YSRCP 2nd SIDDHAM Sabha: వైసీపీ దూకుడు - ఇవాళ ఏలూరు వేదికగా ‘సిద్ధం’ బహిరంగ సభ
03 February 2024, 5:50 IST
- YSR Congress Party Election Campaign 2024 : వచ్చే ఎన్నికలకు సిద్ధమంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసురుతోంది వైసీపీ. ఉత్తరాంధ్ర వేదికగా 'సిద్ధం' పేరుతో ఎన్నికల నగారా మోగించింది ఫ్యాన్ పార్టీ. అదే స్పీడ్ ను కంటిన్యూ చేస్తూ ఇవాళ ఏలూరు వేదికగా మరో భారీ సభను నిర్వహిస్తోంది.
ఏలూరులో వైసీపీ 'సిద్ధం' సభ
YSRCP Second Siddham Sabha in Eluru 2024: త్వరలో జరగనున్న ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ… 'సిద్ధం' పేరుతో భారీ సభలను తలపెడుతోంది వైసీపీ. ఉత్తరాంధ్ర గడ్డపై తొలి సభను నిర్వహించి విజయవంతం చేసింది. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని… భారీ విజయాన్ని అందుకునేందుకు నడుంబిగించాలని పిలుపునిస్తోంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ తన ప్రసంగాలతో క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేస్తూ…. కార్యకర్తలను సంసిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఏలూరు వేదికగా రెండో సిద్ధం బహిరంగ సభను తలపెట్టింది. ఇందుకు వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
భారీగా జన సమీకరణ…
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. భీమిలి వేదికపై నుంచి ఎన్నికల శంఖారావం పూరించగా…. ఆ పార్టీ అధినేత జగన్ గోదావరి ప్రాంతం వైపు దృష్టి సారిస్తున్నారు. భీమిలీ సభను మించి ఉండేలా ఉమ్మడి కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలతో, అంటే మొత్తం 50 నియోజకవర్గాల ప్రజలతో భారీ సభకు రూపకల్పన చేశారు. ఈ సభకు దాదాపు 4 నుంచి 5 లక్షల మంది ప్రజలు రానున్న క్రమంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏలూరు జిల్లా దెందులూరులోని సహారా గ్రౌండ్స్ లో ఈ సభ జరుగుతోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జిల్లాకు చెంది నేతలు సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భారీగా కార్యకర్తలను తరలించి… ప్రతిపక్ష పార్టీలకు గట్టి సవాల్ విసిరాలని చూస్తున్నారు. పార్టీ హైకమాండ్ సూచనలతో…. పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశానికి మద్ధతుగా కార్యకర్తలు పలు చోట్ల ప్రతిజ్ఞ చేశారు. సీఎం జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోడానికి 'మేము సిద్ధం - మా బూత్ సిద్ధం' నినాదంతో ప్రతిజ్ఞ చేశారు.
2019 ఎన్నికల వేళ కూడా వైసీపీ అధినేత జగన్ ఎన్నికల శంఖారావాన్ని ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభించారు. మరోసారి ఇదే సెంటిమెంట్ ను కొనసాగించేలా ఉత్తరాంధ్ర నుంచే ఎలక్షన్ క్యాంపెయిన్ ను షురూ చేశారు. వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. కేడర్ లో సరికొత్త జోష్ ను నింపే ప్రయత్నం చేస్తూనే… ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మరోసారి విక్టరీనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు వైఎస్ జగన్. ఏలూరు సభలోనూ ప్రతిపక్ష పార్టీలపై జగన్ మరోసారి ఘాటైన విమర్శలు చేసే అవకాశం ఉంది.
వ్యూహాత్మంగానే ‘సిద్ధం’ అనే పదాన్నే ఒక సందేశంగా ప్రజల్లోకి తీసుకువెళ్తోంది వైసీపీ. ఇదంతా కూడా ఐప్యాక్ టీమ్ డైరెక్షన్ లో జరుగుతోందని తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన నగరాల్లో సిద్ధం హోర్డింగులను కనిపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలోనూ తెగ పోస్టులు దర్శనమిస్తున్నాయి. రాబోయే రోజుల్లో వైసీపీ… మరింత దూకుడు పెంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు అభ్యర్థుల ఖరారుపై కూడా కసరత్తు చేస్తోంది వైసీపీ అధినాయకత్వం. తాజాగా ఆరో జాబితాను కూడా విడుదల చేసింది. ఎంపీ స్థానాలతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల విషయాల్లో క్లారిటీ ఇస్తోంది. కొత్తగా ఇంఛార్జ్ లుగా నియమితులైన వారికే టికెట్లు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.