YSRCP Incharges Sixth List : వైసీపీ ఆరో జాబితా విడుదల -మైలవరంలో కొత్త అభ్యర్థి, తాజా లిస్ట్ లో కీలక స్థానాలు
YSRCP Incharges Latest List : కొత్త ఇంఛార్జులకు సంబంధించి ఆరో జాబితాను విడుదల చేసింది వైసీపీ అధినాయకత్వం. ఈ లిస్ట్ లో పలు పార్లమెంట్ స్థానాలతో మరికొన్ని అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జులను నియమించింది. చిత్తూరు ఎంపీ స్థానానికి సంబంధించి మరోసారి మార్పు చేసింది.
YSRCP Sixth Incharges List 2024: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల ఇంఛార్జులను మార్చిన ఫ్యాన్ పార్టీ… తాజాగా ఆరో జాబితాను కూడా వెల్లడించింది. ఇందులో నాలుగు పార్లమెంట్ స్థానాలతో పాటు 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జులను ప్రకటించింది. ఈ జాబితాను మంత్రి మేరుగ నాగార్జున,సజ్జల రామకృష్ణ రెడ్డి విడుదల చేశారు.
వైసీపీ ఆరో జాబితా :
రాజమండ్రి(ఎంపీ)-గూడూరి శ్రీనివాస్,.
నర్సాపురం(ఎంపీ)-అడ్వకేట్ ఉమా బాల.
గుంటూరు (ఎంపీ) - ఉమ్మారెడ్డి వెంకట రమణ.
చిత్తూరు(ఎంపీ)- ఎన్.రెడ్డప్ప.
మైలవరం(ఎమ్మెల్యే) - తిరుపతి రావు యాదవ్.
మార్కాపురం( ఎమ్మెల్యే)- అన్నా రాంబాబు.
నెల్లూరు సిటీ( ఎమ్మెల్యే)- ఎండీ ఖలీల్.
ఎమ్మిగనూరు ( ఎమ్మెల్యే)- బుట్టా రేణుక.
గిద్దలూరు ( ఎమ్మెల్యే)- కుందూరు నాగార్జున రెడ్డి.
జీడీ నెల్లూరు( ఎమ్మెల్యే) -కె.నారాయణస్వామి.
రాజమండ్రి ఎంపీగా భరత్ ఉండగా… ఇంఛార్జ్ బాధ్యతలను గూడూరి శ్రీనివాస్ కు అప్పగించింది వైసీపీ. ఇక నర్సాపురం నుంచి అడ్వకేట్ ఉమాబాల పేరు ఖరారైంది. ఇక్కడ్నుంచి గతంలో రఘురామకృష్ణరాజు వైసీపీ నుంచి గెలిచినప్పటికీ… కొంతకాలానికి పార్టీ అధినాయకత్వం ఎదురుతిరిగారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో చేరలేదు. మరోవైపు చిత్తూరు ఎంపీ స్థానం విషయంలో మరోసారి మార్పు చేసింది ఫ్యాన్ పార్టీ. గత జాబితాలో ఎంపీగా నారాయణస్వామి ప్రకటించింది. అయితే తాజా జాబితాలో సిట్టింగ్ ఎంపీ రెడ్డప్పకే మరోసారి ఇంఛార్జ్ బాధ్యతలను అప్పగించింది. డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణస్వామి మరోసారి జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇంఛార్జ్ గా కొనసాగనున్నారు.
మైలవరం విషయంలో అంతా అనుకున్నట్లే జరిగింది. ఇక్కడ్నుంచి వసంత కృష్ణ ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయన ప్లేస్ లో తిరుపతి రావు యాదవ్ ను నియమించింది వైసీపీ హైకమాండ్. నెల్లూరు సిటీ స్థానానికి ఎండీ ఖలీల్ పేరు, ఎమ్మిగనూరుకు బుట్టా రేణుక పేరును ఖరారు చేసింది. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఉమ్మారెడ్డి వెంకట రమణను ఖరారు చేసింది.
ఇటీవలే వైసీపీ పార్టీ ఐదో జాబితాను ప్రకటించగా… ఇందులో కీలకమైన నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది. ఇక్కడి బాధ్యతలను నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ కు అప్పగించింది.
వైసీపీ ఐదో జాబితా:
అరకు వ్యాలీ(ఎస్టీ)- రేగం మత్స్య లింగం
సత్యవేడు(ఎస్సీ)-నూకతోటి రాజేష్
అవనిగడ్డ- డా.సింహాద్రి చంద్రశేఖరరావు
కాకినాడ(ఎంపీ)- చలమలశెచ్చి సునీల్
మచిలీపట్నం(ఎంపీ)-సింహాద్రి రమేష్ బాబు
నర్సారావుపేట(ఎంపీ)-పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్
తిరుపతి(ఎస్సీ)(ఎంపీ)-మద్దిల గురుమూర్తి
సీఎం జగన్ ఆదేశాలతో పార్టీ రీజినల్ కో-ఆర్టినేటర్ విజయసాయిరెడ్డికి అదనంగా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారు. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం, కందుకూరు, సంతనూతలపాడు, కావలి అసెంబ్లీ నియోజకవర్గాలకు రీజినల్ కో-ఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించింది అధిష్టానం. ఇప్పటి వరకూ తొలి జాబితాలో 11 స్థానాలకు, రెండో జాబితాలో 27 స్థానాలకు, మూడో జాబితాలో 21 స్థానాలకు, నాలుగో జాబితాలో 8 స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను మార్పుచేర్పు చేసింది వైసీపీ.