Mudragada: ముద్రగడ నివాసానికి జ్యోతుల నెహ్రూ… మారుతున్న సమీకరణలు
Mudragada: ఏపీలో రాజకీయ సమీకరణలు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. కాపు ఉద్యమ నేత నివాసానికి టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
Mudragada: ముద్రగడ పద్మనాభం కేంద్రంగా ఏపీలో కాపు రాజకీయం జరుగుతోంది. బుధవారం ముద్రగడతో జనసేన నేతలు, కాపు జేఏసీ ప్రతినిధులు భేటీ అయ్యారు. గురువారం కిర్లంపూడిలో ముద్రగడ నివాసానికి టీడీపీ సీనియర్ నాయకుడు జ్యోతులు నెహ్రూ వచ్చారు. జనసేన నేతలతో భేటీపై ముద్రగడ పద్మనాభం మౌనం వహించినా రెండు మూడు రోజుల్లో పవన్ కళ్యాణ్‌తో ముద్రగడ భేటీ ఉంటుందని చెబుతున్నారు.
గురువారం ఉదయం ముద్రగడ ఇంటికి టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ వచ్చారు. కాపులంతా ఐక్యంగా ఉండాలనే ప్రతిపాదనతోనే చర్చలు జరిపినట్లు ప్రచారం జరిగింది. ముద్రగడ భవిష్యత్ కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీలో చేరతారనే దానిపై ముద్రగడ కుటుంబం క్లారిటీ ఇవ్వలేదు.
ముద్రగడను కలిసిన జనసేన నేతలు బొలిశెట్టి, తాతాజీ, కాపు జేఏసీ నేతలు తాము మర్యాద పూర్వకంగా ముద్రగడను కలిసామని చెబుతున్నారు. రెండు రోజుల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ముద్రగడను కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. జనసేన నేతల భేటీపై ముద్రగడ పద్మనాభం ఎలాంటి ప్రకటన చేయలేదు.
మరోవైపు పార్టీ హైకమాండ్ తనను ముద్రగడ వద్దకు పంపలేదని జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా మాత్రమే తాను ముద్రగడను కలవడానికి వచ్చానని చెప్పారు. తనకు అన్ని విధాలుగా సహకరిస్తానని ముద్రగడ హామీ ఇచ్చారని చెప్పారు. రాజకీయంగా తనకు అన్ని విధాలుగా సహకరిస్తానని ముద్రగడ హామీ ఇచ్చారని జ్యోతుల ప్రకటించారు.
మారుతున్న సమీకరణలు
కొద్ది రోజుల క్రితం ముద్రగడ కుటుంబం వైసీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. వైసీపీ నుంచి నిర్దిష్టమైన హామీ లభించకపోవడంతో ముద్రగడ వెనక్కి తగ్గినట్టు చెబుతున్నారు. ఆ తర్వాత ముద్రగడతో జనసేన నేతలు, టీడీపీ నేతలు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
ఒకటి, రెండు రోజుల్లో ముద్రగడతో జనసేన ముఖ్యనేతలు భేటీ అవుతారని ఆ తర్వాత ముద్రగడ విషయంలో క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. కాపులంతా ఏకం కావాలంటూ ఇటీవల పవన్ లేఖ రాశారు. పవన్ లేఖను ముద్రగడ పద్మనాభం స్వాగతించడాన్ని గుర్తు చేస్తున్నారు.
మరోవైపు ముద్రగడ వైసీపీలో చేరడానికి ఆసక్తిగా లేరని ముద్రగడ కుమారుడు గిరిబాబు చెప్పారు. టీడీపీ, జనసేనలో ముద్రగడ చేరుతారని మీడియా చిట్‌చాట్‌లో చెప్పారు. కాకినాడ పార్లమెంట్‌తో పాటు ప్రత్తిపాడు, పిఠాపురంలలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తండ్రితో పాటు తాను కూడా పోటీ చేస్తాని చెపారు. జనసేన, టీడీపీల్లో చేరేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. ఏ పార్టీలో చేరాలనే దానిపై ముద్రగడ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.