Opinion: ప్రజాగళం’ అమలే కూటమికి అగ్నిపరీక్ష!
12 July 2024, 9:51 IST
- ‘రాష్ట్ర ప్రజలు ఇదే కోరుతున్నారంటూ దాన్ని వారికి ఆపాదించి ‘ప్రజాగళం’ పేరిట సదరు ప్రణాళికను ప్రకటించినపుడు... ఇక ఆచరణకు అదే విధాన పత్రమౌతుంది..’ - ఆంధ్ర ప్రదేశ్ వర్తమాన పరిస్థితులపై పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ పొలిటికల్ అనలిస్ట్ దిలీప్ రెడ్డి విశ్లేషణ.
ప్రజాగళం మేనిఫెస్టో అమలు కూటమికి ఒక పెద్ద సవాలు
ఎన్నికల రాజకీయాల్లో… ప్రజల మనసు గెలుచుకోవడానికి మాటలు చెప్పడం తేలికే! కానీ, చెప్పింది అమలు చేసి విశ్వసనీయత పెంచుకోవడమే కష్టం. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు చెప్పిన మాటలు నమ్మి ప్రజలు అధికారం కట్టబెట్టినపుడు, మాటలు నిలబెట్టుకోవడం, ఇచ్చిన హామీలను అమలు చేయడమే ప్రభుత్వాలకు ప్రధాన ఎజెండా అవుతుంది, కావాలి కూడా.
‘ఓ రాత్రిగడిచిపోయినట్టే... నిన్న ఇచ్చిన మాటా నేడు నీరుగారిపోయింది’ (రాత్ గయా బాత్ గయా) అంటే కుదరదు! ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కలయికతో కొత్తగా ఏర్పడ్డ ఎన్డీయే కూటమి ప్రభుత్వం ముందు ఇప్పుడిదొక పెద్ద సవాల్! ప్రభుత్వాలు సాధారణంగా నిర్వహించాల్సిన బాధ్యతలతో పాటు ‘ఎన్నికల ప్రణాళిక’లో ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలు అమలు పరచడం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం. అది కూడా తమ సొంత ఆలోచన కాదని, రాష్ట్ర ప్రజలు ఇదే కోరుతున్నారంటూ దాన్ని వారికి ఆపాదించి ‘ప్రజాగళం’ పేరిట సదరు ప్రణాళికను ప్రకటించినపుడు... ఇక ఆచరణకు అదే విధాన పత్రమౌతుంది.
రికార్డు స్థాయిలో 164/175 ప్రజాతీర్పే దీనికి గీటురాయి. ‘రెడ్ బుక్’ కాదు, ‘ప్రజాగళం’ పేరిట మీరిచ్చిన హామీలు అమలు చేయండి’ అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పట్నుంచే సర్కార్‌పై చెర్నాకోలా విదిలిస్తున్నారు. ‘మాటిచ్చినట్టుగా ‘నవరత్నాలు’ తొంభై శాతం పైగా నేను అమలు చేశాను’ అని గొంతెత్తే ఆయన, హామీల అమలు విషయమై కూటమి ప్రభుత్వాన్ని కడదాకా వదలరు గాక వదలరు.
అందుకే, హామీల అమలే కూటమి ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్! వాటికి తోడు, ప్రజా తిరస్కారానికి గురైన గత, వైఎస్సార్సీపీ ప్రభుత్వ తప్పుడు విధానాలను కొనసాగించకుండా ప్రజల ఆకాంక్షల మేరకు పాలన అందించాల్సిన బాధ్యత కూడా కొత్త ప్రభుత్వం మీద ఉంది. ఆదాయవనరులు పరిమితమై, అనవసర దుబారాలతో పాటు అప్పుల భారం పెరిగి, గడచిన అయిదేళ్లు రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ కొండెక్కింది.
