Tirumala Laddu Row : దేవుడి జోలికెళ్తే ఏమవుతుందో.. జగన్ ఎన్నికల్లో చూశారు: నారా లోకేష్-nara lokesh satires on former chief minister ys jagan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Laddu Row : దేవుడి జోలికెళ్తే ఏమవుతుందో.. జగన్ ఎన్నికల్లో చూశారు: నారా లోకేష్

Tirumala Laddu Row : దేవుడి జోలికెళ్తే ఏమవుతుందో.. జగన్ ఎన్నికల్లో చూశారు: నారా లోకేష్

Basani Shiva Kumar HT Telugu
Sep 26, 2024 06:03 PM IST

Tirumala Laddu Row : తిరుమల లడ్డూ వివాదంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. దేవుడి జోలికెళ్తే ఏమవుతుందో.. జగన్ ఎన్నికల్లో చూశారని వ్యాఖ్యానించారు. అన్ని మతాలను గౌరవించాలన్నారు. ఉత్తరాంధ్రలో పర్యటించిన లోకేష్.. మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.

నారా లోకేష్
నారా లోకేష్ (wikipedia)

మాజీ ముఖ్యమంత్రి జగన్ దేవుడి జోలికి వెళ్తే ఏమైందో.. గత ఎన్నికల్లో మీరంతా చూశారని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఏమతానికి చెందిన వారమైనా అన్నిమతాలను గౌరవించాలని స్పష్టం చేశారు.. చర్చి, మసీదులకు వెళ్లినపుడు వారి మత విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకుంటామన్నారు. తిరుమల వెళ్తానంటున్న జగన్.. డిక్లరేషన్ ఇచ్చే సాంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుందని స్పష్టం చేశారు.

శ్రీకాకుళంలో స్కూలు పరిశీలన అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ నాణ్యతాలోపంతోపాటు అనేక సమస్యలను భక్తులు యువగళం పాదయాత్రలో తన దృష్టికి తెచ్చారని చెప్పారు. అధికారంలోకి వచ్చాక టీటీడీని ప్రక్షాళన చేయాలని ఈఓకు చెప్పామన్నారు. నెయ్యి సరఫరా చేసే కంపెనీ టర్నోవర్ రూ.250 కోట్లు ఉండాలన్న నిబంధనను వైవి సుబ్బారెడ్డి రూ.150 కోట్లకు తగ్గిస్తూ ఎందుకు సవరించారు? అని ప్రశ్నించారు. ఇప్పుడు తిరుమల లడ్డూ క్వాలిటీ బాగుందని వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా చెబుతున్నారని లోకేష్ వ్యాఖ్యానించారు.

మేం పారిపోయే వ్యక్తులం కాదు..

'జగన్‌లా మేం పారిపోయే వ్యక్తులం కాదు. ఇప్పటికే పెన్షన్లు, మెగా డీఎస్సీ హామీలను అమలు చేశాం. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. పథకాల అమలుపై మాకు చిత్తశుద్ధి ఉంది. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. జగన్‌లా పరదాలు కట్టుకుని మేం తిరగడంలేదు. తప్పు చేయకపోతే వారు ఎందుకు భయపడ్డారు? ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలమధ్య ప్రజావేదిక నిర్వహిస్తున్నారు' అని లోకేష్ స్పష్టం చేశారు.

'విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేయబోమని కేంద్రమంత్రి కుమారస్వామి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టంగా చెప్పారు. ప్రైవేటీకరణ లేదని నేను, మా ఎమ్మెల్యేలందరం నిన్న స్పష్టంచేశాం. విశాఖ ఉక్కును బతికించడం కోసం నిధులు మంజూరు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. వైసీపీ నాయకులు ఎందుకు కంగారు పడుతున్నారో అర్థం కావడం లేదు. ఇటీవల వరదలు సంభవించిన సమయంలో కష్టకాలంలో ఉన్న ప్రజలకు మేం అండగా నిలబడ్డాం. జగన్ ప్రజాధనంతో 2 బుల్లెట్ ప్రూఫ్ కార్లు కొనుక్కున్నారు. కానీ ఏ నాడు జనం ముందుకు వెళ్తలేదు. ఎవరు అసలైన ప్రజానాయకులో రాష్ట్రప్రజలకు అర్థమైంది' అని మంత్రి లోకేష్ విమర్శలు గుప్పించారు.

రెడ్ బుక్ పని ప్రారంభమైంది..

'గత ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారు. వారి హయాంలో ఆయా వర్సిటీల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదని నేను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నా. ఆ ప్రకారం ఇప్పటికే రెడ్ బుక్ అమలు ప్రారంభమైంది. చట్టాన్ని అతిక్రమించి తప్పు చేసిన వారిని వదిలేది లేదు. ఇందులో భాగంగా ఐపీఎస్‌లు కూడా సస్సెండ్ అయ్యారు. రైట్ ప్లేస్‌లో రైట్ పర్సన్ ఉండాలన్నదే మా ప్రభుత్వ అభిమతం' అని లోకేష్ స్పష్టం చేశారు.

విద్యారంగాన్ని భ్రష్టు పట్టించారు..

'గత అయిదేళ్లలో వైసీపీ ప్రభుత్వం విద్యారంగాన్ని భ్రష్టుపట్టించింది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో 9 లక్షలమంది విద్యార్థులు తగ్గిపోయారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రస్తుతం మా ముందున్న లక్ష్యం. ఇందుకోసం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాం. ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు రూ.2500 కోట్లు, గుడ్లు, చిక్కీలకు రూ.200 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లారు. అన్నింటినీ తీర్చుకుంటూ వస్తున్నాం. జగన్ ధ్వంసం చేసిన విద్యావ్యవస్థను ఒక పద్ధతి ప్రకారం బాగుచేస్తాం' అని లోకేష్ వ్యాఖ్యానించారు.

'నేను జిల్లాల పర్యటనకు వెళ్లినపుడు ఒకరోజు పూర్తిగా స్కూళ్ల పరిశీలనకు కేటాయిస్తున్నాను. వాస్తవాలను తెలుసుకోవడానికి స్కూళ్లను తనిఖీ చేస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాల మెరుగుదలకు మౌలిక సదుపాయాల కల్పనతోపాటు తల్లిదండ్రులు, టీచర్లు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం వహించాలి. ఇందుకోసం పేరెంట్ –టీచర్స్ సమావేశాలు నిర్వహిస్తాం. ముఖ్యమంత్రి నుంచి వార్డు మెంబరు వరకు అందరం ఈ సమావేశాలకు హాజరై పాఠశాలల మెరుగుదలకు వారి సలహాలు తీసుకుంటాం. స్కూలు గోడకూలి విద్యార్థి మృతిచెందిన ఘటనపై అధికారుల నుంచి నివేదిక కోరాం. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం' లోకేష్ స్పష్టం చేశారు.