Jiva on Yatra 2: ఏపీ రాజకీయాల గురించి తెలియదు.. జగన్ పాత్ర బాధ్యతాయుతంగా చేశా: హిందుస్థాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో జీవా
Jiva on Yatra 2: యాత్ర 2లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాత్ర పోషించిన తమిళ నటుడు జీవా.. ఇక్కడి రాజకీయాలు, జగన్ పాత్ర పోషించడాన్ని ఎలా స్వీకరించాడన్న విషయాలపై హిందుస్థాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
Jiva on Yatra 2: పదేళ్ల కిందట రంగం అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జీవా.. ఇప్పుడు నేరుగా యాత్ర 2 మూవీ ద్వారా టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు. ఈ సినిమాలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాత్ర పోషిస్తున్న జీవా.. హిందుస్థాన్ టైమ్స్ తో చాలా అంశాలపై మాట్లాడాడు.
మమ్ముట్టి నటించిన యాత్ర చిత్రానికి సీక్వెల్ గా దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా యాత్ర 2 ఫిబ్రవరి 8న విడుదల కానుంది. సీక్వెల్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్ర గురించి, ఆ పాత్రను తాను ఎలా ఎదుర్కొన్నానో, భవిష్యత్తు కోసం తన వద్ద ఉన్న భారీ ప్రణాళికల గురించి ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో జీవా స్పందించాడు.
యాత్ర 2 చేయడానికి సందేహించాను: జీవా
మొదట్లో యాత్ర 2 మూవీకి సరే అని చెప్పడానికి తాను సంకోచించానని జీవా అన్నాడు. ఆ పాత్ర చాలా పెద్దది కావడమే కాదు, భాష కూడా తెలియదు. జగన్ స్థాయిని చూసి తాను సందేహించానని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని, తనకు తెలుగు పైపైన మాత్రమే తెలుసని అన్నాడు.
ఈ సినిమాలో తానే డబ్బింగ్ చెప్పుకోకపోయినా, తాను సరిగ్గా నటించాలంటే డైలాగులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని తనకు తెలుసని జీవా చెప్పాడు. జగన్ పాత్రలో నటించడాన్ని చాలా బాధ్యతగా తీసుకున్నానని, దీనికోసం రెండు నెలల పాటు శిక్షణ తీసుకున్నట్లు వివరించాడు.
ఓ నటుడిగానే చూశాను
ప్రతిపక్షాలను నైతికంగా తప్పుగా చిత్రీకరించే యాత్ర 2 వంటి సినిమా రాజకీయ పరిణామాలను, ఎన్నికల సంవత్సరంలో విడుదలయ్యే అంశాలను విస్మరించలేం. దీని గురించి జీవాను అడగకముందే తనకు రాజకీయాల గురించి తెలియదని స్పష్టం చేశాడు. ''నా దృష్టిలో ఈ సినిమా అంతా తండ్రికి కొడుకు ఇచ్చే ప్రామిస్ గురించే. దాన్ని అతను ఎలా సాధిస్తాడనేదే ముఖ్యం. దైవ మగన్ లేదా గాడ్ ఫాదర్ మూవీలాగే మహీ నాకు ఈ సినిమాను వివరించాడు. నేను కూడా ఈ చిత్రాన్ని కళాత్మక దృక్పథంతో మాత్రమే చూశాను" అని జీవా వెల్లడించాడు.
12 ఏళ్ల వెయిటింగ్
అనుష్క శెట్టి సైజ్ జీరో, నాగచైతన్య కస్టడీ వంటి చిత్రాల్లో అతిథి పాత్రలు పోషించిన జీవా.. డైరెక్ట్ తెలుగు సినిమాలో కథానాయకుడిగా నటించిన తొలి చిత్రమిది. ఇంతకాలం ఎందుకు వెయిట్ చేశావని అడగ్గా.. 'ఏం చెప్పాలో తెలియడం లేదు, నాకు అద్భుతమైన ఆఫర్ రాలేదు. ఇక్కడ రంగం భారీ హిట్ అయినప్పటికీ నన్ను ఎవరూ సంప్రదించలేదు. యాత్ర 2 లాంటి సినిమా కోసం 12 ఏళ్లు వెయిట్ చేశాను. యాత్రలో జగన్ తండ్రి దివంగత ఏపీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిగా మమ్ముట్టి నటనను చూశానని, తన నటుల నుంచి ఉత్తమమైన వాటిని ఎలా రాబట్టుకోవాలో మహీకి తెలుసని తాను భావించానని జీవా చెప్పారు.
'నేను హైదరాబాద్ లో పెరిగాను'
జీవా చెన్నైకి చెందినవాడు కాగా, అతని తండ్రి సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్.బి.చౌదరి తమిళం, మలయాళంతో పాటు కొన్ని మంచి తెలుగు చిత్రాలను నిర్మించారు. ''నేను మా నాన్నతో కలిసి తరచూ ఇక్కడికి వస్తుంటాను, ఇక్కడే పెరిగాను కాబట్టి హైదరాబాద్ లో షూటింగ్ చేయడం ప్రత్యేకంగా అనిపించింది. నాన్న నాగార్జున, వెంకటేష్ తదితరులతో సినిమాలు చేశాడు. నేను తెలుగు సినిమాలు ఎందుకు చేయడం లేదని ఇక్కడి వాళ్లు నన్ను తరచుగా అడగడం నాకు గుర్తుంది. అప్పుడు నాకు భాష తెలియదు, కానీ ఇప్పుడు, నాకు సాకు లేదు" అని జీవా చెప్పారు.