అది ఒక రకంగా అంతకు ముందరి ప్రభుత్వ (2014-19) నిర్వాకాల కొనసాగింపుగానే ఉండింది. ఈ జాఢ్యం రాష్ట్ర విభజన నుంచీ ఏపీలో జరుగుతున్నదే! కాకపోతే, ఈ అయిదేళ్ల (2019-24) కాలంలో ఇంకొంచెం వేగంగా, మరికొంత దుందుడుకుగా సాగింది. ఫలితంగా గల్లాపెట్టె గుల్లయింది.
దయనీయమైన రాష్ట్ర ఆర్థిక తాజా పరిస్థితి పరంగా చూసినపుడు... ప్రభుత్వం ముందున్నవన్నీ పెనుసవాళ్లే! వీటిని ఎలా అధిగమించి, జనరంజకమైన పాలనను అందిస్తారు? ఆర్థిక సమృద్ధిని ఎలా సాధిస్తారు? అందుకు ప్రాథమ్యాలను ఎలా నిర్ణయిస్తారు? అన్నది కోటి రూకల ప్రశ్న!
ఆర్థిక పరిపుష్టి అన్నిటికీ మూలం
పరిమితికి మించి అప్పులు తీసుకురావటం, రాబడి లేని రంగాల్లో వెచ్చించడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గందరగోళంలో పడింది. వడ్డీలతో కలిపి అప్పులు తిరిగి చెల్లించడానికి కొత్త అప్పులు తీసుకురావాల్సిన దుస్థితి నెలకొంది. ప్రత్యక్ష, పరోక్ష అప్పులతో పాటు ప్రభుత్వం గ్యారెంటీకి నిలిచే ప్రయివేటు కార్పొరేట్ అప్పులతో కలిపి అది 13 లక్షల కోట్ల రూపాయల వరకు వెళ్లినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
క్రమశిక్షణ లేని దుబారా, సంక్షేమ రంగంలో అపరిమిత వ్యయం వల్ల అభివృద్ధికి, అంటే... రోడ్లు, తాగునీరు, విద్యుత్తు, పారిశుద్ధ్యం వంటి కనీస మౌలిక సదుపాయాలకు కూడా ఏ మాత్రం నిధులు వెచ్చించలేని దుస్థితికి రాష్ట్ర ఖజానా చేరింది. దీన్ని ప్రజలు క్షమించలేకపోయారు. అందుకే, దేశ ప్రధానమంత్రినో, ఆర్థిక మంత్రినో కలిసిన ప్రతి సందర్భంలోనూ... ఆర్థికంగా తమకు చేయూతనివ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మిగతా అన్ని అంశాల కన్నా దానికే ఆయన అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. అన్ని రకాల పన్నుల్ని, చార్జీలను పెంచడమే కాకుండా మున్సిపాలిటీల్లో రోజువారీ చెత్త తొలగింపునకు కొత్తగా ‘చెత్తపన్ను’ విధించడం వంటి గత ప్రభుత్వ చర్యలు తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. ప్రజాగ్రహానికి అవీ కారణాలయ్యాయి.
నిర్మాణాత్మక సలహాలేవీ లేకున్నా, ఇచ్చిన అరకొర సలహాలను పాటించే వారే లేని ప్రభుత్వంలో... పెద్ద సంఖ్య సలహాదారులను నియమించుకొని గత ప్రభుత్వం ఎంతో దుబారాకు పాల్పడింది. సాధారణ నిర్వహణతో పాటు ప్రతి హామీ అమలు కూడా భారీగా డబ్బుతో ముడివడిన అంశమే! ఏది జరగాలన్నా పెద్ద మొత్తంలో నిధులు కావాలి. అంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగవ్వాలి. అదే కొత్త ప్రభుత్వం ముందున్న ప్రాథమిక సవాల్!
ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు, మన ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ అన్నట్టు... పన్నేతర రాబడులు పెంచుకొని, దుబారాలు తగ్గించుకొని, సంక్షేమం-అభివృద్ది మధ్య సమన్వయం-హేతబద్దత సాధిస్తే తప్ప ఏపీ ఆర్థిక పరిస్థితి గాడిన పడదు. ప్రతిపైసాకు లెక్క ఉండాలి. సంస్థలు, విభాగాలు, అంతిమంగా ప్రభుత్వం.... ప్రజాధనానికి పూచీకత్తుగా, ప్రజలకు జవాబుదారుగా నిలబడాల్సిందే!
