తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Twitter Fake Accounts Getting Verified Account Status In Andhra Pradesh

Twitter Blue Ticks Issue : ఏపీలో ట్విట్టర్ బ్లూ టిక్కుల రగడ….

HT Telugu Desk HT Telugu

11 November 2022, 14:15 IST

    • Twitter Blue Ticks Issue ట్విట్టర్‌లో బ్లూ టిక్కుల ఖాతాల విశ్వసనీయత అప్పుడే ప్రశ్నార్థకంగా మారింది.  నిన్న మొన్నటి వరకు బ్లూ టిక్కులున్న ఖాతాలను వెరిఫైడ్ ఖాతాలుగా, అధికారిక గుర్తింపుకు చిహ్నంగా భావించే వారు. ఇప్పుడు నెలవారీ చందా కడితే ఎవరికైనా ఈ గుర్తింపు ఇచ్చేస్తుండటం తలనొప్పిగా మారింది. అన్నింటికి మించి రాజకీయ పార్టీల తరపున సోషల్ మీడియాలో చెలరేగిపోయే ఖాతాలకు కూడా ఇప్పుడు  ఈ టిక్కు వచ్చేసింది. 
ఏపీలో ట్విట్టర్‌ బ్లూ టిక్‌ రాజకీయాల రగడ
ఏపీలో ట్విట్టర్‌ బ్లూ టిక్‌ రాజకీయాల రగడ (AP)

ఏపీలో ట్విట్టర్‌ బ్లూ టిక్‌ రాజకీయాల రగడ

Twitter Blue Ticks Issue ట్విట్టర్‌ ఖాతాలకు బ్లూ టిక్కును కొనుక్కునే అవకాశం ఇలా వచ్చిందో లేదో, రాజకీయ పార్టీలకు సంబంధించిన సైనికులు ఎగబడి వాటిని కొనేసుకుంటున్నారు. డబ్బులిచ్చి కొనుక్కున్న ఖాతాలను ప్రొఫైల్‌కు తగిలించుకుని సంబరపడిపోతున్నారు. ఏపీలో ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా సోషల్ మీడియా విభాగాల్లో పనిచేసే వాలంటీర్లు గత రెండు మూడు రోజులు చెలరేగిపోతున్నారు. ఇలా ట్విట్టర్‌ వెరిఫైడ్ ఖాతాలు పొందిన వారిలో అసలు ఖాతాలే కాకుండా డూప్లికేట్ ఖాతాలు కూడా కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

AP Heat Wave : చాగలమర్రిలో ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రత నమోదు-రేపు 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు

AP Pensions : మే 1న ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలి, ఎన్డీఏ నేతల డిమాండ్

AP Pensions Distribution : ఇంటింటికీ పెన్షన్లు లేదా నేరుగా ఖాతాల్లో, పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

AP Weather Updates : ఏపీలో భానుడి భగభగలు - 45 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు, ఇవాళ 56 మండలాల్లో తీవ్ర వడగాలులు

గురువారం రాత్రి వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగానికి చెందిన ఓ ముఖ్య బాధ్యుడి పేరుతో బ్లూ టిక్కుతో ఖాతా కనిపించింది. చూడ్డానికి అచ్చం అది వైసీపీ నాయకుడి ఖాతా మాదిరే ఉంది. పార్టీకి వీరవిధేయుడిగా కనిపించే వ్యక్తి ఖాతా నుంచి పార్టీకి, ముఖ్య నాయకులకు వ్యతిరేకంగా ట్వీట్లు కనిపించాయి. ప్రస్తుతం నామినేటెడ్‌ పదవిలో ఉన్న ఆ వ్యక్తి ఖాతా నకిలీ ఖాతా నుంచి వరుస ట్వీట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడంతో పార్టీ కార్యకర్తలు ఖంగుతిన్నారు. ట్విట్టర్ ఖాతాకు వెరిఫైడ్ అకౌంట్‌గా భావించే బ్లూ టిక్ కూడా ఉండటంతో అంతా అది నిజమైన ఖాతానే అనుకున్నారు. చివరకు ఆ నాయకుడు ఆ ఖాతా తనది కాదని మిగిలిన వారికి చెప్పడంతో అంతా తెల్లబోయారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున డిజిటల్ కాంపెయిన్ నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది. ఇందులో పనిచేస్తూ ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న ఖాతాలకు ట్విట్టర్‌లో బ్లూ టిక్ కనిపిస్తోంది. ఒక్క వైసీపీ మాత్రమే ఈ ట్రెండ్‌కు పరిమితం కాలేదు. జనసేన, టీడీపీ సోషల్ మీడియ సోల్జర్లు కూడా ఈ నెలవారీ సబ్‌ స్క్రిప్షన్‌ ఖాతాలకు బ్లూ టిక్కుతో ఫోజులు కొడుతున్నారు. ఇకపై ఎవరైనా ఎవరి పేరు, ఫోటోతో నకిలీ ఖాతా ప్రారంభించినా దానికి బ్లూ టిక్‌ ఇచ్చేయడం ఖాయంగా కనిపిస్తోంది. నకిలీలకు ట్విట్టర్ అధికారిక గుర్తింపునివ్వడం ద్వారా ఈ పరిస్థితులు తలెత్తబోతున్నాయి.

ఎలన్‌ మస్క్ ట్విట్టర్‌ను టేకోవర్ చేసే వరకు ట్విట్టర్‌ ఖాతాకు బ్లూ టిక్ రావడం కష్టంగా ఉండేది. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులకు మాత్రమే అధికారిక గుర్తింపులను తనిఖీ చేసిన తర్వాత ఈ సదుపాయం కల్పించే వారు. నెలకు రూ.719 రుపాయల చందాకే బ్లూ టిక్ లభిస్తుండటంతో ట్విట్టర్‌ నీలి టిక్కు ఖాతాలతో షేకవుతోంది. నిన్న మొన్నటి వరకు ఇవన్నీ నకిలీ ఖాతాలుగా భావించే వారు. అయా పార్టీలకు అనుబంధంగా పనిచేసే వారికి మాత్రమే వారు ఎవరో, ఏ పార్టీకి చెందిన వారో తెలిసేది. మారుపేర్లు, ఫోటోలతో తమ అభిమాన నాయకుల్ని ప్రమోట్ చేయడం, ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయడం చేసేవారు. ఇప్పుడు రూ.719 కట్టేసి డూప్లికేట్ ఖాతాలకు బ్లూ టిక్‌ తెచ్చుకోవడం సులువైపోవడంతో చివరికి ట్విట్టర్‌ భవిష్యత్‌ ఏమిటనే సందేహం కూడా కలుగుతుంది.

బ్లూ టిక్ సబ్‌ స్క్రిప్షన్ల దుర్వినియోగం అయ్యే అవకాశాలున్నా వాటిని కట్టడి చేసే ప్రయత్నాలు ఎంత వరకు ఉంటాయనేది ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి ట్విట్టర్‌ ఖాతాలను వినియోగించే వారిలో ఎక్కుమంది రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, సినీ తారల అభిమానులు ఎక్కువగా ఉంటారు. విద్యార్ధులు, యువత ఎక్కువగా తమ అభిమాన నాయకుల్ని ఫాలో అవ్వడానికి ట్విట్టర్‌ ఖాతాలను వాడుతుంటారు.

ఫేస్‌బుక్‌తో పోలిస్తే ట్విట్టర్ వినియోగం తక్కువే అయినా ఇప్పుడు ఈ బ్లూ టిక్‌ వ్యవహారం పార్టీలకు కొత్త తలనొప్పులు తెచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇకపై బ్లూ టిక్ ఖాతాలన్నీ వెరిఫైడ్ ఖాతాలని కూడా భావించకూడదు. నకిలీ ఖాతాలే అసలుగా చెలామణీ అయ్యే రోజులు ట్విట్టర్‌కు చాలా వేగంగా వచ్చేశాయి. ఇక రాజకీయ పార్టీలకు కొమ్ము కాసే ఖాతాల్లో చట్టాల ఉల్లంఘన ఆరోపణల్ని ఎదుర్కొంటున్న వారు, సైబర్ నిఘాలో ఉన్న ఖాతాలకు కూడా వెరిఫైడ్ స్టేటస్ రావడం చూసి పోలీసులు తెల్లముఖాలు వేస్తున్నారు.