తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pg Medical: పీజీ వైద్య విద్య రిజిస్ట్రేషన్లు దాదాపుగా పూర్తి,అడ్మిషన్ల ప్రక్రియలో తొందరపాటులేదు-ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ

PG Medical: పీజీ వైద్య విద్య రిజిస్ట్రేషన్లు దాదాపుగా పూర్తి,అడ్మిషన్ల ప్రక్రియలో తొందరపాటులేదు-ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ

06 October 2024, 20:03 IST

google News
    • PG Medical Education : రాష్ట్రంలో పీజీ వైద్య విద్య ప్రవేశాల రిజిస్ట్రేషన్ దాదాపుగా పూర్తైందని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ప్రకటించింది.రిజిస్ట్రేషన్ ప్రక్రియను లేటు ఫీజు అవసరం లేకుండా ఈ నెల 7 వరకు పొడిగించినట్లు పేర్కొంది. అడ్మిషన్ల ప్రక్రియ తొందరపాటుగా చేపడుతున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తమని తెలిపింది.
పీజీ వైద్య విద్య రిజిస్ట్రేషన్లు దాదాపుగా పూర్తి,అడ్మిషన్ల ప్రక్రియలో తొందరపాటులేదు-ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ
పీజీ వైద్య విద్య రిజిస్ట్రేషన్లు దాదాపుగా పూర్తి,అడ్మిషన్ల ప్రక్రియలో తొందరపాటులేదు-ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ

పీజీ వైద్య విద్య రిజిస్ట్రేషన్లు దాదాపుగా పూర్తి,అడ్మిషన్ల ప్రక్రియలో తొందరపాటులేదు-ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ

రాష్ట్రంలో పీజీ వైద్య విద్యలో చేరే విద్యార్థులంద‌రూ రిజిస్ట్రేష‌న్ పూర్తి చేసుకున్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాల‌యం జారీ చేసిన నోటిఫికేష‌న్ మేర‌కు రిజిస్ట్రేష‌న్ ప్రక్రియ గ‌త నెల 27న మొద‌ల‌య్యింది. నేటి మ‌ధ్యాహ్నం వ‌ర‌కు 8,645 మంది పీజీ వైద్య విద్యలో ప్రవేశాల కోసం రిజిస్ట్రేష‌న్ చేసుకున్నట్లు వైద్య విశ్వవిద్యాల‌యం అధికారులు తెలిపారు. ఈ ఏడాది జ‌రిగిన పీజీ నీట్ ప‌రీక్షలో దాదాపు 9 వేల మంది పీజీ వైద్య విద్యలో అర్హత సాధించిన‌ట్లు స‌మాచారం.

ఎన్టీఆర్ వర్శిటీ గ‌త నెల 27 నుంచి రిజిస్ట్రేష‌న్ ప్రారంభించి ఈ నెల 4 వ‌ర‌కు అప్లికేష‌న్లు కోరింది. వైద్య విద్యార్థుల‌కు ఎటువంటి ఇబ్బందులు క‌ల‌గకూడ‌ద‌న్న ఉద్దేశంతో ఈ నెల 5,6, 7 తేదీల్లో లేటు ఫీజు చెల్లించి రిజిస్ట్రేష‌న్ చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించారు. రిజిస్ట్రేష‌న్ షెడ్యూల్ కు మంచి స్పంద‌న‌ వచ్చిందని, ఈ నెల 5,6 తేదీల్లో కేవ‌లం 16 మంది విద్యార్థులు మాత్రమే లేటు ఫీజుతో రిజిస్ట్రేష‌న్ చేసుకున్నట్లు వైద్య విశ్వవిద్యాల‌యం అధికారులు వెల్లడించారు.

రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు

ఈ నేప‌థ్యంలో లేటు ఫీజు రిజిస్ట్రేష‌న్‌కు బ‌దులుగా 5, 6, 7 తేదీల్లో జ‌రిగే రిజిస్ట్రేష‌న్‌ను సాధారణ‌ రిజిస్ట్రేష‌న్ గా ప‌రిగ‌ణిస్తున్నట్లు ఇవాళ విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్ ద్వారా వైద్య విశ్వవిద్యాల‌యం తెలిపింది. దీంతో సాధార‌ణ రిజిస్ట్రేష‌న్‌ను మూడు రోజుల పాటు పొడిగించిన‌ట్లయ్యింది. ఇవాళ కొన్ని దినప‌త్రిక‌ల్లో పీజీ అడ్మిష‌న్ల ప్రక్రియ‌ను తొంద‌ర‌పాటుగా చేప‌డుతున్నట్లు వ‌చ్చిన వార్తలు వాస్తవమని ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయం అధికారులు స్పష్టం చేశారు. స‌కాలంలో మెరిట్ లిస్టు త‌యారుచేయ‌డానికి మాత్రమే రిజిస్ట్రేష‌న్ ప్రక్రియ‌ను చేప‌ట్టిన‌ట్లు వివ‌రించారు.

కౌన్సిలింగ్ ప్రక్రియ మాత్రం ఆలిండియా కోటా సీట్లలో ప్రవేశం కోసం ఎన్ఎంసీ ప్రక‌టించే షెడ్యూల్ కు అనుగుణంగా మాత్రమే రాష్ట్రంలో కౌన్సెలింగ్ జ‌రుగుతుంద‌ని అధికారులు స్పష్టం చేశారు. గ‌తంలో లాగానే రాష్ట్రంలో కౌన్సిలింగ్ ప్రారంభానికి ముందు సీట్ మ్యాట్రిక్స్ ను ప్రక‌టించి వైద్య విద్యార్థుల నుంచి ఆప్షన్లు కోరతామ‌ని అధికారులు తెలిపారు.

మెరిట్ లిస్ట్ తయారీ సుదీర్ఘ ప్రక్రియ

ఆలిండియా కోటా సీట్లలో ప్రవేశానికి గ‌త నెల 20న రిజిస్ట్రేష‌న్ ప్రక్రియ ప్రారంభం కాగా, రాష్ట్రంలో 27న మొద‌ల‌య్యింద‌ని, గ‌తంలో జ‌రిగిన విధంగానే ఈ ఏడాది కూడా కౌన్సిలింగ్ జ‌రుగుతుంద‌ని, ఈ విష‌యంలో ఎటువంటి అపోహ‌ల‌కు తావు లేద‌ని వర్సిటీ నిర్వాహకులు తెలిపారు. దాదాపు 9 వేల మంది అభ్యర్థుల ద‌ర‌ఖాస్తుల్ని ప‌రిశీలించి, అభ్యర్థుల అర్హత‌ను నిర్ధారించి, మెరిట్ లిస్టును ప్రక‌టించ‌డం... స‌మ‌యంతో కూడిన ప‌ని అని, ఈ సుదీర్ఘ ప్రక్రియ వ‌ల్ల పీజీ విద్యను ఆశించే అభ్యర్థుల‌కు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకూడదన్న ఉద్దేశంతో త‌గు చ‌ర్యల్ని చేప‌ట్టిన‌ట్లు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాల‌యం అధికారులు తెలిపారు.

త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర , ఉత్తర ప్రదేశ్, హిమాచ‌ల్ ప్రదేశ్‌, జ‌మ్మూ కశ్మీర్‌, పుదుచ్చేరి వంటి ప‌లు రాష్ట్రాల్లో ఇప్పటికే రిజిస్ట్రేష‌న్ ప్రక్రియ ముగిసిన‌ట్లు అధికారులు వెల్లడించారు.

తదుపరి వ్యాసం