Attack on Doctor: ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిపై అర్థరాత్రి దౌర్జన్యం, ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
Attack on Doctor: దేశ వ్యాప్తంగా వైద్యుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో కూడా తరచూ వైద్యులపై దాడులు, రోగుల బంధువుల దురుసు ప్రవర్తిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.తాజాగా ఏలూరులో మహిళా డాక్టర్‌పై దౌర్జన్యంపై బాధితురాలు ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించకపోవడం చర్చనీయాంశమైంది.
Attack on Doctor: ఏలూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యురాలిపై అర్థరాత్రి వేళ ఒక వ్యక్తి దౌర్జన్యానికి, బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో వైద్యులు ఆందోళనకు సిద్ధం అవుతున్నారు.
ఏలూరు సర్వజన ఆసుపత్రి అత్యవసర విభాగంలో అర్ధరాత్రి వైద్యురాలిపై ఓ వ్యక్తి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. దీనిపై పోలీసులుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె వాపోయారు. ఈనెల 15 (ఆదివారం) రాత్రి ఏలూరు సర్వజన ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో ఓ వైద్యురాలు విధులు నిర్వర్తిస్తున్నారు. బాధితురాలు ఏడు నెలల గర్భిణీ కూడా. అర్ధరాత్రి 1.30 గంటలు దాటాక ఏలూరు జిల్లా దెందులూరు మండలం ఉండ్రాజవరంలో కొందరు ఘర్షణ పడ్డారు.
ఈ ఘర్షణలో గాయపడిన వారిని వైద్యం నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రి అత్యవసర విభాగానికి తీసుకెళ్లారు. మెడికల్ లీగల్ కేసు (ఎమ్మెల్సీ) నివేదిక ఇవ్వాలని వైద్యురాలిని అడిగారు. ముందు వైద్యం చేయించుకోవాలని, వైద్యం పూర్తి అయ్యాక ఎమ్మెల్సీ నమోదు చేస్తానని ఆమె సమాధానం ఇచ్చారు. దాంతో క్షతగాత్రుల వెంట వచ్చిన పోతునూరుకు చెందిన బొడ్డేటి మోహన్ వైద్యురాలిపై దురుసుగా ప్రవర్తిస్తూ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. తన మాట వినకుంటే ఉద్యోగం నుంచి తీయిస్తామని బెదిరించారు.
భద్రతా సిబ్బంది అతడిని ఎంత వారించినా వినిపించుకోలేదు. ఆ తరువాత కాసేపటికి బయటకు వెళ్లాడు. దీనిపై ఆ వైద్యురాలు ఏలూరు టూ టౌన్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా, పట్టించుకోలేదు. దీంతో బాధితురాలు ఆందోళనకు గురయ్యారు. దీనిపై మంగళవారం ధర్నా చేయాలని ఆసుపత్రిలో ఉన్న వైద్య సిబ్బంది మొత్తం తీర్మానించారు.
దౌర్జన్యానికి పాల్పడిన వ్యక్తిపై కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం ఆసుపత్రి వద్ద వైద్యులు ఆందోళనకు దిగనున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు.
పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలో ట్రైనీ డాక్టర్ అభయ హత్యాచారం, హత్య కేసు ఘటన సందర్భంగా ఆసుపత్రుల్లో వైద్య సిబ్భందికి రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను పంపింది. వాటిని అమలు చేసి, వైద్యులకు, వైద్య సిబ్బందికి భద్రత కల్పించాలని సూచించింది. కానీ వైద్యులపై, వైద్య సిబ్బందిపై దాడులు, దౌర్జన్యాలు ఆగడం లేదు.
కలకత్తా ఘటనపై రాష్ట్రంలో కూడా ఆందోళనలు జరిగాయి. స్వయానా రాష్ట్ర హో మంత్రి వంగలపూడి అనిత విశాఖపట్నంలో ఆందోళనలో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలోనే గర్భిణీ అయిన వైద్యురాలిపై ఒక వ్యక్తి దౌర్జన్యానికి దిగాడు. అలాగే దీనిపై ఫిర్యాదు చేసిన పోలీసులు కూడా పట్టించుకోలేదు. ఆ వ్యక్తిపైన, అలాగే పోలీసులు పట్టించుకోకపోవడంపైన రాష్ట్ర హోం మంత్రి అనిత ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)G