PG Medical Admissions: పీజీ వైద్య విద్యలో ఆ వర్గాల అవకాశాలకు గండికొడుతున్న జీవో 85..
PG Medical Admissions: పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల అవకాశాలను దెబ్బతీసేలా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 85 ఉందని వైద్య విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇన్‌సర్వీస్ కోటాలో పీజీ వైద్యలో రిజర్వేషన్లను కుదించడంపై అభ్యంతరం వ్యక్తం అవుతోంది.
PG Medical Admissions: ఆంధ్రప్రదేశ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య ప్రవేశాల్లో సీట్లు కేటాయింపు శాతాన్ని తగ్గిస్తూ, దళిత, గిరిజన, బలహీన వర్గాలకు నష్టం చేసే జీవో 85 జారీ చేయడంపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో గ్రామీణ ప్రజలు, గిరిజన ప్రజలకు కూడా అత్యున్నత వైద్య సేవలు అందాలనే లక్ష్యంతో గతంలో ప్రైవేటు లో పని చేసే స్పెషలిస్ట్ డాక్టర్స్‌ని ప్రభుత్వ ఆసుపత్రులలో నియమించే ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. ప్రైవేట్ స్పెషలిస్టులు ఎవరూ ముందుకు గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించేందుకు ముందుకు రాకపోవడంతో ఆ ఉద్దేశం పూర్తి కాలేదు.
గిరిజన ఆవాసాలు, గ్రామీణ ప్రాంతాలలో అత్యున్నత వైద్య సేవలు అందించడానికి వీలుగా ప్రభుత్వ సంస్థల్లో పని చేసే వైద్యులకు ఇన్ సర్వీస్ పీజీ కోటాను గతంలో ప్రవేశ పెట్టారు. పీజీ కోర్సులతో స్పెషలిస్ట్ డాక్టర్స్ అయిన తర్వాత కూడా గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో పనిచేయాలని వారికి నిబంధన ఉంది. అందులో భాగంగా క్లినికల్ బ్రాంచ్‌లలో 30% మరియు నాన్- క్లినికల్ బ్రాంచ్‌లో 50% రిజర్వేషన్ ఇన్ సర్వీస్ అభ్యర్థులకు కల్పించారు.
ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 85 ద్వారా ప్రస్తుతం ఉన్నరిజర్వేషన్‌ను పూర్తిస్థాయిలో తగ్గించి క్లినికల్ బ్రాంచ్‌లో గరిష్టంగా 15 శాతానికి మరియు నాన్-క్లినికల్ బ్రాంచ్‌లో 30 శాతానికి కుదించడంపై అభ్యతంరాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇన్ సర్వీస్ కోటా రిజర్వేషన్ క్లినికల్ బ్రాంచ్‌లో కొన్ని సబ్జెక్టులకు మాత్రమే అవకాశం ఇచ్చారని వైద్యులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో స్పెషలిస్ట్ వైద్యుల కొరత లేదని, ఇకపై వారి అవసరం ప్రభుత్వానికి లేనందున రిజర్వేషన్ కుదిస్తున్నట్టు చెప్పడాన్ని తప్పు పడుతున్నారు.
ఏపీలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల్లో ఖాళీలు లేవనేది అవాస్తవమని ఇటీవలే నోటిఫికేషన్ 15 ద్వారా 488 స్పెషలిస్ట్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారని గుర్తు చేస్తు్నారు. ఆ నోటిఫికేషన్‌లో ఖాళీ చూపించిన బ్రాంచీలు కూడా జీవో నెంబర్ 85 లో చూపించ లేదని, కాంట్రాక్ట్ పద్ధతి లో టెండర్ల పద్ధతి 2.5 లక్షల నుండి 3.5 లక్షల వరకు వేతనాలు ఇచ్చి ప్రభుత్వానికి భారమైనా.. కొన్ని చోట్ల స్పెషలిస్ట్ వైద్యులను నియమించారని ఇదే వేతనంతో కనీసం ఇద్దరు సర్వీస్ కోటా వైద్యులను నియమించవచ్చని చెబుతున్నారు.
సర్వీస్ కోటా కోర్సులను కొన్ని బ్రాంచ్ లు చేయడం వలన కొవిడ్ లాంటి ఉప ద్రవాలు వచ్చినపుడు చాతీ వైద్య నిపుణులు కొరత ఏర్పడినట్టు భవిష్యత్తు లో మరిన్ని విభాగాల్లో వైద్యుల కొరత ఏర్పడుతుందని, పొరుగు రాష్ట్రాలైన ఒడిషా, తెలంగాణలలో కోటాతో పాటుగా 40 % నుండి 100% వరకు వేతన ప్రోత్సాహకాలు అందిస్తుంటే ఏపీలో మాత్రం సర్వీసు కోటాను సైతం తగ్గిస్తున్నారని వైద్యులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయాల వల్ల దళితులు, ఆదివాసీలు, బలహీన వర్గాల గ్రామీణ ప్రజలు నివసించే ప్రాంతాల్లో భవిష్యత్తులో వైద్యులు పనిచేసేందుకు ఆసక్తి చూపరని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇన్ సర్వీస్ కోటాలో స్పెషలైజేషన్ పూర్తి చేసిన తర్వాత కూడా సర్వీసు లో ఉన్న వైద్యులు ప్రాధమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో మరియు దళిత, గిరిజన గ్రామీణ ప్రాంతాలలో పని చేయుటకు సిద్ధంగా ఉంటారని, కానీ కొందరు అధికారులు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో స్పెషలిస్టులు అవసరం లేదనడం సరికాదని, వైద్యం ప్రాథమిక హక్కు అనే విషయాన్ని విస్మరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పేదలకు నష్టం చేసే జీవో నెంబర్ 85 రద్దు చేయాలని,పీజీ వైద్య ప్రవేశాల్లో సీట్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు జీవో 85 రద్దు చేయాలని సీపీఎం అనుబంధ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.