CBN Letter to UPSC : ఇప్పుడే ఇంటర్వూలు వద్దు, జూన్ 7 తర్వాత చేపట్టండి - ఐఏఎస్‌ల కన్ఫర్మేషన్ ప్రక్రియపై చంద్రబాబు లేఖ
24 May 2024, 21:37 IST
- Chandrababu Letter to UPSC Chairman : యూపీఎస్సీ ఛైర్మన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఐఏఎస్‌ల కన్ఫర్మేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు.
టీడీపీ అధినేత చంద్రబాబు (ఫైల్ ఫొటో)
Chandrababu Letter to UPSC Chairman: యూపీఎస్సీ ఛైర్మన్ కు తెలుగుదేశం పార్టీ అధినేత అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్ర కేడర్ అధికారులను ఐఏఎస్ లుగా ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రతిపాదనలు పంపడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు.
నిబంధనలు పాటించలేదు….
జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు ఉన్నందు వల్ల పదోన్నతులు చేపట్టడం సరైన నిర్ణయం కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇంటర్వ్యూలు నిర్వహిస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లే అవుతుందని లేఖలో పేర్కొన్నారు. ఈ పదోన్నతుల జాబితాలో ఉన్నవారు కూడా కేవలం సీఎంఓలో ఉన్నవారే మాత్రమే అని గుర్తు చేశారు.
జాబితా కూడా నిబంధనల ప్రకారం రూపొందించలేదని చంద్రబాబు తన లేఖలో ప్రస్తావించారు. సరైన విధానాలు అనుసరించకుండా పదోన్నతలు కట్టబెట్టేందుకు జాబితాను రూపొందించారని ఆరోపించారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానున్న నేపధ్యంలో ప్రభుత్వం హడావుడిగా ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టిందన్నారు.
పారదర్శకత లేకుండా రూపొందించిన జాబితాను పున:పరిశీలించాలని యూపీఎస్సీ ఛైర్మన్ ను చంద్రబాబు కోరారు. పదోన్నతుల అంశాన్ని జూన్ 7 తర్వాత చేపట్టేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు లేఖ కాపీలను పర్సనల్ అండ్ ట్రైనింగ్ సెక్రటరీ , కేంద్ర ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి చంద్రబాబు పంపారు.
జూన్ 4న ఫలితాలు….
మరోవైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెల్లడి కానున్నాయి. 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాల ఫలితాలు రానున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించగా… టీడీపీ కేవలం 23 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఈసారి తెలుగుదేశం పార్టీ కూటమిగా పోటీ చేయగా… వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగింది. విజయంపై రెండు పార్టీలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
భారీ భద్రత….
కౌంటింగ్ రోజున పలు ప్రాంతాల్లో హింస చెలరేగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు రిపోర్టు ఇచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎప్పుడూ లేని విధంగా జిల్లాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో అడుగడుగు జల్లెడ పడుతున్నారు. జిల్లాల్లో ఎక్కడికక్కడ కార్డెన్ సెర్చ్ చేపడుతున్నట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు.
స్వయంగా ఎస్పీలు, ఉన్నతాధికారులు రంగంలోకి దిగి బృందాలతో సమస్యాత్మక ప్రదేశాలను క్షుణంగా పరిశీలిస్తున్నారు. కౌంటింగ్ ముగిసే వరకూ పోలీసు సిబ్బందికి ఎలాంటి సెలవులు లేవని ఉన్నతాధికారులు చెబుతున్నారు. పోలింగ్ రోజున హింస జరిగిన ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రతి ఇల్లు పోలీసులు తనిఖీ చేస్తున్నారు. హిస్టరీ షీట్స్ ఉన్న ప్రతి ఒక్కరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని బైండోవర్ చేస్తున్నారు. సంఘ విద్రోహశక్తుల కదలికలపై నిఘాపెట్టామని, ఏ చిన్న అనుమానం వచ్చినా అరెస్టు చేస్తున్నారమన్నారు పోలీసులు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేసి ప్రజలకు అల్లర్లపై అవగాహన కల్పిస్తున్నారు.
పోలింగ్ రోజు, ఆ తర్వాత రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనలకు పోలీసుల నిర్లక్ష్యం ఒక కారణమని పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో కౌంటింగ్ కు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.
.