తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vande Bharat Express : ఏపీకి మ‌రో వందేభార‌త్ రైలు.. అనంత‌పురం మీదుగా విజ‌య‌వాడ‌- బెంగ‌ళూరు మ‌ధ్య సర్వీసు

Vande Bharat Express : ఏపీకి మ‌రో వందేభార‌త్ రైలు.. అనంత‌పురం మీదుగా విజ‌య‌వాడ‌- బెంగ‌ళూరు మ‌ధ్య సర్వీసు

HT Telugu Desk HT Telugu

12 December 2024, 16:28 IST

google News
    • Vande Bharat Express : రైల్వే ప్ర‌యాణికుల‌కు.. ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మ‌రో వందేభార‌త్ రైలు రానుంది. అనంత‌పురం మీదుగా విజ‌య‌వాడ- బెంగ‌ళూరు మ‌ధ్య వందేభార‌త్ రైలును నడపనున్నారు. ఈ సర్వీసును త్వ‌ర‌లోనే ప్రారంభించేందుకు ప్రయత్నాలు జ‌రుగుతున్నాయి.
వందేభార‌త్
వందేభార‌త్

వందేభార‌త్

అనంత‌పురం మీదుగా ఇప్పటికే కాచిగూడ‌- య‌శ్వంత్‌పూర్‌, క‌ల్బ‌ర్గి- బెంగ‌ళూరు మ‌ధ్య వందేభార‌త్ రైళ్లు రాక‌పోక‌లు సాగిస్తున్నాయి. ఇప్పుడు విజ‌య‌వాడ‌- బెంగ‌ళూరు మ‌ధ్య వందే భార‌త్ రైలు వ‌స్తే, అది అనంత‌పురం మీదుగా రాక‌పోక‌లు నిర్వ‌హించే మూడో వందేభార‌త్ రైలు కానుంది.. దీంతో రాయ‌ల‌సీమలో ఉమ్మ‌డి క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల‌తో పాటు ఉమ్మ‌డి గుంటూరు జిల్లా ప్ర‌జ‌ల ప్ర‌యాణాల‌కు ప్రయాణం సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది.

కొత్తగా ప్రవేశపెట్టనున్న ఈ రైలు.. విజ‌య‌వాడ నుంచి గుంటూరు, ప‌ల్నాడు మీదుగా నంద్యాల‌, డోన్‌, గుంత‌క‌ల్లు, అనంత‌పురం, హిందూపురం, యల‌హంక‌లో స్టాప్‌లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే సాంకేతిక అంశాలు పూర్తి అయిన త‌రువాత ఈ రైలును ప్రారంభించ‌నున్నారు. ప్ర‌స్తుతం గుంటూరు నుంచి బెంగ‌ళూరుకు సుమారు 16 గంట‌ల స‌మ‌యం ప‌డుతోంది. ఈ సుధీర్ఘ ప్ర‌యాణ సమ‌యంతో వివిధ వ‌ర్గాల ప్ర‌జలు తీవ్ర అసౌక‌ర్యానికి గుర‌వుతున్నారు. వందేభార‌త్ అందుబాటులోకి వ‌స్తే, ప్ర‌యాణ స‌మ‌యం చాలా వ‌ర‌కు త‌గ్గుతుంది. ఇప్ప‌టికే కేంద్ర రైల్వే శాఖ మంత్రికి విజ‌య‌వాడ‌- బెంగ‌ళూరు మ‌ధ్య వందేభార‌త్ రైలు తీసుకురావాల‌ని ప్ర‌జా ప్ర‌తినిధులు కూడా విజ్ఞ‌ప్తులు అంద‌జేశారు.

రైళ్ల మళ్లింపు..

దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్‌లో భద్రతా పనుల కారణంగా రైళ్లు సాధారణ మార్గంగా కాకుండా నిడదవోలు- భీమవరం టౌన్- గుడివాడ- విజయవాడ మీదుగా మళ్లించనున్నారు.