రాజధానిపై మరింత స్పష్టత
ఏపీలో నిన్నటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో కుప్పకూలడానికి దారితీసిన అంశాల్లో ‘రాజధాని’ అనిశ్చితి ఒక కారణం. అప్పటివరకు ఉండిన అమరావతిని కాదని వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల సిద్దాంతాన్ని తెరపైకి తెచ్చింది. విజయవాడ కేంద్రంగా శాసన రాజధాని, విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని, కర్నూలు కేంద్రంగా న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. ఇది పాలనా వికేంద్రీకరణ అని చెప్పింది.
ఈ నిర్ణయానికి న్యాయస్థానంలో, ఇతరత్రా చుక్కెదురు కావడంతో పాలుపోని స్థితికి చేరిన నాటి ప్రభుత్వం, కడకు దేనికీ నిలబడకుండా అనిశ్చితికి కారణమైంది. సుప్రీంకోర్టుకు అస్పష్ట సమాధానం ఇచ్చింది. ఈ అనిశ్చిత పరిస్థితిని కూటమి పక్షాలు ఎన్నికల ప్రచారంలో బాగా వాడుకున్నాయి. ఆ మేర లబ్దిపొందాయి. ఇప్పుడు, పాత పద్దతిన ‘అమరావతి’ని రాజధానిగా అభివృద్ధి చేస్తామని కొత్త పాలకులు ప్రకటించారు. అందుకు అవసరమైన చట్ట-శాసనపరమైన ఏర్పాట్లు జరగాలి. ఈ చర్య, ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేసినట్టో, చిన్నచూపు చూసినట్టో కాదని ప్రజలకు నచ్చజెప్పి, వారిని సంతృప్తిపరచాలి.
అమరావతి అభివృద్ధికి నిధులు ఎలా సమీకరిస్తారు? ఏయే ప్రాధాన్యతలతో ఎన్ని దశల్లో పూర్తిస్థాయి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తారో స్పష్టమైన ప్రకటన చేయాలి. ‘ఇప్పటికే కొంత అభివృద్ధి చెంది ఉన్న విశాఖపట్నంను ఇరవై, పాతిక వేల కోట్లతో ప్రపంచ స్థాయి నగరం చేయగలం, కానీ, పలు పరిమితులున్న విజయవాడ-అమరావతిని లక్ష కోట్ల రూపాయలకు పైగా వెచ్చిస్తే గాని ప్రపంచస్థాయి నగరంగా, సమగ్ర రాజధానిగా తీర్చిదిద్దలేము’ అన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాదనకు కొత్త ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
మూడు రాజధానులకు బదులు మళ్లీ ఒకే రాజధాని అంటే, ఇదివరకు హైదరాబాద్ విషయంలో జరిగినట్టే కేంద్రీకృత పాలన-అభివృద్ధి ప్రమాదం ఉంటుందని, అది రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వ్యతిరేకమని, ప్రాంతీయ అసమానతలు, విబేధాలకు ఆస్కారం కల్పిస్తుందనే బలమైన భావన ప్రజాక్షేత్రంలో ఉంది. అలా జరుగదని, మాటలతోనే కాకుండా సర్కారు తన చర్యల ద్వారా ప్రజలకు భరోసా కల్పించాలి. ఈ సవాల్‌ను కూడా కూటమి ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఆర్థిక క్రమశిక్షణ విషయంలో సర్కారు జవాబుదారుగా నిలవాలి. గతంలో ఎప్పుడూ లేని విధంగా, పత్రికాధిపతి రామోజీరావుకు నివాళి వంటివి అధికారికంగా జరిపేటప్పుడు చేసిన హంగు-ఆర్భాటాలను, ప్రజాధనం ఖర్చును ప్రజలు గమనిస్తారు. సరైన సమాధానాలతో వారిని సంతృప్తిపరచగలగాలి.
