YS Jagan On CBN : 'చంద్రబాబు గారు ఇకనైనా మేల్కోండి'... కాలేజీలో రహస్య కెమెరాల ఘటనపై జగన్ ఫైర్
30 August 2024, 18:06 IST
- చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజిలో రహస్య కెమెరాల ఘటనపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని హితవు పలికారు.
చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఫైర్
చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. ప్రభుత్వ విద్యాసంస్థలపై నిర్లిప్తత, కాలేజీలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఆక్షేపించారు. ప్రతిపక్షపార్టీపై బురదజల్లుడు వ్యవహారాలు, రెడ్‌బుక్ రాజ్యాంగం అమల్లోనే ప్రభుత్వ పెద్దలు, యంత్రాంగం అంతా మునిగిపోయి పాలనను గొలికొదిలేశారని దుయ్యబట్టారు.
అత్యంత దారుణం - వైఎస్ జగన్
“నూజివీడు ట్రిపుల్ ఐటీ సహా గవర్నమెంటు రెసిడెన్షియల్ స్కూళ్లలో కలుషితాహారం కారణంగా వందలమంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందన అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రి కావడంతో అసలు ఏమీ జరగలేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పిల్లలకు నాణ్యతతో, రోజూ ఒక మెనూతో పెట్టే మధ్యాహ్న భోజనం, గోరుముద్ద పథకాన్నీ అత్యంత ఘోరమైన కార్యక్రమంగా మార్చేశారు” అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘చంద్రబాబు గారు మేల్కోండి…’
గుడ్లవల్లేరు ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలు పెట్టినట్టుగా వస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి అని జగన్ అన్నారు. విద్యార్థుల జీవితాలను అతాకుతలంచేసే ఘటన అని…. చంద్రబాబు ఇకనైనా మేలుకోవాలని హితవు పలికారు. “విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి, వారి భవిష్యత్తును పణంగా పెట్టకండి” అంటూ జగన్ ప్రకటన విడుదల చేశారు.
మరోవైపు కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమేరాలు ఉన్నాయనే అంశంపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తో పాటు, ఎస్పీ గంగాధర్ రావు విద్యార్థినుల నుంచి వివరాలు సేకరించారు. విద్యార్థినుల ఆందోళనపై వాస్తవ పరిస్థితులను విచారిస్తున్నారు. జోరు వానలో విద్యార్థినులు నిరసన కొనసాగించడంతో ప్రభుత్వంవ వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు, ఎల్లుండి హాస్టల్ విద్యార్థులకు సెలవులు ప్రకటించింది. మరోవైపు కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులను తల్లిదండ్రులు తీసుకెళ్తున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే బుధవారం నుంచి తమ ఆందోళనలను మరింత తీవ్రం చేయాలని విద్యార్థులు భావిస్తున్నారు.
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల లో నిన్న జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ ప్రకటించారు. పోలీసులు నిందితుల ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను విద్యార్థులు మరియు కాలేజీ స్టాఫ్ ఎదురుగా పరిశీలించారన్నారు. విద్యార్థినులు ఈ సమస్య గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కేసు విచారణలో ఉందని, ఈ నేరంలో తప్పు చేసిన వారిని గుర్తించి వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.