Amazon coffee badging: ఉద్యోగుల ‘కాఫీ బ్యాడ్జింగ్’ ట్రిక్.. వారిపై వేటు వేసిన అమేజాన్. ఏంటీ ‘కాఫీ బ్యాడ్జింగ్?
Amazon coffee badging: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ రిటర్న్-టు-ఆఫీస్ విధానంలో ఒక లొసుగును అమెజాన్ ఉద్యోగులు కనుగొన్నారు. ‘కాఫీ బ్యాడ్జింగ్’ అనే పేరున్న ఆ లోపాన్ని ఉపయోగించి, పని వేళల నిబంధన నుంచి తప్పించుకునేవారు. ఈ విషయం గుర్తించిన అమేజాన్ అలాంటి ఉద్యోగులపై వేటు వేయడం ప్రారంభించింది.
Amazon coffee badging: ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ గత సంవత్సరం ప్రారంభించిన రిటర్న్-టు-ఆఫీస్ విధానాన్ని దాటవేసేందుకు 'కాఫీ బ్యాడ్జింగ్'ను ఆ సంస్థ ఉద్యోగులు కనిపెట్టారు. ఈ విషయాన్ని గుర్తించిన అమేజాన్, ఆఫీస్ లో ఉద్యోగులు గడిపే గంటల సంఖ్యను పర్యవేక్షించడం ప్రారంభించింది.
ఏమిటీ కాఫీ బ్యాడ్జింగ్? ఎలా చేస్తారు?
గతంలో అమేజాన్ లో ఉన్న నిబంధనల్లో.. ఉద్యోగులు ఆఫీస్ లో విధులు నిర్వర్తించాల్సిన కనీస గంటల నిబంధన లేదు. ఈ లొసుగును ఉద్యోగులు గుర్తించారు. దీన్ని ఉపయోగించుకోవడం ప్రారంభించారు. ఆఫీస్ కు వచ్చిన ఉద్యోగులు కాసేపు తమ సీట్ లో గడిపి, ఒక కాఫీ తాగి, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లిపోయేవారు. దీన్నే ‘కాఫీ బ్యాడ్జింగ్’ అనడం ప్రారంభించారు. ఉద్యోగులు ఆఫీస్ లో ఉండాల్సిన కనీస గంటల నిబంధన లేకపోవడంతో అమేజాన్ లో కాఫీ బ్యాడ్జింగ్ సాధ్యమైంది.
ఉద్యోగుల టెక్నిక్ పై అమేజాన్ రియాక్షన్
ఉద్యోగుల కాఫీ బ్యాడ్జింగ్ టెక్నిక్ ను అమేజాన్ కాస్త ఆలస్యంగా గుర్తించింది. వెంటనే, నిబంధనల్లో మార్పులు చేసింది. కాఫీ బ్యాడ్జింగ్ కు తరచుగా పాల్పడిన ఉద్యోగులపై వేటు వేసింది. ముఖ్యంగా, రిటైల్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి బృందాల్లోని ఉద్యోగులకు కార్యాలయంలో కనీసం 2 గంటలు గడపాలని, మరికొన్ని ఇతర ప్రాజెక్ట్ ల్లోని ఉద్యోగులు కనీసం 6 గంటలు ఆపీస్ లో ఉండాలని నిబంధనల్లో మార్పులు చేసింది.
అమెజాన్ ఉద్యోగులు కాఫీ బ్యాడ్జింగ్ ఎందుకు చేస్తున్నారు?
గత ఏడాది ప్రారంభంలో అమేజాన్ రిటర్న్ టు ఆఫీస్ నిబంధనలను అమలు చేయడం ప్రారంభించింది. అయితే, ఈ రూల్స్ కు ఉద్యోగుల నుండి భారీ ప్రతిఘటన ఎదురైంది. సుమారు 30,000 మంది ఉద్యోగులు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ అంతర్గత పిటిషన్ పై సంతకం చేశారు. అయినా, అమేజాన్ (amazon) పట్టించుకోలేదు. ఆఫీస్ కు రావాల్సిందేనని పట్టుబట్టింది. అలా రాని ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. దాంతో, ఉద్యోగులు ఇలా కాఫీ బ్యాడ్జింగ్ ను కనుగొన్నారు.
ఇతర కంపెనీల్లోనూ..
58 శాతం మంది హైబ్రిడ్ వర్కర్లు కాఫీ బ్యాడ్జింగ్ ను అంగీకరించారని వీడియోకాన్ఫరెన్సింగ్ కంపెనీ ఓల్ ల్యాబ్స్ గత ఏడాది నిర్వహించిన సర్వేలో తేలింది. రిటర్న్-టు-ఆఫీస్ విధానాలను అమలు చేసే విషయంలో సాధారణంగా మేనేజర్లు కఠినంగా వ్యవహరిస్తున్నారని డబ్ల్యూఎఫ్ హెచ్ రీసెర్చ్ నిర్వహించిన మరో సర్వేలో తేలింది. రిటర్న్ టు ఆఫీస్ విధానాలను వ్యతిరేకించిన ఉద్యోగులు తొలగింపును ఎదుర్కొంటున్నారని వారిలో 23% మంది చెప్పారు, ఇది 2022 లో 11% ఉంది.