Tirupati District : తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 యాక్ట్ - సభలు, ర్యాలీలపై ఆంక్షలు, పోలీసులు కీలక ప్రకటన
తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 24వ తేదీ వరకు ఈ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా పోలీసులు ప్రకటించారు. పోలీసుల అనుమతి తర్వాతే ర్యాలీలు, ఊరేగింపులు, సభలు చేపట్టాలని స్పష్టం చేశారు.
తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా పోలీసులు ప్రకటన విడుదల చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అమల్లో వచ్చిందని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. అక్టోబర్ 24వ తేదీ వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.
ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదని ఎస్పీ స్పష్టం చేశారు. ర్యాలీలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే చట్ట ప్రకారం పోలీస్ శాఖ నుండి ముందస్తు అనుమతి తప్పనిసరని అని పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వివిధ పార్టీ నాయకులు, సంస్థలు, వివిధ సమూహాలు, ప్రజలు పోలీస్ వారి ఉత్తర్వులను పాటిస్తూ శాంతి భద్రతల పరిరక్షణ చేయడానికి పోలీస్ వారికి సహకరించాలని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు విజ్ఞప్తి చేశారు. ఎట్టిపరిస్థితుల్లో నిబంధనలను ఉల్లంఘించవద్దని స్పష్టం చేశారు.
28న తిరుమలకు జగన్…!
ఈ నెల 28న తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించారు. లడ్డూ వివాదం వేళ అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వహించాలని కూడా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో ఏపీలో తిరుమల లడ్డూ వివాదం మరింత ముదిరినట్లు అయింది.
తిరుమల శ్రీవారి విశిష్టతను దెబ్బతీసేలా వ్యవహారించిన చంద్రబాబు తీరుకు ప్రక్షాళన జరగాలని కోరుకోవాలని బుధవారం జగన్ ప్రకటన విడుదల చేశారు. రాజకీయ దుర్భిద్ధితో కావాలని అబద్ధాలడారని ఆరోపించారు. జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా చంద్రబాబు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేశారని చెప్పారు. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేయాలని కోరారు.
జగన్ పిలుపుతో ఈనెల 28న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో పూజలు చేసేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. ఇక జగన్ కూడా తిరమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
అయితే జగన్ తిరుమల పర్యటనపై పలు హిందూ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేసిన మాజీ సీఎం జగన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుమలకు అనుమతించవద్దని డిమాండ్ చేస్తున్నాయి. తిరుమలను ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజకీయ అవసరాలకు వాడుకోవద్దని… అలాంటి చర్యలను అడ్డుకోవాలని కోరుతున్నారు.