Tirumala Laddu : 'అబద్ధాలతో తిరుమల విశిష్టతను అపవిత్రం చేశారు' - ఆలయాల్లో పూజలకు పిలుపునిచ్చిన జగన్
తిరుమల శ్రీవారి విశిష్టతను దెబ్బతీసేలా సీఎం చంద్రబాబు వ్యవహారించారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. చంద్రబాబు చేసిన తప్పును ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో సెప్టెంబరు 28న పూజలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
దేశవ్యాప్తంగానూ తిరుపతి లడ్డూ వివాదం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వమే ఇందుకు సీఎం చంద్రబాబుతో పాటు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అంతా ఆరోపిస్తున్నారు. మొన్నటి వరకు ఉన్న టీటీడీ బోర్డు తీరును తప్పుబడుతున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏకంగా ప్రాయాశ్చిత దీక్షకు కూడా దిగారు.
రాజకీయ దుర్భిద్ధితో కావాలని అబద్ధాలడారని వైఎస్ జగన్ ఆరోపించారు. జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా చంద్రబాబు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేశారని చెప్పారు. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేయాలని కోరారు.
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్.. ప్రధాని నరేంద్ర మోదీకి ఇటీవలన లేఖ రాశారు. తిరుమల లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు పదార్థాలు ఉన్నాయని ప్రచారం చేయడం వల్ల కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని వైఎస్ జగన్ అన్నారు. ఇంత సున్నితమైన అంశాన్ని ఏపీలోని కూటమి పార్టీలు రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారంటూ జగన్ ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు టీటీడీ ప్రతిష్టను దిగజార్చారని వైఎస్ జగన్ ఆరోపించారు.
కూటమి పార్టీల నాయకులు టీటీడీ సంప్రదాయాలపై అనుమానాలు పెంచే విధంగా, భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని జగన్ లేఖలో పేర్కొన్నారు. తిరుమల లడ్డూ వివాదంలో అసలు వాస్తవాలను నిగ్గు తేల్చాలని ప్రధాని మోదీని జగన్ కోరారు. శ్రీవారి లడ్డూ అంశాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఏదైనా పొరపాటు జరిగితే విచారణ చేయించి వాస్తవాలను బయటపెట్టాలని జగన్ కోరారు.
ప్రధాని లేఖ రాయకముందే మీడియా సమావేశంలో కూడా జగన్ మాట్లాడారు. చంద్రబాబు సర్కార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే.. కల్తీ నెయ్యి అంటూ డ్రామా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజకీయాల కోసం చంద్రబాబు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్ చీఫ్ నియమించింది. సిట్‌లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజుతోపాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు ఉన్నారు. సిట్ దర్యాప్తును షురూ చేయనుంది.
సంబంధిత కథనం