Lok Sabha polls: రేపే లోక్ సభ ఆరో దశ ఎన్నికలు; 8 రాష్ట్రాల్లోని 58 సీట్లకు పోలింగ్
Lok Sabha 6th phase polls: ఢిల్లీలోని మొత్తం 7 స్థానాలు సహా 8 రాష్ట్రాల్లోని 58 లోక్ సభ నియోజకవర్గాలకు మే 25 వ తేదీన ఆరో దశ పోలింగ్ జరగనుంది. చివరి దశ ఎన్నికలు జూన్ 1వ తేదీన జరుగుతాయి. అనంతరం జూన్ 4వ తేదీన కౌంటింగ్ ప్రారంభమవుతుంది.
Lok Sabha 6th phase polls: ఆరో దశ ఎన్నికల పోలింగ్ మే 25, శనివారం జరగనుంది. ఈ దశలో 8 రాష్ట్రాల్లోని 58 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ఢిల్లీలోని మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 58 నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం ముగించాయి. మే 25, శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
డ్రై డేస్
మే 25న ఎన్నికలు జరిగే లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో మే 23 గురువారం సాయంత్రం 6 గంటల నుంచి మే 25 శనివారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలను నిలిపివేయనున్నారు. ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్లోని అన్ని మద్యం దుకాణాలను ఆ రోజుల్లో మూసివేస్తారు. అలాగే,లోక్ సభ ఎన్నికల ఫలితాలను ప్రకటించే రోజైన జూన్ 4న కూడా మద్యం అమ్మకాలు ఉండవు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలింగ్ లో పాల్గొనే నగరాలు ఎన్నికల రోజున డ్రై డేను తప్పనిసరిగా పాటించాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశించింది.
ఢిల్లీలోని ఏడు స్థానాల్లో..
ఢిల్లీలోని ఏడు లోక్ సభ స్థానాలైన చాందినీ చౌక్, తూర్పు ఢిల్లీ, న్యూఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ, వాయవ్య ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ స్థానాలకు మే 25 శనివారం ఒకే దశలో పోలింగ్ జరగనుంది. హర్యానాలోని గుర్గావ్ లో కూడా మే 25న పోలింగ్ జరగనుంది. హర్యానాలో అంబాలా, కురుక్షేత్ర, సిర్సా, హిసార్, కర్నాల్, సోనిపట్, రోహ్తక్, భివానీ-మహేంద్రగఢ్, గుర్గావ్, ఫరీదాబాద్ సహా 10 లోక్ సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరుగుతుంది.
మొత్తం 58 నియోజకవర్గాల్లో
మే 25 శనివారం నాడు ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 58 నియోజకవర్గాల్లో ఆరో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జూన్ 4న లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఆరో దశలో బీహార్ (8), హర్యానా (మొత్తం 10), జమ్మూ కాశ్మీర్ (1), జార్ఖండ్ (4), ఢిల్లీ (మొత్తం 7), ఒడిశా (6), ఉత్తరప్రదేశ్ (14), పశ్చిమ బెంగాల్ (8) నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది.
రాజకీయ నేతల ప్రచారం..
చివరి దశ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి ప్రయాణికులతో ముచ్చటించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ఆ ప్రయాణానికి సంబంధించిన ఫోటోలను రాహుల్ గాంధీ పంచుకున్నారు. పార్టీ అభ్యర్థి కన్హయ్య కుమార్ కు మద్దతుగా రాహుల్ గాంధీ ఢిల్లీలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
‘ఇండియా’ కూటమి విజయం కోసం సోనియా గాంధీ విజ్ఞప్తి
‘ఇండియా’ కూటమి విజయం కోసం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దేశప్రజలకు ప్రత్యేక సందేశం ద్వారా విజ్ఞప్తి చేశారు. ‘‘ఇవి చాలా ముఖ్యమైన ఎన్నికలు. దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకే ఈ ఎన్నికలు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రాజ్యాంగ సంస్థలపై దాడులు వంటి అంశాలపై ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పోరాటంలో మీ పాత్ర పోషించాలి’’ అని ఆమె తన వీడియో సందేశం ఇచ్చారు. కాంగ్రెస్, ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఢిల్లీ ఓటర్లను కోరారు. ‘‘మీ ప్రతి ఓటు ఉపాధిని సృష్టిస్తుంది, ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తుంది, మహిళలకు సాధికారత కల్పిస్తుంది’’ అని సోనియా గాంధీ అన్నారు.