తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  To Defeat Jaganmohan Reddy, Does Chandrababu Also Have To Follow Jagan's Way

Defeating Jagan: జగన్‌ను ఓడించాలంటే జగన్‌ బాటలో వెళ్లాల్సిందేనా…?

B.S.Chandra HT Telugu

30 May 2023, 7:13 IST

    • Defeating Jagan: వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని  ఓడించడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. జగన్‌ను కుర్చీ నుంచి దింపేసి తాము గద్దెనెక్కాలని తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో రాజమండ్రి మహానాడులో  ఇచ్చిన హామీలపై కొత్త చర్చ జరుగుతోంది. 
చంద్రబాబు, జగన్(ఫైల్ ఫొటో)
చంద్రబాబు, జగన్(ఫైల్ ఫొటో)

చంద్రబాబు, జగన్(ఫైల్ ఫొటో)

Defeating Jagan: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు కొత్త హామీలు ప్రకటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండటంతో టీడీపీని గెలిపించడానికి కొత్తకొత్త ప్రకటనలు చేస్తున్నారు. రాజమండ్రి మహానాడులో చంద్రబాబు కొత్త నగదు బదిలీ పథకాలను ప్రకటించారు. మహిళలు, రైతులు లక్ష్యంగా వాటిని ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

AP Heat Wave : చాగలమర్రిలో ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రత నమోదు-రేపు 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు

AP Pensions : మే 1న ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలి, ఎన్డీఏ నేతల డిమాండ్

AP Pensions Distribution : ఇంటింటికీ పెన్షన్లు లేదా నేరుగా ఖాతాల్లో, పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

AP Weather Updates : ఏపీలో భానుడి భగభగలు - 45 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు, ఇవాళ 56 మండలాల్లో తీవ్ర వడగాలులు

ఏపీ ప్రస్తుతం నగదు బదిలీ పథకాల కాలం నడుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లలో దాదాపు రూ.2.05లక్షల కోట్ల రుపాయలను ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలకు వినియోగించినట్లు చెబుతున్నారు. నాన్ డిబిటి పథకాలతో కలిపితే ఈ మొత్తం ఇంకా ఎక్కువే ఉంటుందని జగన్ తరచూ చెబుతున్నారు.

వీటితో పాటు అమ్మఒడి, చేయూత, ఆసరా, విద్యాదీవెన, వసతి దీవెన, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, వైఎస్సార్ షాదీతోఫా తదితర పథకాల్లో ప్రభుత్వం అందించే నగదు సాయాన్ని నేరుగా మహిళల ఖాతాలకు జమ చేస్తున్నారు. వీటి ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఉంటుందని టీడీపీ సైతం అంచనాకు వచ్చింది.

వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలన్ని ఒక్క తాటిపైకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలనివ్వకుండా చూడ్డానికి తనవంతు ప్రయత్నం చేస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. టీడీపీతో కలిసే ప్రయాణించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బీజేపీని కూడా తమతో చేర్చుకోడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల నాటికి విపక్ష కూటమిలో ఎవరెవరు ఉంటారనేది క్లారిటీ రానుంది.

అదే సమయంలో తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోావల్సిన అవసరం లేదని వైసీపీ భావిస్తోంది. తన పొత్తు ప్రజలతోనే అని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో నెరవేర్చామని, చెప్పని వాటిని కూడా అమలు చేశామని వైసీపీ అంటోంది. ఏపీలో దాదాపు 87శాతం ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందుతున్న నేపథ్యంలో కొత్తగా ఎవరితోను జట్టు కట్టాల్సిన అవసరం లేదని ఆ పార్టీ విశ్వస్తోంది.

పొత్తు రాజకీయాలకు మొదట్నుంచి దూరంగా ఉంటున్న వైసీపీ తాము అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయనే ధైర్యంతో ఉంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు ఆర్నెల్లుగా ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బాదుడేబాదుడ,ఇదేం ఖర్మ రాష్ట్రానికి వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. చంద్రబాబు సభలు, సమావేశాలకు జనం బాగానే వస్తున్నా జనం మనసులో ఏముందనే విషయంలో నాడి దొరకడం లేదు.

ఎన్నికల నాటికి పోలింగ్ బూత్‌లకు వచ్చి క్యూలలో బారులు తీరి ఓట్లు వేసే వర్గాల్లో ఎక్కువగా పేద, మధ్య తరగతి వర్గాలే ఉంటాయి. వీరిని ఇప్పటి నుంచి తమ వైపు తిప్పుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగానే మహిళలకు మహాశక్తి పేరుతో ఆర్ధిక ప్రయోజనాలు, రైతులకు ఆర్దిక సాయం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి పథకాలను మహానాడు వేదికపై చంద్రబాబు ప్రకటించారు.

జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే జగన్‌కంటే మెరుగ్గా ఆర్ధిక ప్రయోజనాలు కల్పిస్తామనే హామీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఆ పార్టీ యోచిస్తోంది. అందులో భాగంగానే ఈ పథకాలను ప్రకటించారు. మరోవైపు ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో విజయవంతం అయినా జనాకర్షక పథకాలను యథాతథంగా మహానాడు వేదికపై ప్రకటించారనే విమర్శ కూడా వైసీపీ నుంచి వస్తోంది.

జగన్మోహన్‌ రెడ్డిని ఓడించాలంటే జగన్‌ కంటే మెరుగ్గా, జగన్‌ కంటే మనస్ఫూర్తిగా, చిత్తశుద్దితో సంక్షేమాన్ని అమలు చేస్తామనే భావన కల్పించాల్సిన బాధ్యత టీడీపీలో ఉంది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో అధికార పీఠాన్ని ఎక్కే అవకాశం చంద్రబాబుకు దక్కింది. 2014-19మధ్య కాాలంలో చంద్రబాబు నాయుడు పూర్తి సమయాన్ని అమరావతికి మాత్రమే పరిమితం చేయడంతో ఆయన రాష్ట్రమంతటా ఘోరమైన ఫలితాలను చవిచూడాల్సి వచ్చింది. ఈ కాలంలో పారిశ్రామికంగా, పెట్టుబడుల రూపంలో సాధించిన విజయాలను కూడా టీడీపీ చెప్పుకోలేకపోయింది.

ఇప్పుడు జగన్‌ను ఓడించడానికి చంద్రబాబు జగన్‌ అమలు చేస్తున్న పథకాలకే కాస్త పేరు మార్చి, ఇచ్చే నగదు మొత్తాన్ని మార్చి ప్రకటిస్తున్నారనే విమర్శ లేకపోలేదు. జగన్‌ అమలు చేస్తున్న పథకాలను విమర్శిస్తున్న టీడీపీ తాము అధికారంలోకి వస్తే వాటిని ఎలా అమలు చేస్తుందనే వివరణ కూడాఇవ్వాల్సి ఉంటుంది. జగన్‌ బాటలోనే వెళ్తామనుకుంటేనే జనంలో ఎవరిని ఎంచుకోవాలనే సంశయం తలెత్తితే అది ప్రతికూల ఫలితాలనివ్వొచ్చు.