Tirumala Laddu : తిరుమల శ్రీవారి లడ్డూలో పొగాకు పొట్లం, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని టీటీడీ ప్రకటన-tobacco wrapper in tirumala laddu social media viral ttd denied allegations ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Laddu : తిరుమల శ్రీవారి లడ్డూలో పొగాకు పొట్లం, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని టీటీడీ ప్రకటన

Tirumala Laddu : తిరుమల శ్రీవారి లడ్డూలో పొగాకు పొట్లం, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని టీటీడీ ప్రకటన

Bandaru Satyaprasad HT Telugu
Sep 24, 2024 03:50 PM IST

Tirumala Laddu : తిరుమల శ్రీవారి లడ్డూలో పొగాకు పొట్లం వచ్చిందని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. లడ్డూ పోటులో వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తి శ్రద్ధలతో లడ్డూలను తయారు చేస్తారని తెలిపింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని భక్తులను కోరింది.

తిరుమల శ్రీవారి లడ్డూలో పొగాకు పొట్లం, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని టీటీడీ ప్రకటన
తిరుమల శ్రీవారి లడ్డూలో పొగాకు పొట్లం, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని టీటీడీ ప్రకటన

Tirumala Laddu : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని పేర్కొంది. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్లు, కొంతమంది భక్తులు సోషల్ మీడియాలో వైరల్ చేయడం భావ్యం కాదని తెలిపింది. తిరుమలలోని లడ్డూ పోటులో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో, శ్రీవారి లడ్డూలను ప్రతిరోజు లక్షలాదిగా తయారు చేస్తారని తెలిపింది.

శ్రీవారి లడ్డూల తయారీని నిరంతరం సీసీటీవీతో పర్యవేక్షిస్తామని టీటీడీ పేర్కొంది. ఇంతటి పకడ్బందీగా లడ్డూలు తయారు చేసే వ్యవస్థలో ఈ విధంగా పొగాకు ఉన్నట్లు దుష్పచారం చేయడం సరికాదని అభిప్రాయపడింది. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరని, తప్పుడు వార్తలను నమ్మవద్దని కోరింది.

లడ్డూలో పొగాకు పొట్లమని ప్రచారం

తిరుమలలో కొనుగోలు చేసిన శ్రీవారి లడ్డూలో పొగాకు పొట్లం వచ్చిందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెంకు చెందిన దొంతు పద్మ అనే భక్తురాలు ఈ నెల 19న బంధువులతో తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్ళింది. బంధువులకు ప్రసాదం పంచేందుకు లడ్డూ తీయగా ప్రసాదంలో పొగాకు పొట్లం కనిపించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పొగాకు కనిపించడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో పొగ కనిపించడంతో భక్తురాలు ఆగ్రహం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. అయితే ఇది అవాస్తమని టీటీడీ తెలిపింది.

నాలుగు రోజుల్లో 14 లక్షల లడ్డూలు అమ్మకం

తిరుపతి లడ్డూలలో జంతు కొవ్వు కలిగిన నెయ్యి ఉపయోగించడంపై వివాదం నెలకొంది. ఏపీలో ఈ ఘటన రాజకీయ వివాదానికి దారితీసింది. ప్రతిరోజూ 60,000 మందికి పైగా భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. లడ్డూ వివాదం ప్రసాదాల అమ్మకాలను ప్రభావితం చేయలేదని ఎన్డీటీవీ తెలిపింది. కేవలం నాలుగు రోజుల్లోనే 1.4 మిలియన్లకు పైగా తిరుపతి లడ్డూలు అమ్ముడుపోయినట్లు ఆలయ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 19న 3.59 లక్షలు, సెప్టెంబర్ 20న 3.17 లక్షలు, సెప్టెంబర్ 21న 3.67 లక్షలు, సెప్టెంబర్ 22న 3.60 లక్షల లడ్డూలు అమ్ముడయ్యాయన్నారు.

రోజుకు సగటున 3.50 లక్షల లడ్డూలు అమ్ముడవుతుందని ఆలయ సాధారణ అంచనాలకు అనుగుణంగా ఈ లెక్కలు ఉన్నాయని నివేదిక తెలిపింది. ప్రతిరోజూ ఆలయంలో 3 లక్షలకు పైగా లడ్డూలు తయారవుతాయి. భక్తులు వాటిని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తారు. తరచుగా కుటుంబ సభ్యులు, స్నేహితులకు బహుమతులుగా ఇస్తారు. శనగలు, ఆవు నెయ్యి, పంచదార, జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం పప్పులతో ఈ లడ్డూలు తయారుచేస్తారు. వీటి తయారీలో రోజుకు 15 వేల కిలోల ఆవు నెయ్యిని వినియోగిస్తారు.

సంబంధిత కథనం