పలుకులు-ప్రణాళిక సరే, ఆచరణ ఏది?
వికేంద్రీకృత అభివృద్ధి. ఇది ఇప్పటికిప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన మాట కాదు. గతంలో ఉన్నదే! ప్రత్యేక రాష్ట్రం కోరిన తెలంగాణ వారు కాకుండా సమైక్యత కోరి, విభజనతో అవశేష రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు పదేళ్ల కింద రాజధాని హైదరాబాద్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ప్రత్యేక రాష్ట్రాల ఉద్యమాలు-ఏర్పాట్లలో లోగడ ఎప్పుడూ లేని అరుదైన పరిస్థితి ఇది! భాషా ప్రాతిపదికన ఉమ్మడి మదరాసు రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి కూడా, ప్రత్యేక రాష్ట్రం కోరుకున్న వారే వేరెక్కడైనా కొత్త రాజధాని ఏర్పాటు చేసుకున్న చరిత్ర!
కానీ, తెలంగాణ విషయంలో... హైదరాబాద్ ఇక్కడే నెలకొని ఉన్న భౌగోళిక పరిస్థితుల కారణంగా వారికి రాజధాని దక్కింది. విభజన వల్ల, అవశేష ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్‌ను కోల్పోయి, కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. దశాబ్దాల తరబడి కేంద్రీకృతంగా అభివృద్ది హైదరాబాద్, దాని చుట్టుపక్కల్లోనే జరిగింది. అదొక పాలనా వైఫల్యం!
వలసలతో పాటు వేర్వేరు కారణాల వల్ల, నాటికి అన్ని ప్రాంతాలూ హైదరాబాద్‌తో బంధం అల్లుకున్నాయి. విశాలాంధ్ర ఏర్పడ్డాక, 70 ఏళ్లలో 23 జిల్లాల ఉమ్మడి ఏపీలోని ప్రతి గ్రామానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో హైదరాబాద్‌తో సంబంధాలు ఏర్పడి బలపడ్డాయి. ప్రాంతాలకు అతీతంగా అందరికీ ‘హైదరాబాద్ మాది’ అనే హక్కుభావన ఒకటుండేది. కానీ, ఒక్కసారిగా ‘హైదరాబాద్ మీది కాదు’ అనేసరికి, మనోభావాల పరమైన ఉద్విగ్నత పెరిగింది.
ఈ పరిస్థితి కొత్తగా ఏర్పడే రాజధాని వల్లో, కేంద్రీకృత అభివృద్ధి వల్లో ఇక ముందు జరుగకూడదని విజ్ఞులు ఆలోచించారు. అభివృద్ధిని అన్ని జిల్లాలకు వికేంద్రీకరించాలని ప్రతిపాదించారు. విభజన అంశాల్లోనూ దీన్ని చేర్చారు. 2014 ఎన్నికల తర్వాత, ఇదే చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా నిర్దిష్ట ప్రతిపాదనలు చేసింది. కనీసం ఒకట్రెండు భారీ పథకాలు-కార్యక్రమాలతో ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రత్యేక ‘అభివృద్ధి ప్రణాళిక’ను ప్రకటించింది. కానీ, అమలు చేయడం మరచింది.
అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకున్న ప్రజలది గమనించారు. 2019 ఎన్నికల్లో పాలకపక్షానికది ప్రతికూలంగా పనిచేసింది. ఫలితం, ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. నాటి తప్పును తిరిగి చేయకుండా వ్యవహరించడం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందున్న సవాల్!
ఉద్యమాలకు ఊపిరిపోయొద్దు!
