Mudragada vs Pawan: దమ్ముంటే నాపై పోటీ చేయ్.. పవన్ కు ముద్రగడ సవాల్-mudragada padmanabham another letter to pawan kalyan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mudragada Vs Pawan: దమ్ముంటే నాపై పోటీ చేయ్.. పవన్ కు ముద్రగడ సవాల్

Mudragada vs Pawan: దమ్ముంటే నాపై పోటీ చేయ్.. పవన్ కు ముద్రగడ సవాల్

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 23, 2023 05:52 PM IST

Mudragada Letter to Pawan: పవన్ కు మరోసారి లేఖాస్త్రాన్ని సంధించారు కాపు నేత ముద్రగడ పద్మనాభం. గోచీ, మొలత్రాడు లేని వారితో తిట్టించడమేంటని ప్రశ్నించారు.

పవన్‌కు ముద్రగడ ప్రశ్నాస్త్రాలు
పవన్‌కు ముద్రగడ ప్రశ్నాస్త్రాలు

Mudragada Padmanabham: జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్ గా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరో లేఖాస్త్రాన్ని సంధించారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ముద్రగడ లేఖ రాయటాన్ని జనసైనికులు తీవ్రంగా ఖండించారు. అయితే వీటిపై రియాక్ట్ అయిన ముద్రగడ…. తాజాగా పవన్ కు మరో లేఖ రాశారు. ఇందులో సూటిగా 30 ప్రశ్నలు సంధించారు. పవన్ కల్యాణ్ గురించి తానెప్పుడు ఒక స్టెట్ మెంట్ ఇవ్వలేదని ముద్రగడ గుర్తు చేశారు. అలాంటి నన్ను తిట్టడం మీ దృష్టిలో తప్పో రైటో గ్రహించాలని పవన్ కల్యాణ్ ను ప్రశ్నించారు. మీ వ్యాఖ్యలపై స్పందించిన నాపై జనసైనికులు ఇష్టానుసారంగా తిడుతూ.. బూతు సందేశాలు పెడుతున్నారని... అలాంటి వాటికి భయపడి వ్యక్తిని తాను కాదని ముద్రగడ స్పష్టం చేశారు.

ముద్రగడ ప్రశ్నలు:

-నన్ను తిట్టినదానికి నేను సమాధానం వ్రాయడంతో ఎక్కడా లేని కోపంతో మీ అభిమానుల చేత బండ బూతులతో మెస్సేజులుపెట్టిస్తున్నారు. ఆ మెస్సేజ్లకు భయపడిపోయి నేను లొంగుబాటుకు వస్తానని అనుకుంటున్నారేమో అది ఈ జన్మకు జరగదు. అలా పెట్టించడం వలన మీరు పెద్ద హీరో అనుకుంటున్నారు. సినిమాలో హీరో తప్ప రాజకీయాలలో హీరో కాదన్నది గ్రహించండి.

- నన్ను మీరు గాని, మీ అభిమానులు గాని తిట్టవలసిన అవసరం ఏమొచ్చింది. మీ వద్ద నేనేమి నౌకరీ చేయడం లేదే? నాకు ఏరకంగాను స్వంత అభిప్రాయలు ఉండకూడదా? మీకు తొత్తుగా ఉండాలా? మీకు నాకుసంబంధం ఏమిటి..? మీకు డబ్బు ఉంది కాబట్టి మీ అభిమానుల చేత నన్ను తిట్టిస్తారా? నా శరీరంలో చీము, నెత్తురు లేకపోవడం వలన పౌరుషం పూర్తిగా పోయింది. నేనొక అనాధను ఒంటరి వాడిని ఏమన్నా పడతాననే.. గర్వమా?

-1988లో వంగవీటి రంగాగారిని హత్య చేసిన తరువాత ఎంతో మందిని అమాయకులను జైలులో పెట్టిన సంఘటన. ఆ సందర్భములో జైలులో ఉన్న వారిని ఎప్పుడైనా తమరు వెళ్ళి చూసారా? జైలులో ఉన్న వారి కుటుంభాలకు ధైర్యం చెప్పడం కోసం ఏ రోజైనా పలకరించడానికి వారి గృహాలకు వెళ్ళారా? జైలులో ఉన్న వారికి బెయిల్స్ తేవడం కోసం ఎప్పుడైనా అడ్వకేట్స్తో మాట్లాడారా..? జైలులో ఉన్న వారి మీద టెర్రరిస్టుల కోసం తయారు చేసిన చట్టంలోని కొన్ని సెక్షన్లు వేసి కేసులు పెట్టిన సంగతి తమరెరుగుదురా..?

-1988-89లో 3500 మంది అమాయకుల పై పెట్టిన కేసులు తీసివేయమని ఎప్పుడైనా అప్పటి గౌరవ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారిని కలిసి కోరారా? 1993-94 లో రావులపాలెంలో అప్పటి ముఖ్యమంత్రి గారి సభలో కాపులను గొడ్డును బాదినట్లుగా బాదిన బాదితులను ఏరోజైనా పలకరించారా? 1993-94 ఉద్యమ సందర్భముగా అప్పట్లో పెట్టిన కేసులు అప్పటి ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబునాయుడు గారిని తీసివేయమని అడిగారా? ఎవరు కోరకుండానే ఆరోజు కాపులపై పెట్టిన కేసులు గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసేసిన సంగతి మీకు తెలుసా...?

