YSRCP 'SIDDHAM' Campaign : 'సిద్ధం' అంటున్న వైసీపీ - ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం, ఇవాళే తొలి సభ
YSR Congress Party Election Campaign: ఎన్నికలకు సిద్ధమవుతోంది అధికార వైసీపీ. ఇందులో భాగంగా… 'సిద్ధం' పేరుతో అతి భారీ సమావేశాలను నిర్వహించనుంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని భీమిలి వేదికగా ఇవాళే తొలి సభను తలపెట్టింది.
YSR Congress Party Election Campaign 2024: ఎన్నికల ఏడాదిలోకి రావటంతో యుద్ధానికి సిద్ధమంటోంది అధికార వైసీపీ. ఇప్పటికే అభ్యర్థుల విషయంలో తెగ కసరత్తు చేస్తున్న ఫ్యాన్ పార్టీ…. ఎన్నికల క్యాంపెయిన్ ను కూడా ప్రారంభించబోతుంది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 'సిద్ధం' పేరుతో భారీ సభలను తలపెట్టాలని నిర్ణయించగా… ఇవాళ తొలి సభ భీమిలి వేదికగా జరగనుంది. ఇదే సభ నుంచి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 'సిద్ధం' పేరుతో అతి భారీ క్యాడర్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది వైసీపీ. తొలి సమావేశాన్ని ఇవాళ (జనవరి 27) భీమిలిలో నిర్వహించనుంది. ఇందుకోసం ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఈ సభకు హాజరుకానున్నారు. పార్టీ కార్యకర్తలు 3.5 నుండి 4 లక్షల వరకు హాజరు కావచ్చని పార్టీ అంచనా వేస్తోంది. ఇప్పటికే క్యాడర్‌కు సందేశాలు, IVRS మరియు ఆహ్వానాలను అందించారు. మరోవైపు సభ ఏర్పాట్లను కూడా పూర్తి అయ్యాయి. ఉత్తరాంధ్రకు సంబంధించిన నేతలు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఎన్నికల శంఖారావం పూరించనున్న జగన్…
2019 ఎన్నికల వేళ కూడా వైసీపీ అధినేత జగన్ ఎన్నికల శంఖారావాన్ని ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభించారు. మరోసారి ఇదే సెంటిమెంట్ ను కొనసాగించేలా ఉత్తరాంధ్ర నుంచే ఎలక్షన్ క్యాంపెయిన్ ను షురూ చేయనున్నారు. ఈ సభ నుంచి నేతలు, కార్యకర్తలకు స్పష్టమైన సందేశం ఇవ్వనున్నారు జగన్. వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. కేడర్ లో సరికొత్త జోష్ ను నింపే ప్రయత్నం చేయనున్నారు. మరోసారి విక్టరీనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు వైఎస్ జగన్.
‘సిద్ధం’ అంటూ సీఎం జగన్ చేస్తున్న ఎన్నికల యుద్ధ నినాదంపై వైఎస్సార్‌సీపీ క్యాడర్‌కు ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. డిజిటల్, వాట్సాప్ స్పేస్‌లో ఎన్నికల స్లోగన్ సిద్ధంను విస్తృతంగా తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఓ వైపు టీడీపీ ప్రచార యంత్రాంగాన్ని తలదన్నేలా ’సిద్ధం' కాంపెయిన్ రెడీ చేశారు. టీడీపీ-జనసేనతో పాటు వాటితో కలిసే జాతీయ పార్టీల కూటమిపై పోరాడేందుకు - సిద్ధంగా ఉన్నామని సందేశాన్ని ఇవ్వాలని భావిస్తున్నారు. భీమిలి వేదికగా సాగే తొలి సభను విజయవంతం చేసి…. ప్రతిపక్షాలకు గట్టి సవాల్ విసిరాలని చూస్తున్నారు. సరికొత్త జోష్ తో ఎన్నికల కదనరంగంలోకి దింగాలనుకుంటున్నారు.
వ్యూహాత్మంగానే ‘సిద్ధం’ అనే పదాన్నే ఒక సందేశంగా ప్రజల్లోకి తీసుకువెళ్తోంది వైసీపీ. ఇదంతా కూడా ఐప్యాక్ టీమ్ డైరెక్షన్ లో జరుగుతోందని తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన నగరాల్లో సిద్ధం హోర్డింగులను కనిపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలోనూ తెగ పోస్టులు దర్శనమిస్తున్నాయి. రాబోయే రోజుల్లో వైసీపీ… మరింత దూకుడు పెంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
ఏలూరు ‘సిద్ధం’ సభ వాయిదా…
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ‘సిద్ధం’ పేరుతో సభలు నిర్వహించాలని వైసీపీ నిర్ణయించగా… ఇప్పటికే కార్యాచరణను సిద్ధం చేసింది. భీమిలి తర్వాత రాజమండ్రిలో కూడా నిర్వహించనన్నారు. ఇక ఏలూరులో నిర్వహించాల్సిన సభను వాయిదా వేసింది వైసీపీ. ఈ సభ జనవరి 30న జరగాల్సి ఉంది. కానీ ఫిబ్రవరి 1వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు.