Visakhapatnam : విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో తప్పిన ప్రమాదం.. విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లిన రైలు
23 December 2024, 9:34 IST
- Visakhapatnam : విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో భారీ ప్రమాదమే తప్పింది. ఒక రైలు ఏకంగా విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లింది. అయితే ఎటువంటి అపాయం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ వైర్లను తొలగించిన చాలా సేపు తరువాత రైలును పంపించారు.
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో తప్పిన ప్రమాదం
విశాఖ రైల్వే స్టేషన్‌లో ఆదివారం ఉదయం భారీ ప్రమాదం తప్పింది. తిరునెల్వేలి- పురులియా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22606) రైలు ఉదయం 5.20 గంటలకు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. సాధారణంగా విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో అన్ని రైళ్లకు ఇంజన్ మార్చుతారు. ఈ క్రమంలో తిరునెల్వేలి- పురులియా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలకు కూడా ఇంజిన్ మార్చుతున్నారు. ఆ రైలు నుంచి తొలగించిన ఇంజిన్ ముందుకెళ్తున్న సందర్భంలో.. విద్యుత్ తీగలను సుమారు 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో రైల్వే స్టేషన్‌లో రెండు గంటల పాటు రైలును నిలిపివేశారు.
ప్రమాదం కాదు..
ఈ ఘటన గురించి విశాఖపట్నం రైల్వే స్టేషన్ అధికారులు మాట్లాడుతూ.. 3, 4 ప్లాట్‌ఫారంలపై ఓవర్ హెడ్ ఎక్విప్‌మెంట్ మెయింట్‌నెన్స్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. అందులో భాగంగానే మూడో నెంబర్ ప్లాట్‌ఫాంపై తొలగించిన వైరును తిరునెల్వేలి- పురులియా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్ ఈడ్చుకుని వెళ్లిందని తెలిపారు. ఇది ప్రమాదమే కాదని, మరమ్మతులు జరుగుతున్నప్పుడు ఇది జరిగిందని తెలిపారు. ఈ ఘటనను గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగారని చెప్పారు. కొన్ని రైళ్లు రాకపోకలకు అంతరాయం కలిగిందన్నారు. ఆయా రైళ్లు ఆలస్యంగా రాకపోకలు నిర్వహించాయి.
అధికారులపై తీరుపై విమర్శలు..
అధికారులు వివరణపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. రైల్వే అధికారులు చెప్పినట్లు తెగిన విద్యుత్ వైర్లు రైలు ఇంజన్ కొంత దూరం ఎందుకు ఈడ్చుకెళ్లిందని ప్రశ్నలు వస్తున్నాయి. అలాగే ఆ రైలు ఇంజిన్‌కు సిగ్నల్ ఎవరు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారనే ప్రశ్నలు కూడా ముందుకు వస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని స్పష్టం అవుతుంది. వాల్తేర్ డివిజన్‌లో ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. గతంలో రైల్వే ప్రయాణికులు వినియోగించే బ్రిడ్జి కుంగింది. తాజా ఈ ఘటన ఇలా వాల్తేర్ డివిజన్ ఎప్పటికప్పుడు వార్తల్లోకి ఎక్కుతుంది.
వాల్తేరు పరిధిలో..
ఇటీవలి వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ అవినీతి కేసులో అరెస్టు అయ్యారు. ఆయన స్థానంలో కొత్తవారిని ఇంకా నియమించ లేదు. ఇన్‌ఛార్జ్ తోనే కొనసాగిస్తున్నారు. వాల్తేర్ డివిజన్‌లో ప్రధానమైన విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో తరచూ ఏదో ఒక ఘటన చోటు చేసుకుంటుంది. అయితే వాల్తేర్ డివిజన్‌లో పరిధిలో రైల్వే సమాచారం మీడియాకు చేరవేసే యంత్రాంగం, తాజాగా చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అలాగే రాకపోకల ప్రభావంపై కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. పైగా ఘటనను కవర్ చేసేందుకు మీడియాను కూడా అనుమతించలేదు. దీంతో ఈ ఘటన అనేక అనుమానాలకు తావిస్తోంది.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)