అభివృద్ధి అసమానతలు ప్రాంతీయ అసంతృప్తులకు, అంతిమంగా ప్రాంతీయ ఉద్యమాలకు దారితీస్తాయి. ప్రత్యేక రాష్ట్ర వాదనలు బలపడతాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం! ఇప్పటికే ఉత్తరాంధ్ర, రాయలసీమ రాజుకుంటోంది. గడచిన పదేళ్ల కాలంలో చెదురుమదురుగా భేటీలు, సదస్సులు, సంప్రదింపుల పర్వాలు మొదలయ్యాయి. ‘ఉత్తరాంధ్ర ఉత్తి ఆంధ్ర’గా మారుతోందనే అసంతృప్తి అక్కడి వారిని ఉద్యమ బాటనెంచుకునేలా చేసింది. పలు సమావేశాలు, కరపత్రాల విడుదల వంటివి ఇప్పటికే జరిగాయి.
రాయలసీమలోనూ ప్రాంతీయ అసంతృప్తితో పలు పౌర సంఘాలు కార్యక్రమాలు మొదలెట్టాయి. ‘రాయలసీమ రాష్ట్ర సమితి’ అని, ‘సీమ విద్యావంతుల వేదిక’ అని, స్థానికంగా కార్యాచరణ చేపడుతున్నాయి. నిజమైన బాధితుల ఆందోళనలు సరేసరి! పాలనా వైఫల్యపరమైన పరిస్థితుల్ని అనుకూలంగా మలచుకునే అవకాశవాద శక్తులు ఎప్పుడూ కాచుకొని ఉంటాయి.
వెనుకబాటుతనం, అభివృద్ధి లేమి వల్ల పల్నాడులోనూ ఇలాంటి ఆలోచనలు ఇప్పుడిప్పుడే మొగ్గతొడుగుతున్నాయి. ఇటువంటి ఉద్యమాలు, ఇదివరకటి కన్నా ఇప్పుడు బలోపేతం అయ్యే ఆస్కారం ఎక్కువగా కనబడుతోంది. రాష్ట్ర విభజన తర్వాతి తొలినాళ్లలో ఆలోచించినట్టు జిల్లాకో ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక, చిత్తశుద్దితో దాని అమలు కొంత వరకు ఈ సమస్యకు పరిష్కారం చూపవచ్చు. శ్రీకాకుళం స్మార్ట్సిటీ, భావనపాడు పోర్టు, కొత్త విమానాయ్రం, పైడిభీమవరం పారిశ్రామికవాడ.... ఇలా ఆ జిల్లాకు ఒక ప్రత్యేక ప్రణాళిక ప్రతిపాదించి, అప్పట్లో ప్రకటించారు.
అలాగే తూర్పుగోదావరి జిల్లాకు పెట్రోలియం యూనివర్సిటీ, పోర్టు, పెట్రోకారిడార్, ఫుడ్ పార్క్, తెలుగు విశ్వవిద్యాలయం, కొబ్బరిపీచు ఆధారిత పారిశ్రామిక కాంప్లెక్స్, కాకినాడ-రాజమండ్రిలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడం వంటివి వెల్లడించారు. ప్రకాశం జిల్లాకు... దొనకొండ పారిశ్రామిక నగరం, మైన్స్ మినరల్ సైన్సెస్ యూనివర్సిటీ, ఒంగోల్లో విమానాశ్రయం, రామాయపట్నం పోర్టు.... ఇలా కొన్ని అంశాలు ప్రణాళికలో చేర్చారు.
కర్నూలులో కొత్త విమానాశ్రయం, ట్రిపుల్ ఐటీ సంస్థ, అవుకు వద్ద పారిశ్రామిక వాడ, టూరిజం సర్క్యూట్, టెక్స్టైల్ క్లస్టర్... ఇలా చాలా అంశాలు చేర్చారు. పాత 13 జిల్లాలకూ వేర్వేరుగా ప్రణాళికలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఈ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి, తగు చర్యలు తీసుకోకపోతే కూటమి ప్రభుత్వానికిది పెను సవాల్గా మారటం ఖాయం. ప్రాంతీయ సమగ్రత, సమ్యక్ అభివుద్ధే పరిష్కారం!
