Somu Veerraju : ముద్రగడ, పవన్ వివాదాన్ని కులపరంగా చూడొద్దు- సోమువీర్రాజు సంచలన వ్యాఖ్యలు
Somu Veerraju : ముద్రగడ-పవన్ మధ్య వివాదంపై సోము వీర్రాజు స్పందించారు. ఇద్దరూ ప్రజా జీవితంలో ఉన్నారని, వారి మధ్య వివాదం రాజకీయంగా చూడాలి తప్ప కులపరంగా చూడొద్దన్నారు.
Somu Veerraju : టీడీపీ, బీజేపీ పొత్తు, ముద్రగడ-పవన్ వివాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ఊహించుకుంటున్నారన్నారు. టీడీపీతో బీజేపీ పొత్తుపెట్టుకుంటుందని ఎవరు చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ పెద్దలతో భేటీ అనంతరం చంద్రబాబు పొత్తుల అంశం ప్రస్తావించలేదన్నారు. చంద్రబాబు బీజేపీ నేతలు భేటీ, వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ పెద్దల విమర్శలు చేయడాన్ని ఎవరికి వారు అన్వయించుకుని మాట్లాడుతున్నారన్నారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలనేది తన కోరిక అన్నారు. ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మధ్య వివాదంపై సోము వీర్రాజు స్పందించారు. ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నారన్న ఆయన... వారిద్దరి మధ్య వివాదం కులపరంగా చూడకూడదన్నారు. వారిద్దరి మధ్య వివాదం రాజకీయంగా మాత్రమే చూడాలన్నారు.
ఏపీలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్
ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా మే 30 నుంచి వివిధ కార్యక్రమాలతో ప్రజల వద్దకు వెళ్లామని సోము వీర్రాజు తెలిపారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అయిందన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు మారుతున్నాయని, బీజేపీకి అనుకూల వాతావరణం వస్తుందని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రధాని కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో కూడా బీజేపీ విజయం సాధిస్తుందన్నారు. తాము ఎక్కడికి వెళ్లినా ప్రజలు మంచి స్పందన వచ్చిందని, ప్రజలు తమ కష్టాలు చెప్పుకుని కన్నీళ్లు పెడుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఒక అంశంలో అద్భుతంగా పనిచేశామని చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఎన్ని రోడ్లు వేశారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పగలదా అని నిలదీశారు. ఏపీలో అభివృద్ధి కేవలం మోదీ చేసిన సాయమే అన్నారు. కేంద్రం ఇస్తున్న పథకాలకు వారి పేర్లు పెట్టుకోవడమే తప్ప రాష్ట్ర ప్రభుత్వంచేసిందేం లేదన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ కోసం ఏర్పాటుచేసేందుకు పనిచేస్తామని సోమువీర్రాజు తెలిపారు.
వైసీపీకి దగ్గర కాదు
వైసీపీకి బీజేపీ ఎప్పుడూ దగ్గరగా లేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ అవినీతిపై పోరాడుతున్నామని తెలిపారు. తాము ఓ పార్టీకి దగ్గరగా ఉన్నామని చెప్పేందుకు కొంత మంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జగన్ పై బీజేపీ పెద్దలు విమర్శలు చేశారని, మరి వారిపై చర్యలెప్పుడు తీసుకుంటున్నారని టీడీపీ బీజేపీని ప్రశ్నించింది. జగన్ ను విమర్శిస్తే సోము వీర్రాజుకు కోపమెందుకు వస్తుందని టీడీపీ నిలదీస్తుంది. దీనిపై సోము వీర్రాజు స్పందిస్తూ... తన మాటలను వ్యతిరేకంగానో అనుకూలంగానో చూడాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో ఏపీకి నష్టం జరుగుతుందని స్పందించామన్నారు.