Tadipatri Tension : భగ్గుమన్న తాడిపత్రి-పెద్దారెడ్డి రాకతో హైటెన్షన్, వైసీపీ నేత ఇంటిపై దాడి
Tadipatri Tension : తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావడంతో వైసీపీ, టీడీపీ వర్గీయులు మరోసారి రెచ్చిపోయారు. ఇరువర్గాలు పరస్పరదాడులు చేసుకున్నారు. వైసీపీ నేత మురళీ ఇంటిపై దాడి చేసి ఫర్నీచర్, వాహనాలు ధ్వంసం చేశారు.
Tadipatri Tension : అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గీయుల ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఫలితాల తర్వాత తాడిపత్రిలో అల్లర్లు చెలరేగాయి. ఇటీవల కాస్త సైలెంట్ అయిన తాడిపత్రి... మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. మంగళవారం సాయంత్రం టీడీపీ, వైసీపీ వర్గీయులు పరస్పరం దాడులు చేసుకున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇవాళ తాడిపత్రికి వచ్చారు. పెద్దారెడ్డి తాడిపత్రికి రాగానే వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తమను కవ్వించారని టీడీపీ కార్యకర్తలు వైసీపీ నేత రఫీపై దాడి చేశారు. ఈ ఘర్షణలో వైసీపీ నేత మురళీ ప్రసాద్ రెడ్డి గన్ తో హల్‌చల్ చేశారు. గన్ బయటికి తీసిన కాల్చి పడేస్తానంటూ బెదిరింపులకు దిగారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.
వైసీపీ నేత మురళి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్, వాహనాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి అనంతపురం పంపించారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పెద్దారెడ్డిని అనంతపురం పంపించామని జిల్లా ఎస్పీ జగదీష్ మీడియాకు తెలిపారు. ఒకరినొకరు రెచ్చగొట్టుకునే ధోరణి సరికాదన్నారు.
వైసీపీ నేత మురళీ తుపాకీ చూపడం వల్లే టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారని టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నారని పోలీసులకు సమాచారం ఉన్నా నిలువరించలేకపోయారన్నారు. పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వచ్చాక వైసీపీ కార్యకర్తలు టీడీపీ వాళ్లను రెచ్చగొట్టారని ఆరోపించారు. మా ఇంటి వద్ద మురళీ తుపాకీ తీసి చూపడంతో టీడీపీ కార్యకర్తలు గట్టిగా సమాధానం చెప్పారన్నారు. తాను తాడిపత్రిలో ప్రశాంతత కోరుకుంటున్నానని, అందుకు పోలీసులు సహకరించాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి చెప్పుకొచ్చారు.
పెద్దారెడ్డి రాకను జీర్ణంచుకోలేకే దాడి- వైసీపీ
తాడిపత్రికి మళ్లీ పెద్దారెడ్డి రావడాన్ని జీర్ణించుకోలేక జేసీ వర్గీయులు దాడి చేశారని వైసీపీ ఆరోపిస్తుంది. మూడు నెలల తర్వాత డాక్యుమెంట్స్ తెచ్చుకోవడానికి ఎస్పీ అనుమతితో పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లారని తెలిపింది. ఈ విషయం తెలుసుకుని వైయస్‌ఆర్‌సీపీ నేత కందిగోపుల మురళీ ఇంటిపై జేసీ వర్గీయులు దాడి చేశారని వైసీపీ ఆరోపించింది. మురళీ ఇంటి వద్ద వాహనాలు, ఇంట్లోని ఫర్నీచర్ ధ్వంసం చేశారని, ఈ దాడిలో వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త రఫీకి తీవ్ర గాయాలు తెలిపింది. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి పంపించారని పేర్కొంది.
సంబంధిత కథనం