ఉద్యోగమో.… ఉపాధో
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందా? రాదా? అన్నది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్న అంశం కావడం, సాధ్యాసాధ్యాలు నేటికీ అస్పష్టంగా ఉండటం కొత్త ప్రభుత్వానికి సంకటం కలిగించేవే! ఈ అంశం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. కేంద్రంలోనూ ఈ కూటమి ప్రభుత్వమే కనుక మరింత బాధ్యత ఉందని ప్రజలూ భావిస్తారు. ఎన్డీయే ప్రత్యక్ష భాగస్వామి అయిన నితీష్ కుమార్ బీహార్‌కు ప్రత్యేక హోదా కోరుతుంటే, ఏపీ విషయంలో ఎలా రాజీపడతారనే ప్రశ్న సవాల్గా కూటమి నాయకత్వానికి తాకుతుంది.
ప్రత్యేక హోదా వచ్చినా, రాకపోయినా... దానికి ఏ మాత్రం తగ్గని విధంగా, కేంద్రం నుంచి రాష్ట్రానికి కనీసం ప్రత్యేక నిధులు, ప్రయోజనాలు తెచ్చారనే భావన ప్రజలకు కల్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్ర యవతకు ఉద్యోగ-ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం ముందుండాలి. కొత్త కంపెనీలు, పరిశ్రమలు, ఉత్పత్తి-సేవా కేంద్రాలు విస్తారంగా ఏర్పడాలి. ఎందుకంటే, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఇవ్వలేని సందర్భంలో నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి కల్పిస్తామని ‘ప్రజాగళం’ పలుకుతోంది. దీని ఆచరణకు ఎంతో చిత్తశుద్ది, నిబద్దత కావాలి. విఫలమైతే యువతరం ఆగ్రహానికి సర్కారు గురికావాల్సి వస్తుంది.
ప్రభుత్వ వివిధ విభాగాల్లో ఇప్పటివరకు జరిగిన అనర్థాలు, ఇప్పుడున్న తాజా స్థితిని ప్రజలకు తెలియజేసే ‘శ్వేతపత్రాల’ వెల్లడికి ఏపీ కూటమి ప్రభుత్వం సమాయత్తమౌతోంది. కేవలం శ్వేతపత్రాలు విడుదల చేయడం వల్ల ఒరిగేదేమీ ఉండదు. తప్పిదాలకు కారకులైనవారిని గుర్తించి, తగు విధంగా శిక్షించడం, సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలను చూపగలిగితేనే సదరు పత్రాలకు విలువ.
ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎలా రక్షిస్తారు? పోలవరాన్ని ఎంత త్వరగా పూర్తి చేస్తారు? ఊబిలో కూరుకుపోతున్న వ్యవసాయ రంగాన్ని ఎలా పైకి తెచ్చి రైతునాదుకుంటారు? జనం భయపడుతున్న భూవివాదాలను ఎలా పరిష్కరిస్తారు? గత ప్రభుత్వంపై తమ అసంతృప్తిని బాహాటంగా వెల్లడించిన ఉద్యోగవర్గాలను ఎలా సంతృప్తిపరుస్తారు....? ఇవన్నీ ప్రభుత్వం ముందున్న సవాళ్లే!
ఏ జ్యోతిబసులాగానో, నవీన్ పట్నాయక్ లాగానో... నిరవధికంగా కాకుండా దశాబ్దాలకు పైబడి ప్రతిపక్షనేతగా అనుభవం గడిస్తూ నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడిది దేశ సమకాలీన రాజకీయాల్లో ప్రత్యేకమైన స్థానం. ఆయన నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి… అన్ని సమస్యల్ని పరిష్కరించుకుంటూ, కొత్త సమస్యలు కొనితెచ్చుకోకుండా, ఇప్పుడున్న పరిస్థితుల్లో జనరంజక పాలన అందించడం నిజంగానే ఒక పెద్ద సవాల్!
-దిలీప్‌రెడ్డి,
పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