-2016 తుని సభ మరియు తరువాత పెట్టిన కేసులలో ఉన్న వారిని ఎప్పుడైనా పలకరించారా? అక్రమంగా అన్యాయంగా పెట్టిన కేసులు తీసివేయమని గౌరవ చంద్రబాబునాయుడు గారిని, గౌరవ జగన్మోహనరెడ్డిగారిని ఎప్పుడైనా కోరడం జరిగిందా? గౌరవ కాపు మంత్రుల కోరికపై గౌరవ జగన్మోహనరెడ్డి గారు 2016 నుండి పెట్టిన కేసులు తీసివేసిన సంగతి తెలుసా? నేను వ్రాసిన ఈ సంఘటనలలో ఎవరి పాత్ర ఉందో మీకు గాని, మీ వన్ మేన్ ఆర్మీకి గాని తెలుసాండి? ఈ కులం కోసం నేనేమీ చేయనట్టు స్వార్థ పరుడను అని కులాన్ని ఉపయోగించుకుంటున్నానని, అమ్మేసానని రకరకాల మాటలు చెప్పడం సినిమా డైలాగులను మరిపించిందండి.

- గోచీ, మొలత్రాడు లేని వారితో తిట్టించడం మగతనం కాదు. దమ్ము, ధైర్యం ఉంటే, మీరు తిట్టండి, గోచీ, మొలత్రాడు ఉన్న వారితో సమాధానం చెప్పించగలను. ఒక విషయం పవన్ గారు కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకెక్కడిది. ఏనాడైనా కాపుల గురించి ఆలోచించిన సందర్భం ఉందా.? యువతను భావోద్వేగానికి గురి చేస్తున్నది ఎవరో మీ ప్రసంగాలలోనే తెలుస్తోంది.

- ఈ మధ్య డా॥ అంబేద్కర్ కోన సీమ జిల్లా పేరు పెట్టిన సందర్భములో అగ్నిగుండంగా మారిన గొడవలలో ఎంతో మంది అమాయకులపై పెట్టిన కేసులకు బెయిల్ రాని పరిస్థితులలో ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు వారికి అండగా నేను ఉన్నానని నిత్యం మిమ్మల్నే తరించే వారికోసం కోనసీమకుతమరు ఎందుకు వెళ్ళలేదు? వీరికి బెయిల్ కోసం అడ్వకేట్స్తో మాట్లాడి బెయిల్ వచ్చే ఏర్పాటు ఎందుకు చేయలేదు? కేవలం తమరి కోసం అందరూ రోడ్డు మీదకు రావాలి? రోడ్డు మీదకు వచ్చిన వారు ఆపదలో ఉన్నప్పుడు వారికి మీరు చేతనైన సహాయం చేయరా? మీరు నన్ను తిట్టిన తరువాత మాత్రమే స్పందించాను. చంద్రశేఖరరెడ్డి గారి కుటుంబంతో ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. మీ కోసం వారిని దూరం చేసుకోను. ఈ బంధంపై మీ అభిమానుల చేత తిట్టిస్తున్నారు. "డోంట్ కేర్” నేనేమి మీ బానిసను కాదు... కాదు..!

- సినిమా చరిత్రలో మీ అభిమానులు పడే బాధలు పెట్టే ఖర్చులు మీ దృష్టికి తేవాలనిపించింది. సినిమా రిలీజుకి కొన్ని రోజుల ముందు ప్లెక్సీలు పెట్టడం, రిలీజు రోజున స్వీట్లు మరియు బాణసంచా కోసం వేలాది రూపాయలు ఖర్చు పెట్టడం. మొదట రెండు మూడు వారాలు చిత్రం హౌస్ఫుల్ అవ్వకపోతే అమ్ముడు పోని టిక్కెట్లు మీ అభిమానులు డబ్బులు వేసుకుని ప్రతీ రోజు కొంటూఉంటారు.

- అఖరిగా నా బలమైన కోరిక మీ ముందు పెడుతున్నాను. కాకినాడ ఎమ్.ఎల్.ఎ గారు, నేను కోరినట్టుగా కాకినాడ నుండి పోటీ చేయడానికి నిర్ణయం తీసుకోండి. ఏకారణం చేతనైనా తమరు తోక ముడిస్తే పిఠాపురం నుండి పోటీ చేయడానికి తమరు నిర్ణయం తీసుకుని నన్ను మీ మీదకు పోటీ చేయడానికి నాకు సవాలు విసరమని కోరుకుంటున్నానండి. “చెగువేరా” మీకు ఆదర్శం అని చెప్పుకుంటారు, గుండెలనిండా ధైర్యం ఉందని అంటారు కాబట్టి ఏదో ఒక కోరిక తప్పకుండా తీర్చే శక్తి పౌరుషం మీకు ఉన్నాయని నేను భావిస్తాను" అంటూ రాసుకొచ్చారు ముద్రగడ పద్మనాభం.

IPL_Entry_Point