Jagan Tirumala Tour : ఐదేళ్లు సీఎంగా పట్టువస్త్రాలు సమర్పించినా.. జగన్ డిక్లరేషన్ ఇవ్వాలా?: వైసీపీ ఆందోళన
27 September 2024, 14:00 IST
- Jagan Tirumala Tour : ఏపీలో రాజకీయం కాక మీద ఉంది. అందుకు కారణమైంది జగన్ తిరుమల టూర్. జగన్ ఈనెల 28న శ్రీనివారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో.. జగన్ డిక్లరేషన్ ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఐదేళ్లు శ్రీవారికి సీఎం హోదా పట్టు వస్త్రాలు సమర్పించినా డిక్లరేషన్ ఇవ్వాలా అని వైసీపీ ప్రశ్నిస్తోంది.
తిరుమలలో జగన్ (పాత చిత్రం)
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తిరుమల టూర్.. ఆంధ్రాలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. 'శ్రీవారి లడ్డూ పవిత్రతను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారంతో చంద్రబాబు నాయుడు మహాపచారం చేశారు. రాజకీయ దుర్బుద్ధితో చంద్రబాబు చేసిన ఆ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28న ( శనివారం ) పూజలు చేయబోతున్నాం' అని వైసీపీ ప్రకటించింది.
దీంతో కూటమి నేతలు వైసీపీ పై ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా బీజేపీ నేతలు జగన్ తిరుమల పర్యటనను అడ్డుకునే ప్లాన్ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు జి.భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుబాల చంద్రశేఖర్, కార్యదర్శి పి. భాస్కర్, డాక్టర్ డి. శ్రీహరిరావు, వి.వరప్రసాద్ సహా పార్టీ నేతలు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎదుట బైఠాయించారు. జగన్ తిరుమల పర్యటనను వ్యతిరేకిస్తూ గురువారం టీటీడీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.
ఈ వ్యవహారంపై వైసీపీ ఘాటుగా స్పందించింది. తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. 'జగన్‌ను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు. డిక్లరేషన్ అడిగితే ఈ ప్రభుత్వ పతనం ఖాయం. జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోతే.. దర్శనానికి అనుమతి లేదనే హక్కు టీటీడీకి లేదు. ఐదేళ్లు సీఎంగా పట్టువస్త్రాలు సమర్పించినా.. జగన్‌ను డిక్లరేషన్ అడగడం దారుణం. జగన్ డిక్లరేషన్‌పై రాద్ధాంతం జరుగుతున్నా.. చంద్రబాబు మాట్లాడడంలేదు. .డిక్లరేషన్ వెనుక రాజకీయ కుట్ర ఉంది. ప్రభుత్వం ఎంత నిర్బంధిస్తే అంత పైకి లేస్తాం' అని భూమన హెచ్చరించారు.
అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు తిరుపతికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. వైసీపీ కీలక నేతలకు, ముఖ్యంగా రాయలసీమలో ఉన్న వైసీపీ నాయకులకు నోటీసులు ఇస్తున్నారు. దీనిపైనా వైసీపీ స్పందించింది. జగన్ తిరుమలకు వస్తే.. ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించింది. జగన్ ప్రశాంతమైన వాతావరణంలోనే తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
'జగన్‌కు భారతికి క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి జరిగింది. కానీ జగన్ తాను హిందువనే అంటున్నాడు. వైఎస్ఆర్ అంత్యక్రియలు క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారమే జరిగాయి. సీబీఐకి జగన్ ఇచ్చిన అఫిడవిట్‌లో క్రిస్టియన్ అని పేర్కొన్నాడు. జగన్ ఎవర్ని మోసం చేస్తున్నావ్? ఇవాళ ఏసు ప్రభు ఎవరో తనకు తెలియదని జగన్ అంటున్నాడు. ఓ ప్రభువా ఈ జగన్‌ను క్షమించు' అని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
మొత్తానికి తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడుతున్నారనే ఇష్యూ.. ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. వైసీపీ, టీడీపీ మధ్య డైలాగ్ వార్‌కు దారి తీసింది. అటు జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో.. తిరుపతిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు ఆంక్షలు విధించారు. భారీగా తరలి వచ్చేందుకు వైసీపీ కార్యకర్తలు ప్లాన్ చేసుకుంటున్నారు. అడ్డుకునేందుకు కూటమి నాయకులు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఏపీ పాలిటిక్స్ మళ్లీ హీటెక్కాయి.