Mudragada Padmanabham: వైసీపీలో చేరనున్న ముద్రగడ పద్మనాభం...నేడు ముద్రగడ నివాసానికి ఎంపీ మిథున్ రెడ్డి
07 March 2024, 9:26 IST
- Mudragada Padmanabham: కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడంపై స్పష్టత రాకున్నా వైసీపీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మార్చి 12న ముద్రగడ వైసీపీలో చేరనున్నట్టు సమాచారం.
వైసీపీలో చేరనున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం
Mudragada Padmanabham: ఎన్నికల వేళ ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీ YCPలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. గురువారం ముద్రగడ నివాసానికి గోదావరి జిల్లా ఇన్‌ఛార్జి మిథున్ రెడ్డి MP Mithun Reddy వెళ్లనున్నారు. కొద్ది రోజుల క్రితం ముద్రగడ పద్మనాభం తాజా పరిణామాలపై బహిరంగ లేఖను సైతం విడుదల చేశారు.
కొద్ది వారాల క్రితం ముద్రగడ పద్మనాభం జనసేనలో Janasenaకి వెళ్తారని ప్రచారం జరిగింది. ముద్రగడతో చర్చలు జరిపేందుకు పవన్ కళ్యాణ ఆయన ఇంటికి వస్తారని వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఏమి జరిగిందో కానీ పవన్ కళ్యాణ్ రాకపోవడం, టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరిగిపోయాయి. దీంతో ముద్రగడ మరో లేఖను విడుదల చేశారు. 24సీట్లలో మాత్రమే పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్‌కు తమ అవసరం ఉండకపోవచ్చని పేర్కొన్నారు.
ఈ క్రమంలో బుధవారం రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు, గణేష్ ముద్రగడతో చర్చలు జరిపారు. ఉమ్మడి గోదావరి జిల్లా కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డితో మాట్లాడించారు. ఈ క్రమంలో ఎవరి సూచనలతో తనను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారనే దానిపై స్పష్టత కోరినట్టు చెబుతున్నారు. సిఎం జగన్ ఆదేశాలతోనే పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు మిథున్ రెడ్డి వివరణ ఇవ్వడంతో ముద్రగడ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో ముద్రగడ కుటుంబం పోటీ చేయడంపై స్పష్టత రాకపోయినా ఆయన కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చినట్టు అనుచరులు చెబుతున్నారు. టీడీపీ-జనసేనల్లో ముద్రగడ చేరుతారని ప్రచారం జరిగినా చివరి నిమిషంలో ఆ ప్రయత్నాలు ఆగి పోయాయి. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్న నేపథ్యంలో ముద్రగడను ఆయనపై పోటీకి నిలబెడతారని ప్రచారం కూడా ఉంది.
కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభం నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రత్తిపాడు నియోజక వర్గం నుంచి ముద్రగడ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1978, 1983, 1985,1989 ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభయం ఎమ్మల్యేగా గెలిచారు. 1978లో జనతా పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముద్రగడ, 1983, 1985లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. 1994లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రత్తిపాడు నియోజక వర్గం లో ముద్రగడ కుటుంబం ఆరుసార్లు గెలుపొందింది. పద్మనాభం ఓసారి ఎంపీగా కూడా గెలిచారు. ఎన్టీఆర్, చెన్నారెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు.
1994లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఓడిపోయిన ముద్రగడ 1999లో టీడీపీ తరపున ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున పిఠాపురంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
కాపు రిజర్వేషన్ల కోసం టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఉద్యమించారు.ఆ తర్వాత కాలంలో ఆయన ఏదొక రాజకీయ పార్టీలో చేరుతారని పలు సందర్బాల్లో ప్రచారం జరిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ముద్రగడ తనయుడికి నామినేటెడ్ పదవిని ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి ముందే ముద్రగడ కుమారుడికి నామినేటెడ్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.