Nuzvid IIIT: విద్యార్థులకు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి.. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతోంది?
Nuzvid IIIT: నూజివీడు ట్రిపుల్ ఐటీ.. ఏపీలో మంచి పేరున్న విద్యా సంస్థ. కానీ.. ఇప్పుడు నూజివీడు ట్రిపుల్ ఐటీ అంటే భయపడే పరిస్థితి నెలకొంది. వందలాది మంది విద్యార్థులు ఒకేసారి అస్వస్థతకు గురయ్యారు. అందుకు కారణాలు తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు షాక్ అవుతున్నారు.
నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్‌తో వెయ్యిమందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అపరిశుభ్ర వాతావరణం, నాసిరకం ఆహారంతో గత వారం నుంచి వందల మంది విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. విద్యార్థులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో అల్లాడిపోతున్నారు. ఈ వ్యవహారం బయటకు రాకుండా దాచి పెట్టాలని నూజివీడు ట్రిపుల్ ఐటీ అధికారులు చూస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
మైదా పిండి.. నీళ్ల సాంబారు..
నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఉన్న వంట గదిలో.. పాత్రలు, గ్రైండర్లు కడగకుండానే వాడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. పులిసిపోయిన పిండి, పాడైన పెరుగు, చపాతీల్లో మైదా పిండి కలుపుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ఇక సాంబారు అయితే.. నీళ్లలాగా ఉంటుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా.. పట్టించుకునే వారు లేరని విద్యార్థులు చెబుతున్నారు.
తల్లిదండ్రుల్లో ఆందోళన..
ఏలూరు జిల్లాలో ఉన్న నూజివీడు ట్రిపుల్ ఐటీలో.. కేవలం ఏపీ విద్యార్థులే కాదు.. తెలంగాణ విద్యార్థులు కూడా చదువుతున్నారు. ట్రిపుల్ ఐటీలో ఒకేసారి ఇంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో.. స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలకు ఏమైందోనని నూజివీడుకు పరుగులు తీస్తున్నారు. వారు చికిత్స పొందుతున్న ఆస్పత్రులకు వెళ్తున్నారు.
ఆందోళనకు గురి చేసింది..
'నూజివీడు ట్రిపుల్ ఐటీలో గత 3 రోజులుగా విద్యార్థులు పెద్దఎత్తున అనారోగ్యానికి గురయ్యారన్న వార్త నన్ను ఆందోళనకు గురి చేసింది. దీనిపై తక్షణమే స్పందించి విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా అధికారులను అదేశించాను. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. ఇటువంటివి పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత అధికారులపై ఉంది' అని నారా లోకేష్ స్పష్టం చేశారు.