తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Viveka Murder Case : వివేకా హత్యకేసులో అల్లుడు, బామ్మర్దిని విచారించాలి….

YS Viveka Murder Case : వివేకా హత్యకేసులో అల్లుడు, బామ్మర్దిని విచారించాలి….

HT Telugu Desk HT Telugu

27 November 2022, 9:25 IST

    • YS Viveka Murder Case వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన అల్లుడు, బామ్మర్దిలను కూడా విచారించాలని నిందితుడు శివశంకర్‌ రెడ్డి భార్య పులివెందుల కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. వివేకానంద రెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయని, రాజకీయ వారసత్వం కోసం వివేకా హత్యకు అల్లుడు, పెద్ద బావమరిది కుట్ర పన్నారని ఆరోపించడం కలకలం రేపింది. పులివెందులలో ఆధిపత్యం కోసం టీడీనీ నాయకుడు బీటెక్‌ రవి కుట్రలో భాగమయ్యారని పేర్కొన్నారు. భూ వివాదాలు, రాజకీయ కారణాలతో వివేకా హత్యకు మరో ముగ్గురు సహకరించినట్లు ఆరోపించారు. వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ ఉద్దేశ పూర్వకంగా కేసును తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు.
వైఎస్ వివేకానంద రెడ్డి
వైఎస్ వివేకానంద రెడ్డి

వైఎస్ వివేకానంద రెడ్డి

YS Viveka Murder Case మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. షమీమ్‌ అనే మహిళను వైఎస్‌ వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుమార్తె, అల్లుడు, పెద్దబావమరిదితో తలెత్తిన ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలే ఈ హత్యకు కారణమంటూ వివేకా హత్య కేసులో అరెస్టయిన దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల మెజిస్ట్రేట్‌ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

TTD SVITSA 2024 : విద్యార్థులకు మంచి ఛాన్స్..! ఎస్వీ శిల్ప కళాశాలలో ప్రవేశాలు - టీటీడీ ప్రకటన

AP POLYCET Results 2024 : ఇవాళ ఏపీ పాలిసెట్ 'ఫైనల్ కీ' - ఫలితాలు ఎప్పుడంటే..?

AP Weather : రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మంగళవారం భారీ వర్షాలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బామ్మర్ది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డిలు హత్యకు కుట్ర పన్నారని చెప్పారు. పులివెందులలో రాజకీయ ఆధిపత్యం కోసం టీడీపీ నాయకుడు బీటెక్‌ రవి, ఆర్థిక, రాజకీయ విభేదాలతో కొమ్మారెడ్డి పరమేశ్వరరెడ్డి, వైజీ రాజేశ్వరరెడ్డి, నీరుగట్టు ప్రసాద్‌లు ఈ హత్య కుట్రలో భాగస్వాములయ్యారని కోర్టుకు తెలిపారు. వారందరిని విచారిస్తే ఈ హత్య కేసును ఛేదించవచ్చన్నారు. సీబీఐ ఉద్దేశ పూర్వకంగానే కేసును తప్పుదారి పట్టిస్తోందని ఫిర్యాదు చేశారు.

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కుట్ర కోణం దాగుందని, సరైన రీతిలో సీబీఐ దర్యాప్తు సాగడం లేదని శివశంకర్‌ రెడ్డి భార్య తులసమ్మ ఈ ఏడాది ఫిబ్రవరి 21న పులివెందుల న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దాదాపు ఏడు నెలల తర్వాత న్యాయస్థానం ఆమె వాంగ్మూలాన్ని శనివారం నమోదు చేసింది. కేసు విచారణను డిసెంబర్‌ 24కు వాయిదా వేశారు. తులసమ్మ వాంగ్మూలంలోని వివరాలను ఆమె న్యాయవాదులు రవీంద్రారెడ్డి, కోదండరామిరెడ్డిలు కడపలో వెల్లడించారు.

వైఎస్‌ వివేకానందరెడ్డి షమీమ్‌ అనే మహిళను రెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుటుంబంలో తలెత్తిన విభేదాలే ఈ హత్యకు దారి తీశాయని చెబుతున్నారు. బెంగళూరులో ల్యాండ్ సెటిల్‌మెంట్‌ ద్వారా వచ్చే రూ.4 కోట్లను తన రెండో భార్య షమీమ్‌కు ఇస్తాననడంతోపాటు ఆమె ద్వారా తనకు కలిగిన కుమారుడిని తన వారసుడిగా ప్రకటిస్తానని వివేకానందరెడ్డి చెప్పడంతో వివాదాలు మొదలయ్యాయని ఆరోపించారు. వివేకానందరెడ్డి రాజకీయ వారసత్వం ఆశిస్తున్న అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావమరిది శివ ప్రకాశ్‌రెడ్డి ఆయనపై కక్ష పెంచుకుని హత్యకు కుట్రపన్ని ఉండొచ్చన్నారు

.వివేకానందరెడ్డి చనిపోయిన విషయాన్ని పీఏ కృష్ణారెడ్డి మొదట ఆయన కుటుంబ సభ్యులకే తెలిపారని, రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం, ఆ ప్రదేశాన్ని వివేకా అనుచరుడు ఇనయతుల్లా తన సెల్‌ఫోన్‌ ద్వారా ఫొటోలు, వీడియోలు తీసి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డిలకు వాట్సాప్‌ చేశారని, అవి చూసిన తర్వాత కూడా శివప్రకాశ్‌రెడ్డి గుండెపోటుగా ప్రచారం చేశారన్నారు.

వివేకా రాసినట్లు చెబుతున్న లేఖ, సెల్‌ఫోన్‌ను తాము వచ్చే వరకు పోలీసులకు అప్పగించవద్దని పీఏ కృష్ణారెడ్డికి, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆదేశించారని, వారు పులివెందుల చేరుకున్న తర్వాత వివేకా సెల్‌ఫోన్లోని మెసేజ్‌లు, ఇతర వివరాలను డిలీట్‌ చేసిన తర్వాతే వాటిని పోలీసులకు అప్పగించారని ఆరోపించారు. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డిలే కుట్ర పన్ని వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేయించారని స్పష్టమవుతోందని తులసమ్మ ఆరోపించారు. వివేకా హత్య కేసులో సిబిఐ నిరపరాధుల్ని వేధిస్తోందని సరైన తీరులో దర్యాప్తు సాగేలా ఆదేశించాలని శివశంకర్‌ రెడ్డి కుటుంబ డిమాండ్ చేస్తోంది.

టాపిక్