తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chittoor Tragedy : చిత్తూరు జిల్లాలో విషాదం.. కుటుంబాన్ని బలి తీసుకున్న ఆన్‌లైన్ బెట్టింగ్

Chittoor Tragedy : చిత్తూరు జిల్లాలో విషాదం.. కుటుంబాన్ని బలి తీసుకున్న ఆన్‌లైన్ బెట్టింగ్

HT Telugu Desk HT Telugu

06 October 2024, 11:26 IST

google News
    • Chittoor Tragedy : ఆన్‌లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్ని బ‌లి తీసుకుంది. ఒకేసారి నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ముగ్గురు మృతిచెందారు. ఒకరి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. పోలీసులు కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌రుపుతున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరులో జరిగింది.
కుటుంబాన్ని బలి తీసుకున్న ఆన్‌లైన్ బెట్టింగ్
కుటుంబాన్ని బలి తీసుకున్న ఆన్‌లైన్ బెట్టింగ్ (Shutterstock)

కుటుంబాన్ని బలి తీసుకున్న ఆన్‌లైన్ బెట్టింగ్

చిత్తూరు జిల్లా గంగాధ‌ర నెల్లూరు మండ‌ల కేంద్రంలో తీవ్ర విషాదం జ‌రిగింది. పెద్ద చ‌దువ‌లు చ‌దివి, ఉన్న‌తంగా అభివృద్ధి చెందుతాడ‌నుకున్న కొడుకు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిస‌య్యాడు. ల‌క్ష‌ల రూపాయాలు అప్ప‌లు చేశారు. ఉన్న‌దంతా ఇచ్చినా అప్పులు తీర్చే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో.. ఆ కుటుంబం ఆత్మ‌హ‌త్యే శ‌ర‌ణ్య‌మ‌నుకుంది. ఆర్థిక ఇబ్బందుల‌తో ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు ఆత్మ‌హ‌త్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు త‌రువాత ఒక‌రు మృతి చెందుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ముగ్గురు మృతి చెందగా.. ఒక‌రు ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

గంగాధ‌ర నెల్లూరు మండ‌ల కేంద్రంలో నాగ‌రాజురెడ్డి (61) త‌న కుటుంబంతో నివాస‌ముంటున్నారు. ఆయ‌న ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ.. కుటుంబాన్ని పోషించేవారు. ప్రస్తుతం ఆయ‌న అనారోగ్యంతో మంచానికే ప‌రిమితం అయ్యాడు. ప్ర‌భుత్వం ఇచ్చే పించ‌ను డ‌బ్బుల‌తో ఆ కుటుంబం గుట్టుగా జీవనం సాగిస్తోంది.

త‌న కుమారుడు దినేష్‌ను చిత్తూరులో బీటెక్ చ‌దివిస్తున్నారు. త‌న భార్య జ‌యంతి (48)ని కొడుక్కి తోడుగా చిత్తూరు పంపించి, నాగ‌రాజురెడ్డి గ్రామంలోనే ఉంటున్నారు. త‌ల్లీ కొడుకులిద్ద‌రూ చిత్తూరులో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. నాగ‌రాజురెడ్డి కుమార్తె సునీత (26) డిగ్రీ చ‌దివి రాజ‌స్థాన్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ప‌ని చేస్తుండేది. మూడు నెల‌ల కిందటే ఇంటికి వ‌చ్చింది.

కుమారుడు దినేష్ ‘ఆన్‌లైన్ బెట్టింగ్‌’ల‌కు బానిసయ్యాడు. రూ. 20 ల‌క్ష‌ల వ‌ర‌కూ అప్పులు చేశాడు. ల‌క్ష‌ల రూపాయ‌లు బెట్టింగ్‌లో పోయినా మ‌ళ్లీ దాన్ని వ‌ద‌ల‌క మ‌రిన్ని అప్ప‌లు చేశాడు. అయితే.. నాగ‌రాజురెడ్డి ముగ్గురు అన్న‌ద‌మ్ములూ ఇటీవ‌ల ఆస్తి పంప‌కాలు చేసుకున్నారు. ఒక్కొక్క‌రికీ రూ.20 ల‌క్ష‌ల చొప్పున ఆస్తులు వ‌చ్చాయి. ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వ‌ల్ల కొడుకు అప్ప‌లయ్యాడ‌ని తెలిసి నాగ‌రాజురెడ్డి తీవ్ర మ‌న‌స్థాపానికి గుర‌య్యాడు.

కూతురు పెళ్లికి, ఇత‌ర అవ‌స‌రాల‌కు ప‌నికొస్తాయ‌నుకున్న రూ.20 ల‌క్ష‌ల‌లో రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు కొడుక్కి స‌ర్దుబాటు చేశారు. మ‌రికొంత డ‌బ్బులు కావాల‌ని తండ్రితో దినేష్ గొడ‌వ ప‌డ్డాడు. అయితే సొంతింటిపై బ్యాంకు రుణం పొందాల‌ని గ‌త నెల‌రోజులుగా ప్ర‌యత్నం చేసినా విఫలం అయింది. దీంతో ఆ కుటుంబం తీవ్ర మ‌నోవేద‌న‌కు గురైంది. చివ‌రికి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డాల‌ని నిర్ణ‌యించుకుంది.

కుటుంబంలోని న‌లుగురూ శుక్ర‌వారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడ్డారు. స్థానికులు గ‌మ‌నించి వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ నాగ‌రాజురెడ్డి (61) శుక్ర‌వారం రాత్రే మృతి చెందారు. ఆయ‌న భార్య జ‌యంతి (48), వారి కుమార్తె సునీత (26) శ‌నివారం ఒక‌రి త‌రువాత ఒక‌రు మృతి చెందారు. కుమారుడు దినేష్ (23) చిత్తూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు.

స‌మాచారం తెలుసుకున్న సీఐ ల‌క్ష్మీనారాయ‌ణ కేసు న‌మోద చేసి, ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మ‌ర‌ణించ‌డంతో ఆ ప్రాంతంలో విషాదఛాయ‌లు అలుముకున్నాయి. బంధువులు, స్థానిక ప్ర‌జ‌లు క‌న్నీరుమున్నీరు అయ్యారు. పోస్టుమార్టం అనంతరం ఆదివారం మృతదేహాల‌ను కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించనున్నారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌రజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం