Vijayawada : విజయవాడలో ఘోరం.. పదో తరగతి బాలికపై సవతి తండ్రి అత్యాచారం.. పోక్సో కేసు నమోదు
02 December 2024, 5:15 IST
- Vijayawada : విజయవాడలో ఘోరమైన ఘటన జరిగింది. పదో తరగతి బాలికపై సవతి తండ్రి అత్యాచారం చేశాడు. బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీన్ని బాలిక తల్లి నిలదీసింది. అప్పటి నుంచి సవతి తండ్రి పరారీలో ఉన్నాడు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.
సవతి తండ్రి అత్యాచారం
ఎన్‌టీఆర్ జిల్లా విజయవాడలోని అజిత్ సింగ్ నగర్‌లో దారుణం జరిగింది. బాలికపై సవతి తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం ప్రకారం.. విజయవాడలోని 59వ డివిజన్ లూనా సెంటర్‌కు చెందిన మహిళ.. తన భర్తతో విభేదాలు రావడంతో పన్నెండేళ్ల కిందట అతనితో విడిపోయింది. కుమార్తెతో కలిసి విడిగా నివసిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన అనంత శంకర్‌దాస్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి మహిళ, ఆమె కుమార్తె, శంకర్‌దాస్ కలిసి ఉంటున్నారు.
శంకర్‌దాస్ పెయింటింగ్ పనులు చేస్తుండగా, ఆ మహిళ హౌస్ కీపింగ్ పనులు చేస్తోంది. బాలిక (16) ప్రస్తుతం సింగ్‌నగర్‌లోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. బాలిక తల్లి హౌస్‌కీపింగ్ పనులకు ఇతర ఊర్లుకు వెళ్లి అక్కడే పది నుంచి పదిహేను రోజులుండేది. దీంతో కూతురు వరుస అయ్యే బాలికపై శంకర్ దాస్ కన్నేశాడు. బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా పలుమార్లు బాలికను అత్యాచారం చేశాడు.
నాలుగు నెలల కిందట బాలిక తనకు కడుపులో బాగా నొప్పి వస్తోందని, వాంతులు అవుతున్నాయని తల్లికి చెప్పింది. బాలికను తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్య పరీక్షలు చేయించగా బాలిక గర్భవతి అని వైద్యులు చెప్పారు. అప్పటికే బాలికకు ఆరో నెల వచ్చిందని చెప్పారు. ఆ సమయంలో అబార్షన్ చాలా రిస్క్‌తో కూడినదని స్పష్టం చేశారు. దీంతో బాలికను తల్లి స్కూల్‌కి పంపించకుండా ఖమ్మంలోని తన బంధువుల ఇంటివద్ద ఉంచింది. అక్కడ నుంచి ఆసుపత్రికి వైద్య పరీక్షలు చేయించింది.
ఈ క్రమంలో బాలికను తల్లి నిలదీసింది. గర్భం దాల్చడానికి కారణం ఎవరని అడిగింది. దీంతో బాలిక జరిగిన విషయాన్ని తల్లికి వివరించింది. శంకర్ దాస్ తనను బెదిరించి అత్యాచారం చేశారని తెలిపింది. దీంతో బాలిక తల్లి రెండో భర్త శంకర్ దాస్‌ను నిలిదీసింది. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నాడు. నవంబర్ 18న బాలిక ఆడ శిశువుకు జన్మినిచ్చింది. అప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు శనివారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న శంకర్‌దాస్ కోసం గాలిస్తున్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)