Atiq Ahmed: గ్యాంగ్‍స్టర్ అతీక్ అహ్మద్ శరీరంలో తొమ్మిది బుల్లెట్లు: పోస్టుమార్టంలో కీలక విషయాలు-atiq ahmed received 9 bullets brother ashraf shot five times autopsy ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Atiq Ahmed Received 9 Bullets Brother Ashraf Shot Five Times Autopsy

Atiq Ahmed: గ్యాంగ్‍స్టర్ అతీక్ అహ్మద్ శరీరంలో తొమ్మిది బుల్లెట్లు: పోస్టుమార్టంలో కీలక విషయాలు

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 17, 2023 07:12 PM IST

Atiq Ahmed: అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ మృతదేహాల పోస్టు మార్టం వివరాలు బయటికి వచ్చాయి. వారి శరీరాల్లో ఎన్ని బుల్లెట్లు ఉన్నాయో తేలింది.

దాడికి ముందు అతీక్, అఫ్రఫ్‍ను పోలీసులు తీసుకెళుతున్న దృశ్యమిది
దాడికి ముందు అతీక్, అఫ్రఫ్‍ను పోలీసులు తీసుకెళుతున్న దృశ్యమిది

Atiq Ahmed: గ్యాంగ్‍స్టర్ అతీక్ అహ్మద్ (Gangster Atiq Ahmed) శరీరంలో తొమ్మిది బుల్లెట్లు ఉన్నట్టు పోస్టుమార్టంలో తేలింది. అతడి శరీరం, తలలో ఈ బుల్లెట్లు ఉన్నాయి. అతీక్ సోదరుడు అఫ్రష్ అహ్మద్ (Ashraf Ahmed) అలియాస్ ఖలీద్ అజీమ్ శరీరంలో ఐదు బుల్లెట్లు దిగాయి. ఉత్తర ప్రదేశ్‍ ప్రయాగ్‍రాజ్‍లోని మోతీలాల్ నెహ్రూ డివిజన్ హాస్పిటల్ వద్ద శనివారం ముగ్గురు దుండగులు జరిపిన కాల్పుల్లో అతీక్ అహ్మద్, అష్రఫ్ మృతి చెందారు. వీరి మృత దేహాలకు నిర్వహించిన పోస్టుమార్టం వివరాలు సోమవారం బయటికి వచ్చాయి.

తలలోనూ బుల్లెట్

Atiq Ahmed: ఐదుగురు డాక్టర్ల బృందం అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ మృత దేహాలకు శవపరీక్ష చేసినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియను వీడియో కూడా తీసినట్టు పేర్కొన్నారు. అతీక్ అహ్మద్ శరీరంలోకి తొమ్మిది బుల్లెట్లు దూసుకెళ్లినట్టు పోస్టుమార్టంలో తేలింది. ఇందులో ఒకటి ఆయన తలలో దిగింది. ఇక అఫ్రష్ ముఖంపై ఓ బుల్లెట్ గాయం కాగా.. వెనుక నుంచి మరో నాలుగు అతడి శరీరంలోకి వచ్చాయి.

Atiq Ahmed: పోలీసులు, జర్నలిస్టుల మధ్యే ముగ్గురు దుండగులు.. అతీక్, అఫ్రష్‍పై కాల్పులు జరిపారు. అతీక్ తలపై, అఫ్రష్ ముఖంపై కాల్పులు జరిపినట్టు విజువల్స్ లో కనిపించింది. సోదరులిద్దరి చేతులకు సంకెళ్లు ఉండగా.. కాల్పులు జరగగానే ఇద్దరూ కుప్పకూలారు. ఆ తర్వాత కూడా వారిపై దుండగులు కాల్పులు జరిపారు.

వేరే జైలుకు నిందితులు

Atiq Ahmed: అతీక్, అఫ్రఫ్‍పై దాడి చేసి చంపిన వారిని అరుణ్ మౌర్య, లవ్లేశ్ తివారీ, సన్నీ సింగ్‍గా పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఎదుట ఆ నిందుతులను పోలీసులు ప్రవేశపెట్టారు. వారికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని న్యాయస్థానం విధించింది. దీంతో ప్రయాగ్‍రాజ్‍లోని నైని సెంట్రల్ జైలుకు ఆ ముగ్గురిని పోలీసులు తరలించారు. అయితే, సోమవారం వారిని ప్రతాప్‍గఢ్ జిల్లా జైలుకు మార్చారు. ఇతర ఖైదీల నుంచి ఈ ముగ్గురిని వేరుగా ఉంచారు పోలీసులు.

Atiq Ahmed: జర్నలిస్టుల్లా వీడియో కెెమెరాలు, మైకులతో వచ్చిన ఆ ముగ్గురు నిందితులు.. ఆసుపత్రి బయట ఒక్కసారిగా ఆతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‍పై కాల్పులు జరిపారు. షూటర్లలో ఒకడిగా ఉన్న సన్నీపై ఇప్పటికే 14 క్రిమినల్ కేసులు ఉన్నాయి. మర్డర్, దోపిడీ, మాదక ద్రవ్యాల రవాణా, హత్యాయత్నం సహా మరిన్ని కేసులు అతడిపై ఉన్నాయి.

Atiq Ahmed: గ్యాంగ్‍స్టర్ స్థాయి నుంచి అతీక్ అహ్మద్ రాజకీయ నేతగా మారారు. గతంలో ఎంపీ, ఎమ్మెల్యేగానూ ఎన్నికయ్యారు. ఆయనపై సుమారు 100కుపైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. లాయర్ ఉమేశ్ పాల్ మర్డర్ కేసులోనూ అతీక్ నిందితుడిగా ఉన్నాడు. అతీక్ కుమారుడు అసద్‍ను ఇటీవలే ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఎన్‍కౌంటర్ చేశారు. ఉత్తర ప్రదేశ్ పోలీసులు తనను కూడా ఎన్‍కౌంటర్ చేసేందుకు ప్రయత్నిస్తారని గతంలో అతీక్ చెప్పాడు.

IPL_Entry_Point

సంబంధిత కథనం