Kethireddy Venkatarami Reddy : పదవుల కోసం రాలేదు.. రాజకీయాల్లో ఉన్నంతవరకు జగన్ వెంటే ఉంటా: కేతిరెడ్డి
Kethireddy Venkatarami Reddy : కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని నేత. ఇన్నాళ్లు వైసీపీలో కొనసాగిన ఆయన పార్టీ మారుతున్నారనే వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో.. పార్టీ మార్పు ప్రచారంపై స్పందించారు కేతిరెడ్డి. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు.
పార్టీ మార్పు ప్రచారంపై స్పందించారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. తాను పార్టీ మారడం లేదని.. రాజకీయాల్లో ఉన్నంతవరకు జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదన్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే.. జనసేనలో చేరికపై క్లారిటీ ఇచ్చారు.
'నేను పార్టీ మారడం లేదు. 35 ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీతోనే ఉంటున్నాం. ఇకపై కూడా ఆ కుటుంబంతోనే కలిసి నడుస్తాం. రాజకీయాల్లో ఉన్నంతవరకు వైఎస్ జగన్ వెంటే ఉంటా. ఎల్లవేళలా జగన్ కుటుంబానికి తోడుగా ఉంటాం. వైఎస్ జగన్ కుటుంబ సభ్యులే బయటకు వెళ్లారు. కానీ, మా ప్రయాణం మాత్రం జగన్‌తోనే. పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. నన్ను నమ్ముకున్న వారి కోసమే రాజకీయాలు చేస్తున్నాను' అని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వ్యాఖ్యానించారు.
అధికారం కోల్పోయిన తర్వాత.. వైసీపీ నుంచి వలసలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరేందుకు రెడీ అయ్యారు. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా వీరి బాటలోనే నడుస్తారని.. జనసేనలో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. అవన్నీ అవాస్తవం అని కేతిరెడ్డి స్పష్టం చేశారు. తాను జగన్‌తోనే నడుస్తానని చెప్పారు. దీంతో పార్టీ మార్పు ప్రచారానికి బ్రేక్ పడింది.
కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఆయన చిన్నాన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇద్దరూ వైసీపీలోనే ఉన్నారు. 2019లో వెంకటరామిరెడ్డి ధర్మవరం నుంచి, పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి విజయం సాధించారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం ద్వారా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యారు. 2024 ఎన్నికల్లోనూ ఆయన గెలుపు ఖాయం అనే కామెంట్స్ బాగా వినిపించాయి. కానీ.. అనూహ్యంగా కేతిరెడ్డి ఓడిపోయారు. ఆయన చిన్నాన్న కూడా తాడిపత్రిలో పరాజయం పాలయ్యారు.
వెంకటరామిరెడ్డి.. తన తండ్రి కేతిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి హత్య తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. తాడిపత్రి ప్రాంతంలో జేసీ కుటుంబానికి వ్యతిరేకంగా సూర్యనారాయణ రెడ్డి పనిచేశారని.. ఆ ప్రాంత వాసులు చెబుతారు. ఆ తర్వాత వెంకటరామిరెడ్డి ధర్మవరం, పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి పోటీ చేశారు. 2014లో జేసీ కుటుంబం వైసీపీలో చేరుతుందని ప్రచారం జరిగింది. కానీ.. వారు టీడీపీలో చేరారు. కేతిరెడ్డి కుటుంబం మాత్రం వైసీపీలో ఉంది. ఇప్పటికీ ఈ రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని అక్కడి ప్రజలు చెబుతారు.