TTD Online Quota: నేడు డిసెంబర్ నెల తిరుమల శ్రీవారి ఆన్‌లైన్ కోటా టిక్కెట్ల విడుదల
TTD Online Quota: తిరుమల శ్రీవారి దర్శనం ఆన్‌లైన్ కోటా టిక్కెట్లను నేడు విడుదల చేయనున్నారు. డిసెంబర్ నెలలో దర్శనాలకు సంబంధించిన టిక్కెట్లను సోమవారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. శ్రీవాణి టిక్కెట్లు, వృద్దులు, వికలాంగుల కోటా, గదుల కోటా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఉంచుతారు.
TTD Online Quota: తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించిన ఆన్‌లైన్ కోటా నేడు విడుదల కానుంది. డిసెంబరు నెల శ్రీవారి దర్శనం టికెట్ల ఆన్‌లైన్‌లో కోటా విడుదల కానుంది. డిసెంబరు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఇవ్వాళ సెప్టెంబరు 23 సోమవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా….
శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన డిసెంబరు నెల ఆన్ లైన్ కోటాను సెప్టెంబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా నవంబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను సెప్టెంబరు 23 మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
సెప్టెంబరు 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
డిసెంబరు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను సెప్టెంబరు 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల…
తిరుమల, తిరుపతిలలో డిసెంబరు నెల గదుల కోటాను సెప్టెంబరు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
సెప్టెంబరు 27న శ్రీవారి సేవ కోటా విడుదల
సెప్టెంబరు 27న తిరుమల – తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
తగ్గిన రద్దీ…
తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం జరుగుతోంది. నిన్న శ్రీవారిని 82,436 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,437 మంది భక్తులు .. తలనీలాలు సమర్పించారు. భక్తుల సమర్పించే కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.57 కోట్లు వచ్చింది.
శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన శాంతి యాగం
తిరుమలలో నెయ్యి కల్తీ వ్యవహారంపై తలెత్తిన వివాదం నేపథ్యంలో ఆలయంలో శాంతి యాగం నిర్వహిస్తున్నారు. శాంతియాగంలో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, ఆగమ సలహాదారులు పాల్గొన్నారు. ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నట్టు ఈవో తెలిపారు. ఉదయం 6 నుండి 10 గంటల వరకు శాంతి యాగం,పంచగవ్యాలతో సంప్రోక్షణ జరుగుతుందన్నారు. లడ్డు పోటు పడిపోటులలో కూడా సంప్రోక్షణ నిర్వహిస్తున్నట్టు ఈవో శ్యామలరావు తెలిపారు.