SwiggyBoy Ganja Delivery: తిరుపతిలో గంజాయి డోర్ డెలివరీ చేస్తున్న స్విగ్గీ బాయ్, 22కేజీలు స్వాధీనం
SwiggyBoy Ganja Delivery: డబ్బు సంపాదన కోసం స్విగ్గీ డెలివరీ రూపంలో ఇంటి వద్దకే గంజాయి డోర్ డెలివరీ చేస్తున్న యువకుడిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 22 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఏజెన్సీలో గంజాయి కొనుగోలు చేసి తిరుపతిలో విక్రయిస్తున్నట్టు గుర్తించారు.
SwiggyBoy Ganja Delivery: ఏజెన్సీలో కిలో రూ.10వేలకు గంజాయి కొనుగోలు చేసి వాటిని చిన్న పాకెట్లుగా మార్చి తిరుపతిలో ఇంటి వద్దకే డెలివరీ చేస్తున్న స్విగ్గీ బాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉపాధి కోసం స్విగ్గీలో పని చేస్తూనే ఎవరికి అనుమానం రాకుండా గంజాయిని కస్టమర్లకు ఇంటి వద్దకు చేరవేస్తుండటం గుర్తించి పోలీసులు ఖంగుతిన్నారు. నిందితుడి వద్ద నుంచి 22కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
నగరి మండలం ఓజీకుప్పం గ్రామానికి చెందిన శ్రీనివవాస్ అనే యువకుడు తిరుపతి మారుతీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇది పైకి కనిపించే కవరింగ్.. అతను మరో పనికూడా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గత కొన్నాళ్లుగా తిరుపతిలో గంజాయి వినియోగంపై నిఘా పెట్టిన పోలీసులకు శ్రీనివాస్ కదలికలపై నిఘా ఉంచారు.
తరచూ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి వస్తుండటంతో నిందితుడిపై నిఘా ఉంచారు. స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూనే రెగ్యులర్ కస్టమర్లకు గంజాయి సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. అరకు ఏజెన్సీ ప్రాంతాల్లో కిలో రూ.10వేలకు గంజాయిని కొనుగోలు చేసి తిరుపతి తీసుకొస్తున్నాడు. వాటిని చిన్న పాకెట్లుగా మార్చి కస్టమర్లకు రూ.300 చొప్పున విక్రయిస్తున్నాడు. ఇలా కొన్ని నెలలుగా గంజాయి రవాణా చేసినట్టు గుర్తించారు.
నిందితుడిపై గతంలో అలిపిరి పిఎస్‌లో కూడా కేసు ఉంది.తాజాగా తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి డోర్ డెలివరీ చేస్తూ దొరికిపోయాడు. ఈసారి స్విగ్గీ డెలివరి బాయ్ రూపంలో విక్రయాలు చేస్తున్నట్టు గుర్తించారు. తిరుపతిలోని కొర్లగుంట మారుతీ నగర్‌లో స్విగ్గీ డెలివరీ నివాసం ఉంటూ ఆర్డర్ల ను బట్టి గంజాయి వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు.
చెడు అలవాట్లు గురై అక్రమ సంపాదన కోసం గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. అతని వద్ద గంజాయి కొనుగోలు చేస్తున్న వారిని కూడా గుర్తిస్తామని పోలీసులు తెలిపారు. గంజాయి నియంత్రణ కోసం తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్టు తిరుపతి పోలీసులు తెలిపారు.