీజన్ సందర్భంగా నెలకొనే డిమాండ్ ను ఎదుర్కొనేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమేజాన్ సిద్ధమవుతోంది. తాజాగా అమెజాన్ ఇండియా 1.1 లక్షలకు పైగా సీజనల్ ఉద్యోగాలను సృష్టించిందని కంపెనీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ముంబై, ఢిల్లీ, పుణె, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, లక్నో, చెన్నై వంటి నగరాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పలు ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపింది.
అన్ని ప్రధాన నగరాల్లో..
"భారతదేశం అంతటా లక్షకు పైగా సీజనల్ ఉపాధి అవకాశాలను అమేజాన్ సృష్టించింది. పండుగ సమయంలో దేశ శ్రామిక శక్తిని పెంచే దిశగా ఇది ప్రశంసనీయమైన చర్య" అని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ‘‘గణనీయమైన సంఖ్యలో మహిళలు, వికలాంగులను నియమించడం ప్రోత్సాహకరంగా ఉంది. అదే సమయంలో వారి భద్రత, ఆరోగ్య సంరక్షణ, విద్యా మద్దతుపై దృష్టి సారించాలి’’ అని మంత్రి అన్నారు.
వేలాది మహిళలు
తాజా నియామకాల ద్వారా అమెజాన్ వేలాది మంది మహిళలను, 1,900 మంది వికలాంగులను నియమించుకుందని కంపెనీ తెలిపింది. ‘‘ఈ పండుగ సీజన్లో భారతదేశంలోని దాదాపు అన్ని పిన్-కోడ్ ల పరిధిలోని వినియోగదారులకు వేగవంతమైన, నమ్మదగిన డెలివరీలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మా లాజిస్టిక్స్ నెట్ వర్క్ ను బలోపేతం చేయడానికి, పెరిగిన డిమాండ్ ను నిరాటంకంగా నిర్వహించడానికి మేము 1.1 లక్షలకు పైగా అదనపు వ్యక్తులను నియమించాము’’ అని అమెజాన్ (amazon) ఇండియా ఆపరేషన్స్ వీపీ అభినవ్ సింగ్ చెప్పారు.
ప్రాజెక్ట్ ఆశ్రయ్
అమెజాన్ ఇండియా ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో డెలివరీ అసోసియేట్లకు ప్రత్యేక విశ్రాంతి పాయింట్లను అందించే ప్రాజెక్ట్ ఆశ్రయ్ వంటి కార్యక్రమాలను కూడా ప్రవేశపెట్టింది. ‘‘సుశ్రుత అనేది ఒక సంక్షేమ కార్యక్రమం. ఇది ఎంపిక చేసిన ప్రాంతాలలో రోగ నిర్ధారణ, ఆరోగ్య శిబిరాల ద్వారా ట్రక్ డ్రైవర్లకు ఆరోగ్య సంరక్షణ మద్దతును అందిస్తుంది’’ అని అమేజాన్ తెలిపింది. అమెజాన్ ఇండియా తమ ఉద్యోగులకు ఆన్ సైట్ వైద్య సదుపాయాలు వంటి వివిధ సౌకర్యాలను అందిస్తుందని తెలిపింది. పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఈ-శ్రమ్ పోర్టల్, హెల్త్ ఐడీ వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉద్యోగులను నమోదు చేసుకునేలా ప్రోత్సహిస్తుందని తెలిపింది. అమేజాన్ లో దేశవ్యాప్తంగా 1.4 మిలియన్లకు పైగా అమ్మకందారులు ఉన్నారు.