తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Jagan Case : కోర్టు ఆదేశాలు తప్పంటూ కావాలనే కాలయాపన, జగన్ అక్రమాస్తుల కేసుపై సుప్రీంకోర్టు అసహనం!

YS Jagan Case : కోర్టు ఆదేశాలు తప్పంటూ కావాలనే కాలయాపన, జగన్ అక్రమాస్తుల కేసుపై సుప్రీంకోర్టు అసహనం!

07 August 2024, 22:54 IST

google News
    • YS Jagan Case : మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సీబీఐ అఫిడవిట్ ఆశ్చర్యం కలిగిస్తుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. కేసు ట్రయల్ మొదలు కాకుండానే ఇన్ని కేసులు ఎలా ఫైల్ చేశారని సీబీఐని ప్రశ్నించారు.
జగన్ అక్రమాస్తుల కేసుపై సుప్రీంకోర్టు అసహనం!
జగన్ అక్రమాస్తుల కేసుపై సుప్రీంకోర్టు అసహనం!

జగన్ అక్రమాస్తుల కేసుపై సుప్రీంకోర్టు అసహనం!

YS Jagan Case : ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలు షాకింగ్‌ కలిగిస్తున్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. ఉండి ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా అన్నారు. కేసులు ట్రయల్‌ ప్రారంభం కాకుండానే ఇన్ని కేసులు ఎలా ఫైల్‌ చేశారంటూ సీబీఐని న్యాయమూర్తి ప్రశ్నించారు.

ఆరుగురు జడ్జిలు మారిపోయారు

కేసులు నమోదు అయిన నాటి నుంచి ఆరుగురు జడ్జిలు మారిపోయారని, రిటైర్‌ అయ్యారని, గత పదేళ్లుగా కాలయాపన చేస్తున్నారంటూ రఘురామ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. దీనికి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా అసహనం వ్యక్తం చేశారు. ఒక కోర్టు ఇచ్చిన ఆదేశాలు తప్పంటూ మరో కోర్టుకు ఆ కోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా తప్పంటూ మరో కోర్టుకు వెళ్తూ కాలయాపన చేస్తున్నారని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుల ఉత్తర్వులు తప్పు అని చేస్తున్న వ్యవహారానికి ట్రయల్‌కి సంబంధం లేదని జస్టిస్‌ ఖన్నా వ్యాఖ్యానించారు.

విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని

జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణను వేగవంతం చేయాలని, విచారణ తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ తరఫు న్యాయవాది కోరారు. తెలంగాణ నుంచి డిశ్చార్జ్‌ పిటిషన్లు వేస్తున్నారని, కోర్టు సాధారణ కార్యకలాపాలకు ఇది అడ్డంకిగా మారుతోందని రఘురామ తరఫు న్యాయవాది ధర్మాసనం ఎదుట చెప్పారు. సీబీఐ తరఫు వాదనలు వినిపించడానికి ఎ.ఎస్‌.జి.రాజు అందుబాటులో లేరని ఇతర న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. ఎ.ఎస్‌.జి. రాజును వెంటనే పిలిపించాలంటూ విచారణను నవంబర్ 11 కి వాయిదా వేశారు. ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అనుసరించాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా సీబీఐకి సూచించారు.

భద్రత కుదింపుపై హైకోర్టులో జగన్ పిటిషన్

తన భద్రత కుదింపుపై వైసీపీ అధినేత జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా జగన్ తరపున వాదనలు వినిపిస్తూ…. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం కూడా సరిగా పనిచేయడంలేదన్న న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం నిర్వహణ ఎవరిదని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం ఇంటెలిజెన్స్‌దని ప్రభుత్వం తరపున న్యాయవాది తెలిపారు. పిటిషనర్ కు మంచి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం, జామర్‌ ఇవ్వొచ్చు కదా అని న్యాయమూర్తి అడిగారు. ఇందుకు అడ్వొకేట్ జనరల్ స్పందిస్తూ…. వేరే బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం ఉందో లేదో తెలుసుకుని చెబుతామన్నారు.

మధ్యాహ్నాం తర్వతా మరోసారి విచారణ జరిగింది. జగన్‌కు ఉన్న బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం రీప్లేస్‌ చేస్తామని కోర్టుకు సర్కార్ తెలిపింది. జగన్‌ భద్రతా సిబ్బంది సమాచారం ఇస్తే జామర్‌ ఇస్తామని పేర్కొంజి. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.

తదుపరి వ్యాసం