Modi Cabinet : కేంద్ర మంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, శ్రీనివాస వర్మ ప్రమాణ స్వీకారం
09 June 2024, 21:46 IST
- Modi Cabinet : మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీతో ప్రమాణ స్వీకారం చేయించారు. టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
కేంద్ర మంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, శ్రీనివాస వర్మ ప్రమాణ స్వీకారం
Modi Cabinet : కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువుదీరింది. ఆదివారం సాయంత్రం దిల్లీలో అంగరంగ వైభవంగా ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకారానికి ముందు ఎంపీ రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఏపీ అభివృద్ధే మాకు ముఖ్యం రామ్మోహన్ నాయుడు అన్నారు. కేంద్ర కేబినెట్ లో చేరడానికి తాము ఎలాంటి డిమాండ్లు చేయలేదని వెల్లడించారు. చాలా సమయం తర్వాత టీడీపీకి కేంద్రమంత్రి పదవి దక్కిందన్నారు. కేంద్రంతో సఖ్యతే మాకు ముఖ్యమన్నారు. ఎన్డీఏ పార్టీల మధ్య దృఢమైన సంబంధాలు ఉన్నాయన్నారు. కాబట్టి చర్చలు జరిపిన తర్వాతే ఏదైనా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. రిజర్వేషన్ల అంశంలో తమ ఆలోచనలో మార్పు లేదని స్పష్టం చేశారు.
కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి వరకు
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన భూపతిరాజు శ్రీనివాసవర్మ వైసీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలపై 2.76 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. శ్రీనివాస వర్మ ఏపీ బీజేపీలో సీనియర్ నేత. ఏళ్ల పాటు బీజేపీలో పనిచేశారు. 1988లో బీజేపీ కార్యకర్తగా తన రాజకీయ జీవితం ప్రారంభించిన శ్రీనివాస వర్మ...1992-95లో జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు. 2008 నుంచి 2014 వరకు రెండు సార్లు పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో భీమవరం మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన ఆయన...ఇన్‌ఛార్జ్ ఛైర్మన్‌గా సేవలందించారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో నర్సాపురం ఎంపీగా విజయం సాధించారు. భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేశారు.