TTD Laddu Prasadam: శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారన్న చంద్రబాబు, నిరూపించాలన్న వైవీ సుబ్బారెడ్డి
TTD Laddu Prasadam: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీపై ముఖ్యమంత్రి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ వంద రోజుల పాలనపై నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు టీటీడీలో జరిగిన వ్యవహారాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారని మండిపడ్డారు.
TTD Laddu Prasadam: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఎన్డీఏ 100రోజుల పాలనపై నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల్ని ఆందోళనకు గురి చేయగా రాజకీయంగా కలకలం రేపాయి.
వైసీపీ ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని కూడా భ్రష్టుపట్టించారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదం నుంచి నిత్యాన్న ప్రసాదం వరకు అన్నింటినీ గత ఐదేళ్లలో సర్వ నాశనం చేశారని మండిపడ్డారు.
స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉపయోగించి తయారు చేయాల్సిన శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో జంతువుల కొవ్వును కలిపారని తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా మార్చేశారని. ఎన్ని ఫిర్యాదుల చేసినా శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీశారన్నారు. మంగళగిరిలో జరిగిన ఎన్డీఏ 100రోజుల పాలనలో సాధించిన విజయాలపై వివరించే క్రమంలో గత ప్రభుత్వ హయంలో జరిగిన అక్రమాలను చంద్రబాబు కూటమి నేతలకు వివరించారు
తిరుమల వ్యవహారాన్ని చక్కదిద్దాలని ఎన్నోసార్లు చెప్పినా తిరుమలలో చాలా దుర్మార్గంగా ప్రవర్తించారని ఆరోపించారు. అన్న ప్రసాదంలోనూ నాణ్యత లేకుండా చేశారని, సాక్షాత్తూ స్వామి దగ్గర పెట్టే ప్రసాదం కూడా అపవిత్రం చేశారని ఆరోపించారు. నాసిరకం సరుకులే కాకుండా, లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వినియోగించారని చెప్పారు.
ప్రస్తుతతం తిరుమల లడ్డూ ప్రసాదాల తయారీకి కర్ణాటక నుంచి నెయ్యిన దిగుమతి చేసుకుంటున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదాల తయారీకి స్వచ్ఛమైన నెయ్యి తెమ్మని ఆదేశించామని, దిట్టం ప్రక్షాళన చేయమని చెప్పడంతో నాణ్యత పెరిగిందన్నారు. ప్రసాదాల నాణ్యత మరింత పెంచుతామని చెప్పారు.
వేంకటేశ్వరస్వామి రాష్ట్రంలో ఉండడం అదృష్టమని ఆయన కోసం ప్రపంచం మొత్తం మన దగ్గరకి వస్తోందని అలాంటప్పడు తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చంద్రబాబు అన్నారు.
వైవీ సుబ్బారెడ్డి ఛాలెంజ్..
తిరుమల శ్రీవారి ప్రసాదాల నాణ్యతపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై టీటీడీ మాజీ ఛైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. తిరుమల లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారనే ఆరోపణల్ని తోసిపుచ్చారు. తన కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి సిద్ధమని, చంద్రబాబు తన కొడుకు, మనుమడితో ఆ ఆరోపణలపై ప్రమాణం చేయాలని సవాలు చేశారు. రాజకీయాల కోసమే చంద్రబాబు ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.