YSRCP SIDDHAM: “సిద్ధం” పేరుతో ఏపీలో వైసీపీ భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు
YSRCP SIDDHAM: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా “సిద్ధం” పేరుతో నాలుగు భారీ బహిరంగ సభల నిర్వహిస్తోంది.
YSRCP SIDDHAM: ఏపీలో ఎన్నికల వేళ వైఎస్సార్సీపీ 'సిద్ధం' పేరుతో నాలుగు అతి భారీ క్యాడర్ సమావేశాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. తొలి సమావేశాన్ని జనవరి 27వ తేదీన భీమిలిలో నిర్వహిస్తున్నారు.
ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. పార్టీ కార్యకర్తలు 3.5 నుండి 4 లక్షల వరకు హాజరు కావచ్చని పార్టీ అంచనా వేస్తోంది. ఇప్పటికే క్యాడర్‌కు సందేశాలు, IVRS మరియు ఆహ్వానాలు పంపించారు.
‘సిద్ధం’ అంటూ సీఎం జగన్ చేస్తున్న ఎన్నికల యుద్ధ నినాదంపై వైఎస్సార్‌సీపీ క్యాడర్‌కు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. డిజిటల్, వాట్సాప్ స్పేస్‌లో ఎన్నికల స్లోగన్ సిద్ధంను విస్తృతంగా తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నారు.
ఓ వైపు టీడీపీ ప్రచార యంత్రాంగాన్ని తలదన్నేలా - సిద్ధం కాంపెయిన్ రెడీ చేశారు. టీడీపీ-జనసేనతో పాటు వాటితో కలిసే జాతీయ పార్టీల కూటమిపై పోరాడేందుకు - సిద్ధంగా ఉన్నామని సందేశాన్ని ఇవ్వాలని భావిస్తున్నారు.
ఇటీవల ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షర్మిల రాక వెనుక ఉన్న కుట్రలపై ఎదురు దాడి చేసేలా సిద్ధం కాంపెయిన్ రెడీ చేస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
మారుతున్న రాజకీయాలు…
ఆంధ్రప్రదేశ్‌లో గత 2-3 నెలల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొత్త కాంపెయిన్ స్ట్రాటజీలను తెరపైకి తెచ్చారు. టీడీపీ, జనసేన మధ్య పొత్తు, వైఎస్సార్ కుటుంబాన్ని చీల్చి, షర్మిలను ముందుకు తెచ్చి జాతీయ పార్టీ కుట్రలు చేస్తోందని వైసీపీ భావిస్తోంది.
రాజకీయ పార్టీలన్నీ బహుళ రాజకీయ వ్యూహకర్తల తలుపులు తడుతున్నారు. వీటన్నిటి మధ్య, సీఎం జగన్ కోసం కొత్త పదంతో సమాధానం ఇస్తామని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘సిద్దం!’ నినాదంతో ఎన్నికలకు రెడీ అంటూ 2024 ఎన్నికల కోసం వైయస్ఆర్‌సీపీ రాజకీయ ప్రచారాన్ని అధికారికంగా నగారా మోగించనుందని చెబుతున్నారు.
రాత్రికి రాత్రి వెలసిన హోర్డింగ్‌లు….
రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఒక్క రాత్రిలోనే అన్ని ప్రధాన హాట్‌స్పాట్‌లు లేదా ముఖ్య కూడళ్లలో హోర్డింగ్‌లు / బిల్‌బోర్డ్‌తో కళకళలాడుతున్నాయి. ప్రజల్ని ఆకర్షించేలా వీటిని రూపొందించారు.
డిజైన్‌లో వైఎస్‌ఆర్‌సీపీ జెండాతో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ముఖాన్ని పొందుపరిచారు, వ్యూహాత్మకంగా జగన్ చిత్రం పక్కన ఉంచారు, కొడుకు ముందుకు తీసుకువెళుతున్న కల మరియు వారసత్వానికి ప్రతీకగా ఈ పోస్టర్ ద్వారా వ్యక్తం చేస్తున్నట్లు వైసీపీ ప్రతినిధులు చెబుతున్నారు.
వ్యూహాత్మంగా సిద్ధం అనే పదమే ఒక సందేశంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. గ్లోబల్ ట్రెండ్‌లో పొడవాటి టైటిల్స్ వాడుతున్న తరుణంలో జగన్ వారికి భిన్నంగా సిద్దం అని ఒక్క మాటతో ముందుకు వచ్చారని జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ కాంపెయిన్ విధుల్లో పాల్గొంటున్న ఒకరు వివరించారు. జగన్ తరచూగా రానున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధమని అంటున్నారని, ఆ మాటకు జోడింపుగా సిద్ధం అనే సందేశంతోనే ఈ ప్రచారాన్ని ప్రారంభించినట్టు చెబుతున్నారు.
సిద్ధం కాంపెయిన్ పోస్టర్‌లో ఆశ్చర్యార్థకం గుర్తులో పిడికిలి కూడా చూపించామని, అందులో చాలా లోతైన అర్థం ఉందని వివరణ ఇస్తున్నారు. తన కార్యకర్తలు ఈ సమావేశాలకు కదిలిరావాలని జగన్ పిలుపునిచ్చినట్లుగా వివరిస్తున్నారు. ఎన్నికల్లో సవాళ్లనైనా, పొత్తులనైనా, కుట్రలనైనా ఎదుర్కొనేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేస్తోందని చెబుతున్నారు.
పోస్టర్ లో వైసీపీ కార్యకర్తలు తమ నాయకుడితోపాటు తాము కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెబుతూ, చేతులు పైకెత్తడం ద్వారా జగన్ పిలుపుకు ప్రతిస్పందిస్తున్నట్లు రూపొందించారు.
సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ తన ‘స్టార్ క్యాంపెయినర్లు’ అని సంభోదిస్తున్నారని, ప్రజలకు పిలుపునిచ్చేలా హోర్డింగులపై సిద్ధం కాంపెయిన్ చేపట్టినట్టు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 75 రోజులకు ఎన్నికల టోన్ ని సెట్ చేయడానికి ఇవన్నీ డిజైన్‌లో అద్దినట్లు చెబుతున్నారు.
రాజకీయనేతగా, ప్రతిపక్షనేతగా, ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పని చేసిన జగన్ గురించి తెలిసిన వారికి, తాము ఎప్పటినుండో చూసిన జగన్‌కు పూర్తి భిన్నంగా జగన్ మోహన్ రెడ్డిని 2019కి భిన్నంగా 2.0 విడుదల చేయబోతున్నారనేది డిజైన్ వెనుక ఆంతర్యంగా తెలుస్తోంది. వైసీపీకి రాజకీయ వ్యూహకర్తలుగా పనిచేస్తున్న ఐ పాక్ ఆధ్వర్యంలో వీటిని రూపొందించారు. ఒక్క రాత్రిలోనే ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన నగరాల్లో హోర్డింగులను ఏర్పాటు చేశారు.