1. హౌరా - ఎస్ఎంవీబీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్(12863 ) రైలు డిసెంబ‌ర్ 13 నుంచి 24 వ‌ర‌కు మళ్లించిన మార్గంలో నడుస్తుంది. తాడేపల్లిగూడెం, ఏలూరు స్టాప్‌ల‌ను తొలగించారు.

2. ధన్‌బాద్ - అలెప్పీ బొకారో ఎక్స్‌ప్రెస్ (13351) రైలు డిసెంబ‌ర్ 16 నుంచి 24 వ‌ర‌కు మళ్లించిన మార్గంలో నడుస్తుంది. తాడేపల్లిగూడెం, ఏలూరు స్టాప్‌ల‌ను తొలగించారు.

3. హటియా - ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ (22837) రైలు డిసెంబ‌ర్ 16 నుండి 23 వ‌ర‌కు మళ్లించిన మార్గంలో నడుస్తుంది. ఏలూరు స్టాప్‌ను తొలగించారు.

4. హటియా - ఎస్ఎంవీబీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (12835) రైలు డిసెంబ‌ర్ 10 నుండ 24 వ‌ర‌కు మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

5. టాటా నగర్- ఎస్ఎంవీబీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (12889) రైలు డిసెంబ‌ర్ 20న మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

6. హటియా-ఎస్ఎంవీబీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (18637) రైలు డిసెంబ‌ర్ 21న మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

7. ముంబై సీఎస్‌టీఎం – భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11019) రైలు డిసెంబ‌ర్ 13 నుంచి 23 వ‌ర‌కు మళ్లించిన మార్గంలో నడుస్తుంది. తాడేపల్లిగూడెం, ఏలూరు స్టాప్‌ల‌ను తొలగించారు.

8. గుంటూరు - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (17239) రైలు డిసెంబ‌ర్ 26 నుండి 31 వ‌ర‌కు మళ్లించిన మార్గంలో నడుస్తుంది. నూజివీడు, పవర్‌పేట, ఏలూరు, భీమడోలు, తాడేపల్లిగూడెం స్టాప్‌ల‌ను తొలగించారు.

2 వేల జ‌న‌ర‌ల్ కోచ్‌లు..

సౌత్ సెంట్ర‌ల్ రైల్వే వివిధ రైళ్ల‌కు 2,000 జ‌న‌ర‌ల్ కోచ్‌లు అందుబాటులో తీసుకురానుంది. ఇందులో ఫేజ్‌-1 కింద గుంటూరు-సికింద్రాబాద్ (12706), సికింద్రాబాద్‌-గుంటూరు (12705) రైళ్ల‌కు ఒక్కో జ‌న‌ర‌ల్ బోగీ జ‌త చేస్తారు. సికింద్రాబాద్‌-సిర్పూర్ ఖగజ్‌నగ‌ర్ (12757), సిర్పూర్ ఖగ‌జ్‌న‌గ‌ర్- సికింద్ర‌బాద్ (12758) రైళ్ల‌కు ఒక్కో జ‌న‌ర‌ల బోగీ జ‌త చేస్తారు. సికింద్రాబాద్-ద‌న‌పూర్ (12791), ద‌న‌పూర్‌-సికింద్రాబాద్ (12792) రైళ్ల‌కు నాలుగు జ‌న‌ర‌ల్ బోగీలు జ‌త చేస్తారు. ఫేజ్-2 కింద సికింద్రాబాద్-హౌరా (12704), హౌరా-సికింద్రాబాద్ (12705), సికింద్రాబాద్-గూడురు (12710), గూడురు-సికింద్రాబాద్ (12709), తిరుప‌తి-సికింద్రాబాద్ (12797), సికింద్రాబాద్‌-తిరుప‌తి (12798) రైళ్ల‌కు అద‌న‌పు కోచ్‌లు జ‌త చేయ‌నున్నారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం