TDP BJP Alliance: చంద్రబాబు భయమే నిజమైందా? బీజేపీతో పొత్తుకు తలొగ్గింది ఇందుకేనా?
TDP BJP Alliance: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసి మూడ్రోజులు దాటుతున్నా ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలు మాత్రం అదుపులోకి రావడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ముందే ఊహించి చంద్రబాబు బీజేపీతో పొత్తుకు తలొగ్గినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

TDP BJP Alliance: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొత్త రికార్డు సృష్టించింది. దేశంలోనే అత్యధికంగా పోలింగ్ జరగడం ఒకటైతే, ఎన్నికల తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలతో కూడా రికార్డు సృష్టించింది. పొరుగు రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు ముగిస్తే ఏపీలో మాత్రం అల్లర్లు అదుపులోకి రావడం లేదు. పల్నాడు, చిత్తూరు, అనంతపురం, తిరుపతి, తాడిపత్రిలో జరిగిన ఘటనల్ని అదుపు చేయడంలో పోలీసులు విఫలం అయ్యారు.
ఎన్నికల తర్వాత ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 90ల తొలినాళ్లలో జరిగిన హింసాత్మక ఘటనల్ని కొత్త తరానికి కూడా పరిచయం చేస్తున్నారు. కొత్త శతాబ్దంలో 2000 సంవత్సరం తర్వాత ఓటు హక్కును పొందిన వారికి ఏ మాత్రం పరిచయం లేని ఉద్రిక్తతల్ని తాజా రాజకీయం పరిచయం చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తవుతోంది. 2000 సంవత్సరం తర్వాత 2004, 2009, 2014, 2019లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 90వ దశకం తొలినాళ్లలో ఎన్నికలంటే హింస, ఉద్రిక్తతలు మాత్రమే ఓటర్లకు గుర్తుండేది. దాదాపు పాతికేళ్లుగా ఓటర్లకు ఇలాంటి వాతావరణంతో ఏమాత్రం పరిచయం లేదు. గ్రామాల్లో పట్టింపులు, పంతాలు ఉన్నా దాడులు, ప్రతిదాడులతో జిల్లాలకు జిల్లాలు రగిలిపోయిన సందర్భాలు మాత్రం లేవు.
ముందే ఊహించిన చంద్రబాబు…
2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి పోటీ చేశారు. నాటి ఎన్నికల్లో జనసేన కూడా వారికి మద్దతు ఇచ్చింది. 2019 ఎన్నికల్లో ఎవరికి వారు పోటీ చేశారు. బీజేపీ కనీసం బోణీ కూడా కొట్టలేకపోయింది. జనసేన ఒక్క స్థానానికి పరిమితం అయ్యింది. వైఎస్సార్సీపీ 151 స్థానాలతో రికార్డు స్థాయి విజయాన్ని సాధించింది.
2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ పోటి చేసినా 2018నాటికి ఆ రెండింటి మధ్య బంధం తెగిపోయింది. టీడీపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటి చేసింది. కేవలం 23 స్థానాలకు పరిమితమైంది. 2019 ఎన్నికలు చంద్రబాబుకు చాలా పాఠాలు నేర్పింది. మరోవైపు ఎన్నికల్లో బీజేపీ సహకారం లేకపోతే వైసీపీని ఎదుర్కొని గెలవడం కష్టమనే క్లారిటీ టీడీపీ అధినేతకు ముందే వచ్చింది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి దాదాపు రెండు నెలల పాటు జైల్లో ఉంచారు.
చంద్రబాబు అరెస్ట్ కావడానికి ముందు నుంచి బీజేపీతో సయోధ్య కోసం ప్రయత్నాలు చేసినా అవేమి ఫలించలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనంటూ పవన్ కళ్యాణ్ పదేపదే ప్రకటనలు చేసినా చంద్రబాబుతో జత కట్టేందుకు బీజేపీ సుముఖత వ్యక్తం చేయలేదు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలతో బీజేపీ, టీడీపీల మధ్య బంధం మళ్లీ చిగురించింది.
బీజేపీతో పొత్తు వల్ల ఓట్ల రూపంలో పెద్దగా లాభం ఉండదనే స్పష్టత చంద్రబాబుకు కూడా ఉంది. అదే సమయంలో ప్రభుత్వ వ్యవస్థల నుంచి సహకారం, ఆపత్కాలంలో తగిన మద్దతు లేకపోతే తాము ఏమి చేయలేమనే స్పష్టత చంద్రబాబుకు వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లలో పోలీస్ యంత్రాంగం నుంచి ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో ఎన్నికల వేళ ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ వ్యవస్థలపై నియంత్రణ లేకపోతే తమకు ఇబ్బందులు తప్పవని చంద్రబాబు భయపడ్డారు.
టీడీపీతో పొత్తు, సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీ చివరి నిమిషం వరకు నాన్చుడు ధోరణి అవలంబించినా చంద్రబాబు అన్నింటికి తలొగ్గారు. బీజేపీ కోరిన సీట్లను కేటాయించేందుకు సిద్ధమయ్యారు. సీట్ల విషయంలో బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసినా వారికి నచ్చ చెప్పుకున్నారు.
ఎన్నికల అనంతరం చెలరేగిన హింస…
సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. తిరుపతి, మాచర్ల, నరసరావు పేట, నెల్లూరు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. పరస్పర దాడుల్లో పెద్ద ఎత్తున గాయపడ్డారు.
తిరుపతిలో టీడీపీ అభ్యర్థి మీద వైసీపీ నేతలు చేసిన దాడి కలకలం సృష్టించింది. ఈ పరిణామాలను ఊహించే చంద్రబాబు బీజేపీ మద్దతు కోసమే పొత్తుకు ప్రయత్నించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో బీజేపీతో టీడీపీ పొత్తు లేకుండా ఉంటే మరిన్ని ఘటనలు జరిగి ఉండేవని చెబుతున్నారు. పల్నాడు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఎస్పీలను మార్చకపోయి ఉంటే మరిన్ని దాడులు జరిగేవని అంచనా వేస్తున్నారు.
పల్నాడులో టీడీపీ సానుభూతిపరులు కనీసం ఓటు వేసే అవకాశం కూడా ఇచ్చే వారు కాదని చెబుతున్నారు. బీజేపీతో పొత్తు లేకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి ఉంటే ఖచ్చితంగా ఎన్నికలు ఏకపక్షం అయ్యేవని, రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల టీడీపీ శ్రేణులకు ఓటు వేసే అవకాశం ఉండేది కాదని చెబుతున్నారు. చంద్రబాబు ముందు చూపుతోనే బీజేపీని ఆశ్రయించినట్టు విశ్లేషిస్తున్నారు. కౌంటింగ్ రోజు మరింత హింస చెలరేగుతుందనే అనుమానాలు ఏపీ రాజకీయ పార్టీల్లో ఉంది.
సంబంధిత కథనం